Hyd-woman-directed-an-Hollywood-movie

మన అమ్మాయి... మన కథ...

వివేక్‌ పండిట్‌ అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రవాస భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ ప్రారంభిద్దాం అనుకున్నాడు. కాని తన స్టార్టప్‌ కల తీరేందుకు గడువు తీరిపోతున్న ఇమ్మిగ్రేషన్‌ వీసా పంటికింది రాయిలా అడ్డుపడింది. వీసా గడువు పొడిగించుకోవాలంటే అప్పటికే తను పనిచేస్తున్న కంపెనీ వాళ్లు సాయంచేయాలి. లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. కాని అవి సాధ్యమయ్యేవేనా? కళ్ల ముందు వివేక్‌ కలల సౌధం కూలిపోవాల్సిందేనా? స్వదేశానికి తిరిగి రావడం మినహా మార్గం లేదా? - వివేక్‌ లాంటి ఎందరో ఇమ్మిగ్రెంట్ల కథ తెలుసుకోవాలంటే ‘ఫర్‌ హియర్‌ ఆర్‌ టు గో?’ (For Here or To Go?) సినిమా చూడాలి! ‘ఇదేం సినిమా..’ అంటున్నారా? హాలీవుడ్‌ సినిమా... హాలీవుడ్‌లో మన హైదరాబాదీ వనిత రుచా హుమ్నాబాద్‌కర్‌ దర్శకత్వం వహించిన సినిమా. మన భారతీయుల వలస వ్యధలు చెప్పే కథ.
 
అమెరికాలో ఉంటున్న ఇమ్మిగ్రెంట్స్‌ (ప్రవాస భారతీయుల) సాదకబాధకాల మీద తీసిన ఈ సినిమాలో తనతో పాటు కుటుంబసభ్యుల, స్నేహితుల స్వీయానుభవాలు ఉన్నాయి అంటున్నారు రుచా. హైదరాబాద్‌ వాసి అయిన ఆమె ప్రస్తుతం యుఎ్‌సలో ఉంటున్నప్పటికీ సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్‌ని పలకరించకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందట. ఎక్కడికి వెళ్లినా మూలాలు మరిచిపోకూడదు అంటున్న ఆమె ‘ఆన్‌లైన్‌’లో ‘నవ్య’తో పంచుకున్న ముచ్చట్లు. ఆమె మాటల్లోనే...
 
స్వీయానుభవాల నుంచి...
‘‘జీవితాల్లో మార్పు తెచ్చే అత్యంత శక్తివంతమైన సాధనం సినిమా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా దాని ప్రభావం ఉంటుంది. భాషతో సంబంధంలేకుండా సహానుభూతిని పొందుతారు ప్రేక్షకులు. విశ్వవ్యాప్తంగా సినిమాను మించిన బలమైన ప్రచారసాధనం మరోటి లేదు. ఒక సినిమా తీయాలంటే నటన నుంచి సాంకేతిక అంశాల వరకు అన్నింటినీ ఒక దగ్గరకు చేరాలి. కళను, సాంకేతికతను కలిపితే ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందించొచ్చు.
 
నా దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన సినిమా ‘ఫర్‌ హియర్‌ టు గో’ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఈ సినిమా రచయిత రిషి ఎస్‌ భిలావాడికర్‌ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమయ్యారు. రిషి స్ర్కిప్ట్‌ నన్నెంతగా ఆకట్టుకుందో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నా అనుభవంతో పాటు స్నేహితుల, కుటుంబంలోని వ్యక్తుల అనుభవాలకు ఎంతో దగ్గరగా ఉంది ఆ స్ర్కిప్ట్‌. సినిమా పూర్తి చేసేందుకు రెండు సంవత్సరాలు పట్టింది. పూర్తయ్యాక ఫిల్మ్‌ఫెస్టివల్స్‌కి పంపించడం మొదలుపెట్టాం. ఎక్కడ ప్రదర్శించినా మంచి స్పందన లభించింది. ఇప్పటివరకు 17 ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో స్ర్కీనింగ్‌ చేశాం. ఇటీవలే మార్చి 31న యుఎస్‌లో విడుదలచేశాం. మంచి స్పందన వస్తోంది. యుఎస్‌లో సినిమా రివ్యూలు రాసే ‘ఐఎమ్‌డిబి’ వెబ్‌సైట్‌ ప్రేక్షకుల రేటింగ్‌ పదికి 8.5 ఇచ్చారు. త్వరలో మనదేశంలో విడుదలచేస్తాం.
 
అవగాహనారాహిత్యం వల్ల
నిజం చెప్పాలంటే... ప్రవాసీయులకు ఆదరమైన స్వాగతం చెప్పే దేశం యు.ఎస్‌. అయితే సమస్య వచ్చిపడేదల్లా కొన్ని ప్రదేశాల్లో ఇమ్మిగ్రేషన్‌ విషయాలపట్ల అవగాహన లేకపోవడం వల్లే దానివల్లే కొన్ని దురదృష్ట ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఎన్నో విషయాల గురించి మా సినిమాలో చూపించాం. ఇమ్మిగ్రెంట్స్‌ ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో సున్నితంగా చెప్పాం. సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడానికన్నా ముందు బే ఏరియాలో నివసిస్తున్న భారత వలస కుటుంబాలను, యువ ఉద్యోగులను, విద్యార్థులను ఇంటర్వ్యూ చేశాం. సినిమా షూటింగ్‌ అప్పుడు సిలికాన్‌ వ్యాలీలో ఉంటున్న భారతీయులు ఎంతగానో సాయపడ్డారు. ఇందుకు మీకో ఉదాహరణ చెప్తాను - ఒకరోజు ఉదయం షూటింగ్‌ మొదలుపెట్టాలి. కాని అనివార్యకారణాల వల్ల లొకేషన్‌ దొరకలేదు. అప్పటికప్పుడు ఏం చేయగలం మరో లొకేషన్‌ వెతుక్కోవడం తప్ప. వెంటనే ఓమీ వైద్య(‘త్రీ ఇడియట్స్‌’ ఫేం చతుర్‌)తో కలిసి ఫ్రెమాంట్‌ కాంప్లెక్స్‌లోని ప్రతీ ఇంటి తలుపు తట్టాం. ఒక గంటలోపు మా షూటింగ్‌కు ఇల్లు ఇచ్చేందుకు నలుగురు సిద్ధపడ్డారు. అంతేకాకుండా నటీనటులు, చిత్ర బృందానికి వసతి కల్పించారు. ప్రొడక్షన్‌కు ఇబ్బందిలేకుండా రవాణాసౌకర్యాన్ని ఇచ్చారు. టెక్‌ కంపెనీ, రెస్టారెంట్స్‌, గ్రాసరీ స్టోర్స్‌ యజమానులు సినిమాలో ముఖ్యమైన సీన్లకు లొకేషన్లు ఇచ్చారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇక్కడ నివసిస్తున్న భారతీయులంతా వారివారి అనుభవాలను ఈ సినిమా ద్వారా చెప్పేందుకు కలిసి వచ్చారు. ప్రముఖ దర్శకురాలు మీరానాయర్‌ చెప్పినట్టు ‘‘మన కథలు మనం చెప్పకపోతే... మరెవరూ చెప్పరు’’ ఈ మాటలు అక్షరసత్యాలు. అందుకే యుఎ్‌సలో ఉంటున్న మనవాళ్ల కథలను చెప్పే ప్రయత్నం చేశాను నేను.
 
మంచి కథను చెప్పడం తెలిసింది
అమెరికాలో ఉంటున్న ఇమ్మిగ్రెంట్‌నైన నాకూ ఓ పెద్ద కథ ఉంది. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నాకు 21 సంవత్సరాలు వచ్చే వరకు అక్కడే ఉన్నాను. అమెరికాకి 2001లో వచ్చాను. నేర్చుకోవాలన్న ఆసక్తి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సుకతలు అమ్మానాన్నల నుంచి వచ్చాయి. వాటివల్లే నేను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎదగగలిగాను. నాన్న ఎంటర్‌ప్రెన్యూర్‌. ఆయన ద్వారా స్వతంత్రభావాలు అలవడ్డాయి. అమ్మానాన్నలు ఇద్దరూ పుస్తకాలు విపరీతంగా చదువుతారు. మా అమ్మ ఆ అలవాటును చిన్నప్పటినుంచే నాలో పెరిగేలా చేసింది. పుస్తకాలు చదవడం వల్లే మంచి కథను ఎలా చెప్పొచ్చో తెలిసింది. చిన్న వయసు నుంచే నాటకాలు రాసి, డైరెక్ట్‌ చేయడాన్ని ఇష్టపడేదాన్ని. నాకు పంతొమ్మిదేళ్లు ఉన్నప్పుడే తొలిసారిగా ఓ నాటకం డైరెక్ట్‌ చేశాను. అది నాలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది.
 
నాన్న ఇచ్చిన ధైర్యంతో...
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ నాజర్‌ స్కూల్‌లో చదివాను. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజిలో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ చేశాను. పూనే విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తరువాత పిట్స్‌బర్గ్‌లోని కార్నెగీ మెలోన్‌ విశ్వవిద్యాలయంలో ‘మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌’ చేశాను. చదువుకునేందుకు యుఎస్‌ వచ్చానంటే అమ్మానాన్న ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే. అయితే మొదటి సెమిస్టర్‌ పూర్తయ్యాక చదువు కొనసాగించగలనా అనే అనుమానం వచ్చింది. కారణం ఆ సబ్జెక్టు పట్ల ఎక్కువ అవగాహన లేకపోవడమే. అప్పుడు మా నాన్న నాకు ధైర్యాన్నిచ్చారు. సబ్జెక్టు అర్థం కాకపోతేనేం దానివల్ల కలిగే అనుభవం నేర్పే పాఠం జీవితానికి ఉపయోగపడుతుంది అన్నారు. అలా నేను ఇక్కడే ఉండిపోవడం వల్ల ఈ రోజున ఎన్నో అవకాశాలు నా ముందు నిలిచాయి. ఆలోచనాధోరణిలో మార్పు వచ్చింది. విలువలు తెలిశాయి. మనుషుల్ని ఎలా చూడాలో నేర్చుకున్నాను. అవన్నీ కలిసే నన్నీ రోజున ఈ స్థాయిలో నిలబెట్టాయి. మా కుటుంబంలో యుఎస్‌ వచ్చిన మొదటితరం వ్యక్తిని నేనే. ఈ మధ్యనే ఇక్కడి పౌరసత్వం వచ్చింది.
 
ఆసక్తి కొద్దీ వేసిన అడుగులు...
సినిమా రంగంవైపు నా అడుగులు వేయించింది నాటకరంగమే! హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ‘కన్ఫెట్టి’ అనే థియేటర్‌ గ్రూప్‌ నడిపేదాన్ని. మా థియేటర్‌ గ్రూప్‌ తరపున వర్క్‌షా్‌పలు ఏర్పాటుచేసే వాళ్లం. అలా మా వర్క్‌షాపులో పాల్గొన్న ఒకావిడ ద్వారా దర్శకుడు నాగేశ్‌ కుకునూర్‌ పరిచయమయ్యారు. తెలుగువారు, హైదరాబాదీ అయిన ఆయన అప్పుడే యుఎస్‌ నుంచి ఇండియాకి వచ్చారు. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’ చిత్ర షూటింగ్‌ కోసం నటీనటుల్ని వెతుకుతున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. మా థియేటర్‌ గ్రూప్‌ సభ్యుల్లో కొందరు ‘హైదరాబాద్‌ బ్లూస్‌’లో నటించారు కూడా. నాకు సినిమా అంటే ఇష్టం. సినిమా సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎలా తీస్తారు? అనేవి తెలుసుకోవాలి అనుకున్నాను. అలా నేను ‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘రాక్‌ఫోర్డ్‌’ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ‘బాలీవుడ్‌ కాలింగ్‌’కు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఫ్రీలాన్స్‌ జర్నలి్‌స్టగా పనిచేశాను. అప్పుడు వీధి బాలల మీద రాసిన ఒక ఫీచర్‌ నా మొదటి నవల ‘డ్యాన్స్‌ ఆఫ్‌ ది ఫైర్‌ఫ్లై్‌స’కు స్ఫూర్తి అయ్యింది. పూనేలో ఉన్నప్పుడు ఆంగ్లంలో మూడు నాటకాలు రాసి దర్శకత్వం వహించాను. అందుకు ‘యంగ్‌ ఎఛీవర్స్‌ అవార్డు’ అందుకున్నాను. ఆ తరువాత ఇలా సినిమా దర్శకురాలినయ్యాను. ఇమ్మిగ్రెంట్స్‌ కష్టాల మీద తీసిన ‘షర్‌ హియర్‌...’లానే మరిన్ని ఇండిపెండెంట్‌ సినిమాలు తీయాలనీ, మన కథల్ని తెరకెక్కించాలని నా ఆశ.’’
 
ఏడాదికి ఒకసారి...
మనం ఎక్కడ ఉన్నా మూలాల్ని మరిచిపోకూడదు. అందుకే ప్రతి ఏడాది మనదేశానికి వస్తుంటాను. అలాగే మన సంస్కృతి నలుగురిలో మనల్ని భిన్నంగా ఉంచుతుంది. సంస్కృతే నిజమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మా ఆయన ఆరోన్‌ సకోవ్‌స్కీ గూగుల్‌లో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కూడా. మా అబ్బాయి పేరు రియాన్‌. వాడికి ఆరు నెలలు ఇప్పుడు. హైదరాబాదీ ఫుడ్‌ అంటే నాకు బోల్డెంత ఇష్టం. ఆ సిటీతో నాకెన్నో మధురమైన అనుభవాలు ఉన్నాయి. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. స్కూల్‌, కాలేజిలు అందించిన మంచి అనుభవాలు ఉన్నాయి. మా అమ్మానాన్న, బంధువులు అక్కడే హైదరాబాద్‌లో ఉన్నారు. అందుకని సంవత్సరానికి ఒక్కసారయినా వస్తాను. దీపావళి, హోలీ పండుగలంటే ఉత్సాహం నాకు. ఈ పండుగలకి బాగా ఎంజాయ్‌ చేసేవాళ్లం. ఇక సంక్రాంతి గురించి అయితే చెప్పేదేముంది పతంగుల పోటీల్లో నువ్వా నేనా అని చూసుకునేవాళ్లం. పాతబస్తీలో జరిగే పతంగుల పోటీ చూడడం భలే ఇష్టంగా ఉండేది.
-కిరణ్మయి