:: Welcome to NRI - Article ::

దేవీ స్ఫూర్తి.. మట్టిలో పండిన ఐడియా

అమెరికాలోని ఓ పేరున్న విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌.. బెంగళూరులోని ప్రఖ్యాత ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’లో ఎంట్రప్రెన్యూర్‌షిప్ లో మాస్టర్స్‌..! ఇంకెవరన్నా అయితే ఏం చేస్తారు? ఎంచక్కా ఏ అమెరికాకో, బ్రిటన్‌కో ఎగిరిపోయి హాయిగా సెటిల్‌ అయిపోతారు. భారతీయ మట్టి మహాత్మ్యమో ఏమో కానీ, దేవీమూర్తి అలా వెళ్లలేదు. పొలాలు తిరుగుతూ.. సేద్యంలో టెక్నాలజీని ప్రవేశపెట్టి.. అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. అందుకు ఆమె నెలకొల్పిన సామాజిక వాణిజ్య సంస్థ ‘కమల్‌ కిసాన్‌’. ఒక ఉన్నత విద్యావంతురాలురైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థను పెట్టడం ఇదే తొలిసారి. అందుకే దేవీమూర్తి..స్ఫూర్తినింపుతోంది..

 
దేవీమూర్తి వ్యాపార కుటుంబంలో పుట్టారు. ఆమె తల్లితండ్రులు ఆటోమోటివ్‌ కంపెనీలకు షీట్‌ మెటల్‌ సరఫరా చేసే కంపెనీ నిర్వాహకులు. ఇంటిల్లిపాదీ డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనానికి కూర్చున్నప్పుడు.. వ్యాపార సంభాషణలే నడిచేవి. ఆ చర్చలే.. దేవీమూర్తి మనసులో ఎంట్రప్రెన్యూర్‌ ఆలోచనలు నాటాయి. తెలిసో తెలియకో ఆ ప్రభావం ఆమె మీద పడింది. అయితే ఏం చేయాలో ఒక దశ దిశ ఉండేది కాదు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ చేశారు. ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటూ.. ‘‘నా జీవితానికి పెద్ద మలుపు ఆ విశ్వవిద్యాలయం. అక్కడ విద్యావిధానం మనలా ఉండదు. చదివేది ఇంజనీరింగే అయినా విద్యార్థికి ఆసక్తి కలిగిన ఇతర సబ్జెక్టులూ తీసుకోవచ్చు. అలా నేను అకౌంట్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌లను అదనపు సబ్జెక్టులుగా తీసుకున్నా. అమెరికాలో చదువు పూర్తవుతూనే ఇండియాకు వచ్చేశా. కొన్నేళ్లపాటు మా కుటుంబ వ్యాపారంలో భాగస్వామినయ్యా. బెంగళూరులోని ఐఐఎంలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశాను. ఐఐఎంలో చదువులు పుస్తకాలకే పరిమితం కాదు. నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకునే అనుభవం వస్తుందక్కడ. ఆ క్యాంప్‌సలో చదివే ప్రతి విద్యార్థీ ఏదో ఒక అంశంలో దిట్ట. జువెలరీ మేకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, ఎడ్యుకేషన్‌.. ఇలా ఎన్నో భిన్నమైన రంగాల్లో పనిచేసిన విద్యార్థులు ఐఐఎంలకు వస్తారు. అలా వచ్చిన వాళ్లలో సేద్యంలో ప్రయోగాలు చేసొచ్చిన ఇద్దరు విద్యార్థులు నాకు స్నేహితులు అయ్యారు. ఆ ఇద్దరి వల్ల నాకు వ్యవసాయం మీద ఆసక్తి ఏర్పడింది. నేను చిన్నప్పటి నుండి నగరంలో పెరగడం వల్ల.. సేద్యం గురించి అంతగా తెలియదు. మిత్రుల మధ్య సంభాషణలతో పాటు.. నేను స్వయంగా తెలుసుకున్న విషయం - రైతులకూ, సాంకేతిక పరిజ్ఞానానికీ మధ్య పెద్ద దూరం ఉందని! దీన్ని తగ్గించే ఆలోచన నుంచి వచ్చేందే నా కంపెనీ’’ అన్నారామె.
పొలాల బాట పట్టి..
వ్యవసాయంలో టెక్నాలజీ వాడకం ఎప్పటి నుండో మొదలైంది. అయితే చిన్న, సన్నకారు రైతులకు అది ఇంకా అందుబాటులోకి రాలేదు. దేవీమూర్తి అంత పెద్ద చదువులు చదివి.. ఈ భారాన్ని నెత్తిన ఎత్తుకున్నారు. ఇప్పటికే పొలాల్లోకి వచ్చిన యంత్రాలను పరిశీలించారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి యంత్రాలను వాడుతున్నారు. సగానికి పైగా రాష్ట్రాలు తిరిగాను. నేరుగా ఎంతో మంది రైతుల్ని కలిశాను. అవసరాలను గుర్తించాను. ఒక పరికరాన్ని పొలంలోకి తీసుకొచ్చాక ఎదురయ్యే ఇబ్బందుల్నీ తెలుసుకున్నాను. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు, శాస్త్రవేత్తలతో మాట్లాడాను. ఇంత హోమ్‌వర్క్‌ చేశాక ‘కమల్‌ కిసాన్‌’ అనే సంస్థను నెలకొల్పాను..’’ అని చెప్పారు దేవీమూర్తి. కొన్నేళ్ల పాటు వ్యవసాయ సాగు యంత్రాల మీద పరిశోధన చేశారామె. అందుకు పరిశోధన- అభివృద్ధి (ఆర్‌అండ్‌బి) విభాగం స్థాపించారు. ‘‘కేవలం ఐదు లక్షల మూల వ్యయంతో నా కంపెనీ మొదలైంది. ఐఐటీ మద్రాసు వాళ్లు కూడా సహాయపడ్డారు’’ అన్నారు దేవి.
 
పరికరాలతో సేద్యం చకచక..
పల్లెల్లో కూలీల కొరత ఎక్కువైంది. దుక్కిదున్ని నాట్లు వేయడం పెద్ద ప్రయాస. అందుకని ‘రైస్‌ ప్లాన్‌టేషన్‌’ యంత్రాన్ని డిజైన్‌ చేసింది కమల్‌ కిసాన్‌ సంస్థ. ఆ యంత్రాన్ని ట్రాక్టర్‌కు అమర్చుకుని.. మడిలోకి దిగితే.. దానంతట అదే నాట్లు వేసుకుంటూ వెళుతుంది. అయితే ఆచరణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి. నారు చిక్కు పడటంతో నాట్లు ఆలస్యంగా పడేవి. అదొక చేదు అనుభవం. అవన్నీ బేరీజు వేసుకుని.. మరో పరికరాన్ని రైతులకు అందించారు. అది కూరగాయల మొక్కలు నాటే పరికరం. కూరగాయల మొక్కలు నాటేందుకు ఎక్కువ మంది కూలీలే కావాలి. దాని వల్ల పెట్టుబడి భారం ఎక్కువవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆ భారాన్ని తగ్గించేలా ‘వెజిటబుల్‌ ప్లాంటర్‌’కు రూపకల్పన చేశారు దేవీమూర్తి. ఈ యంత్రాన్ని కూడా ట్రాక్టర్‌కు తగిలించుకుని వాడుకోవచ్చు. కూరగాయల మొక్కల్ని దానంతట అదే నాటడం కాకుండా.. కలుపును మొలకెత్తకుండా అడ్డుకునే ముల్చ్‌లేయర్‌ (ప్లాస్టిక్‌ పేపర్‌)ను కూడా ఏకకాలంలో పరుచుకుంటూ వెళుతుందీ యంత్రం. ఆరుగురు కూలీలు అవసరమయ్యే చోట.. ఇద్దరితో సరిపెట్టుకోవచ్చు.
 
ఒక వ్యక్తి నాలుగు గంటల్లో ఒక ఎకరంలో కూరగాయల మొక్కల్ని నాటేయొచ్చు. ఇదెంతో లాభదాయకం. మొదట కర్ణాటకలోని షిమోగాలో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేవీమూర్తి సంస్థ రూపొందించిన మరో వ్యవసాయ పరికరం - ‘షుగర్‌కేన్‌ ప్లాంటర్‌’. పొలంలో ఒకేసారి దుక్కిదున్ని చెరుకు గడల్ని నాటుతూ.. మట్టిని కప్పేస్తూ వెళుతుందీ ప్లాంటర్‌. మూడు గంటలకు ఒక ఎకరం చొప్పున చెరుకును నాటొచ్చు. 30 హెచ్‌పి (అశ్వశక్తి) పవర్‌ ట్రాక్టర్‌ ఉంటే చాలు.. షుగర్‌కేన్‌ ప్లాంటర్‌ను ఎటాచ్‌ చేసుకోవచ్చు. దీని ధర సుమారు తొంభైవేల రూపాయలు నిర్ణయించినట్లు కమల్‌ కిసాన్‌ వెబ్‌సెట్‌ చెబుతోంది.
 
రైతులకు అండ..
కమల్‌ కిసాన్‌ యంత్ర పరికరాలను వాడుతున్న రైతుల ఆనందమే.. తన కెరీర్‌లో సాధించిన గొప్ప విజయం అన్నది దేవీమూర్తి అభిప్రాయం. ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలోనే సేద్యపు పరికరాలు, యంత్రాలను ఆమె విక్రయించారు. అవన్నీ పొలాల్లో సందడి చేస్తున్నాయిప్పుడు. దేశానికి పట్టెడన్నం పెట్టేందుకు మట్టిలోకే దిగనక్కర్లేదు. అదే మట్టిని నమ్ముకున్న మట్టిమనుషులకు అండగా నిలిస్తే చాలు. చదువుకున్న విద్యావంతులు రైతుల సేద్యాన్ని మరింత సులభతరం చేసే సాంకేతిక విజ్ఞానాన్ని అందిస్తే అంతకంటే ఏం కావాలి? ఐఐఎం పట్టభద్రురాలు దేవీమూర్తి ఆ పని చేస్తున్నందుకు అభినందిద్దాం..!
 
కూరగాయల మొక్కలు నాటేందుకు ఎక్కువ మంది కూలీలే కావాలి. దాని వల్ల పెట్టుబడి భారం ఎక్కువవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆ భారాన్ని తగ్గించేలా ‘వెజిటబుల్‌ ప్లాంటర్‌’కు రూపకల్పన చేశాను.