Indian-woman-as-Lawyer-in-Canada

ఈ గిల్‌ తీర్పుల్లో ‘షేర్‌’

ఆంధ్రజ్యోతి, 10-07-2017: భారత సంతతికి చెందిన ఎందరో మహిళలు నేడు అంతర్జాతీయంగా పలుదేశాల్లో కీలక పదవులను అధిరోహిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. కెనడా మానవహక్కుల న్యాయవాది పల్‌బిందర్‌ కౌర్‌ షేర్‌గిల్‌ కూడా ఆ కోవలోకే వస్తారు. ఆమెది జలంధర్‌లోని మారుమూల పల్లె. అక్కడి నుంచి కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా (బిసి) సుప్రీంకోర్టులోకి కాలుపెట్టారామె. తలపాగా ధరించిన తొలి సిక్కు మహిళా న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. పల్‌బీందర్‌ కౌర్‌ షేర్‌గిల్‌ మీదే నేడు అందరి చూపులు... కెనడాలోని ప్రొవెన్షియల్‌ సుప్రీంకోర్టులో తలపాగా ధరించిన తొలి సిక్కు మహిళా జడ్జ్డిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. తలపాగా సహజంగా సిక్కు పురుషులు ధరిస్తారు. కానీ షేర్‌గిల్‌ టర్బన్‌ ధరించి తన ప్రత్యేకతను చాటారు. జండర్‌ సమానత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పటికే కెనడా న్యాయవ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న షేర్‌గిల్‌ కెనడాలోని సిక్కు కమ్యూనిటీకి, మహిళలకు మరింత అండగా నిలిచి ప్రముఖ పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు.

 
జలంధర్‌లోని పల్లె నుంచి...
షేర్‌గిల్‌ స్వంత గ్రామం జలంధర్‌లోని రూర్కా కలాన్‌. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లితండ్రులు కెనడాకు వలసవచ్చారు. కెనడాలో ఉన్న బ్రిటిష్‌ కొలంబియాలోని విలియమ్స్‌ లేక్‌లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి జ్ఞాన్‌ సింగ్‌ సాంధు ఐఎఎఫ్‌ మాజీ ఉద్యోగి. షేర్‌గిల్‌ బ్రిటిష్‌ కొలంబియాలోనే పెరిగి పెద్దదైంది. చిన్నప్పటి నుంచి షేర్‌గిల్‌కు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ ఎక్కువ. షేర్‌గిల్‌ సాస్‌కచ్‌వాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌కు సమీపంలో ఉన్న జగత్‌పూర్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ షేర్‌గిల్‌తో పల్‌బీందర్‌ వివాహమైంది. బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో భర్త, పిల్లలతో ఆమె ఉంటున్నారు. ఇండియాను వదిలి నాలుగు దశాబ్దాల పైగా అవుతున్నా ఇక్కడి బంధుమిత్రులతో ఆమెకు నేటికీ ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. రెండేళ్ల క్రితమే తను పుట్టిన రూర్కా కలాన్‌కు వెళ్లొచ్చారు కూడా ఆమె. ఆ గ్రామంలోని పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి కుటుంబం ఆ ఊరిలో ఒక కంప్యూటర్‌ కేంద్రం, కుట్టు కేంద్రాలను నిర్వహిస్తోంది. షేర్‌గిల్‌ మానవహక్కుల న్యాయవాదిగా పనిచేశారు.స్వంత సంస్థలైన షేర్‌గిల్‌ అండ్‌ కంపెనీ, ట్రయల్‌ లాయర్స్‌ ద్వారా ట్రయల్‌ లాయర్‌గా న్యాయ సేవలు అందించారు. 2012లో క్వీన్స్‌ సలహాదారుగా వ్యవహరించారు. కమ్యూనిటీ సేవల్లో ఎప్పుడూ ముందుండేవారు. కమ్యూనిటీ ప్రజలకు అందించిన విశేష సేవలకుగాను షేర్‌గిల్‌కు క్వీన్స్‌ గోల్డెన్‌ జూబ్లీ మెడల్‌ ప్రదానం చేశారు కూడా. సిక్కు ఫెమినిస్టు రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సలహా బోర్డు సభ్యురాలిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.
 
సేవలు బహుముఖం...
పలు న్యాయ సంబంధిత సంస్థలలోనే కాదు నాన్‌-లీగల్‌ సంస్థలతో కూడా కలిసి పనిచేశారామె. కెనడాలోని పలు ట్రిబ్యునల్స్‌లో ఆమె పనిచేశారు. మతస్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారామె. సిక్కుల హక్కుల గురించి పోరాడారు. వరల్డ్‌ సిక్కు సంస్థకు జనరల్‌ లీగల్‌ కౌన్సిల్‌గా ఉంటూ 1991 నుంచి మానవహక్కుల పరిరక్షణ, కెనడాలో రెలిజియస్‌ అకామిడేషన్‌ చట్టాలకు నిర్దిష్టమైన రూపు తేవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పలు సిక్కు కేసులపై పోరాడి విజయం సాధించారు. స్కూలులో చదువుతున్న సిక్కు విద్యార్థులకు కృపాణం ధరించే హక్కుపై సైతం ఆమె పోరాడారు. కృపాణం ధరించడం సిక్కు విద్యార్థుల హక్కంటారామె. షేర్‌గిల్‌ కెనడాలో పేరొందిన మానవహక్కుల న్యాయవాది. పలు విశ్వవిద్యాలయాల్లో, స్కూళ్లల్లో లైంగిక సమానత్వం, రాజకీయాలపై తరచూ గెస్ట్‌ లెక్చర్లు కూడా ఇస్తుంటారామె. అంతేకాదు హైస్కూల్‌ డిబేట్‌ కోచ్‌గా వ్యవహరించారు. షేర్‌గిల్‌ న్యాయవాది మాత్రమే కాదు... మంచి ఆర్టిస్టు కూడా. తబల, హార్మోనియమ్‌లు చాలా బాగా వాయిస్తారు. మార్షల్‌ ఆర్ట్‌ తైక్వాండాలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించారు. పంజాబీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు ఉన్న షేర్‌గిల్‌ ఫ్రెంచి భాషను కూడా నేర్చుకుంటున్నారు.