Indian-sisters-in-US-tops-in-Robotics

అమెరికాలోని ఈ అక్కాచెల్లెళ్లు.. రోబోటిక్స్‌లో దున్నేస్తున్నారు

రోబోటిక్స్‌ లెర్న్‌ ఈజీ 

రోబోటిక్స్‌... మ్యాథమేటిక్స్‌లానే ఓ టిపికల్‌ సబ్జెక్ట్‌. అలాంటి రోబో టిక్స్‌ను గ్రామీణ విద్యార్థులకు కూడా అవలీలగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. రాబోయే తరాలను టెక్నో ఇన్నోవేటర్స్‌గా తీర్చిదిద్డడమే లక్ష్యంగా వారు కృషి చేస్తున్నారు. టెక్నాలజీని పల్లెపల్లెకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్న వారిద్దరే.. అదితి ప్రసాద్‌, దీప్తిరావ్‌ సుచీంద్రన్‌. 
 
అమెరికాలో నివాసముంటున్న భారత సంతతి అక్కాచెల్లెళ్లు అదితి ప్రసాద్‌, దీప్తిరావ్‌ సుచీంద్రన్‌లు చిన్నప్పటి నుంచే చదువుపై, కొత్త సాంకేతికపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రతిరోజు సైంటిఫిక్‌ కాన్సెప్ట్‌ చెబుతూ బాల్యంలోనే వాళ్లలో ఎంతో స్ఫూర్తినింపారు తల్లిదండ్రులు. మింగుడు పడని అంశాలను కూడా ఎంతో తేలికగా వివరించి వాళ్లలో నేర్చుకోవాలనే తపనను కలిగించారు. సృజనాత్మకంగా ఆలోచించే శక్తిని పెంచారు. అదితి, దీప్తిలు బంతితో ఆడుకుంటున్న వేళ.. బంతిని కిందకు జారవిడుస్తూ.. అలా అది నేలపై పడటానికి గురుత్వాకర్షణ శక్తి కారణమని తల్లిదండ్రులు వివరించే వారు. అలా సైన్స్‌పై ఆసక్తిని పెంచారు. సీతాకోకచిలుకపై వన్నెలు ఎలా వచ్చాయి? అది ఏ ఆహారాన్ని స్వీకరిస్తుంది? పూలపై ఎందుకు వాలుతుంది? వంటి ప్రశ్నలతో చిన్ననాటి నుంచే అదితి, దీప్తిల్లో విషయ పరిజ్ఞానంతో పాటు, తెలుసుకోవాలనే ఆలోచనను కలిగించారు. అలా బాల్యం నుంచే తండ్రి అడుగు జాడల్లో నడిచిన ఆ పిల్లలు నేడు మరెంతోమంది చిన్నారులకు విద్య నేర్పుతున్నారు. ఇద్దరూ కూడా మద్రాస్‌ ఐఐటీలో రోబోటిక్స్‌పై పరిశోధనలు చేశారు.
 
పల్లెపల్లెలో విద్య 
ప్రస్తుతం ‘రోబోటిక్స్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌’ (robotixedu.com) పేరుతో ఓ స్టార్టప్‌ ప్రారంభించారు. కొత్త సాంకేతికత అర్థం కావాలంటే.. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌)ల మౌలిక భావనలు తెలియాలి. ఆయా విషయాలతో పాటు, రోబోటిక్స్‌ టెక్నాలజీ గురించి గ్రామీణ విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కరికులమ్‌ కూడా తయారుచేశారు. రోబోటిక్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్లెలోనే కాకుండా, పట్టణాల్లోనూ రోబోటిక్‌ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సమ్మర్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తున్నారు.
 
ఇండియన్‌ రోబోటిక్స్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) 
ఐఆర్‌ఎల్‌ ఇదో పోటీ కార్యక్రమం. నాలుగో తరగతి నుంచి పన్నెండో తరగతి చదివే విద్యార్థుల కోసం అదితి, దీప్తిలు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమమే ఇది. ఇందులో భాగంగా విద్యార్థులకు మూడు రోజుల పాటు 8 రోబోటిక్‌ అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత రోబోటిక్స్‌పై పోటీ నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ఇందులోని విద్యార్థులతోపాటు రోబోటిక్స్‌పై ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు.
 
పైరో 
అమెరికాకు చెందిన రోబోటిక్స్‌ అనే సంస్థతో కలిసి, దీప్తి, అదితలు ‘పైరో’ అనే రోబోను తయారుచేశారు. పైరో ద్వారా ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, కోడింగ్‌, రోబోటిక్స్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌ నేర్చుకోవచ్చు. చిన్నారులు, యువకులు రోబోటిక్స్‌ ఈజీగా నేర్చుకునేందుకు కూడా మరో రెండు పైరో రోబోలు అభివృద్ధి చేశారు. 
 
బేటీ పడావో.. 
‘దాదాపు అన్ని రంగాల్లోనూ బాలికలు వివక్షకు గురవుతున్నారు. అందుకే మా స్టెమ్‌  ప్రోగ్రామ్‌ ద్వారా అమ్మాయిలను ప్రోత్సాహించాలనుకుంటున్నాం. రోబోటిక్స్‌లో నిపుణులుగా వారిని తీర్చిదిద్దుతాం. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు. తమిళనాడు ట్రిచిలోని అన్నాయ్‌ ఆశ్రమంలోని 40 మంది అమ్మాయిలకు ప్రతి వారం కోడింగ్‌, రోబోటిక్స్‌ అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. ఇదంతా ఉచితంగానే చేస్తున్నాం. వారంతా ఆరు నుంచి 12 ఏళ్ల వయస్కులే ’ అని దీప్తి చెబుతోంది.