Court-automation-software-by-Telugu-NRI

న్యాయ ప్రపంచంలో ఒకే ఒక్కడు

కోట్లు కురిపించే కోర్ట్‌ ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది మన తెలుగోడు.. సూర్య ప్రకాశ్‌

విదేశీ గడ్డపై మన జెండా ఎగరవేసిన తెలుగువాళ్లు మనకు అనేక రంగాల్లో కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరు సూర్యప్రకాశ్‌. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి.. కొద్దిగా లేటుగా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించిన సూర్య రూపొందించిన కోర్ట్‌ ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఈ రోజు న్యాయప్రపంచంలో ఒక సంచలనం. హేగ్‌ (నెదర్లాండ్స్‌)లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) నుంచి ఆస్ట్రేలియాలో రాయల్‌ కమిషన్స్‌ దాకా అనేక జాతీయ, అంతర్జాతీయ కోర్టులు ఈ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా కోర్టుల విషయంలో సూర్యాది ఏకఛత్రాధిపత్యమే! అక్కడ ఉన్న కోర్టులన్నీ ఈ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నాయి. ప్రపంచంలోని టాప్‌ 100 న్యాయ సంస్థలు వాడేది కూడా సూర్యా కంపెనీ రూపొందించిన సాఫ్ట్‌వేరే. అవకాశం లభిస్తే మన జడ్జీలందరికీ ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అందిస్తాననే సూర్య విజయప్రస్థానం ఆయన మాటల్లోనే..
 
సాఫ్ట్‌వేర్‌ ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా పెద్ద పెద్ద కేసుల్లో ఐదారుగురు లాయర్లు పనిచేస్తూ ఉంటారు. వీరందరికీ ఒకేసారి సమాచారం అందించడంతో పాటు.. కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ అన్నీ ఎప్పటికప్పుడు దీనిలో రికార్డు అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక సాక్షి మొదట్లో కత్తిని ఉపయోగించానని చెప్పి.. ఆ తర్వాత మాట మార్చి బాకు వాడానని చెప్పాడనుకుందాం. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న లాయర్లు వెంటనే అతను గతంలో ఏం చెప్పాడనే వీడియోను వెంటనే చూడవచ్చు. అంతే కాకుండా జూనియర్‌.. సీనియర్‌ లాయర్లు తమ వద్ద ఉన్న సమాచారాన్ని సులభంగా షేర్‌ చేసుకోవటానికి కూడా ఇది పనికొస్తుంది. ఇలాంటి ఫీచర్లు దీనిలో ఎన్నో ఉన్నాయి.
 
మాది మధ్యతరగతి కుటుంబం. నేను చదివింది మెకానికల్‌ ఇంజనీరింగ్‌. చదువు అయిపోయిన తర్వాత ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఫ్లాట్‌ఫాంలకు సంబంధించిన పరికరాలను డిజైన్‌ చేసే ఒక అంతర్జాతీయ కంపెనీలో పనిచేసేవాడిని. 1997లో ఆస్ట్రేలియాకు ఉద్యోగం కోసం వెళ్లా. ఆ దేశ పౌరసత్వం కూడా తీసుకున్నా. నేను ఆస్ట్రేలియాకు వెళ్లే సమయానికే సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ వచ్చింది. నాతో చదివిన మిత్రులందరూ సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి మారిపోయారు. అందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో సెటిల్‌ అయిపోయారు. నేను మాత్రమే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలోనే ఉండిపోయా! 1999లో ఆస్ట్రేలియా, ఇండోనేషియాల మధ్య ఈస్ట్‌ తైమూర్‌ వివాదం ముదిరింది. ఆస్ర్టేలియా కంపెనీలకు ఇచ్చిన రిగ్‌ ప్రాజెక్టుల్ననంటినీ ఇండోనేషియా రద్దు చేసింది.
 
దీంతో ఆస్ట్రేలియా కంపెనీలలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ మినహా ఇతర ఉద్యోగులకు ఉపాధి పోయే ముప్పు ఏర్పడింది. దీంతో నేను కూడా సాఫ్ట్‌వేర్‌కు మారాలనుకున్నా. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి కానీ లైవ్‌నోట్‌ అనే కంపెనీలో చేరా. ఆ కంపెనీ న్యాయరంగానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు చేసేది. నా పనితీరు నా యాజమాన్యానికి బాగా నచ్చింది. ఆ సమయంలో భారతీయులంటే తమ ఉద్యోగాలను తీసుకువెళ్లిపోయేవారనే భావన స్థానికులకు ఉండేది. నాకు కూడా ఏదో చేయాలనే తపన నిద్ర పట్టనివ్వకుండా చేసింది. బయటకు వచ్చేసి ఏదో ఒక బిజినెస్‌ పెట్టాలనుకున్నా. రకరకాల ఆలోచనల తర్వాత న్యాయవ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలనిపించింది. అలా పుట్టిందే లీగల్‌ క్రాఫ్ట్‌.
 
పేరు కోసం పోరాటం..
లీగల్‌ అంటే చట్టపరమైన అంశాలని అర్థం. క్రాఫ్ట్‌ (ఛిట్చజ్ట) అంటే కోర్ట్‌రూమ్‌ ఆటోమేషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ టెక్నాలజీస్‌ అని అర్థం. ఈ రెండింటినీ కలిపి ‘లీగల్‌ క్రాఫ్ట్‌’ అని పేరుపెట్టాం. కానీ ఈ పేరును అధికారులు ఆమోదించలేదు. ‘లీగల్‌ క్రాఫ్ట్‌’ అనే పదం లేదంటారు. చాలా కాలం పోరాటం చేసిన తర్వాత ఈ పేరును రిజిస్ట్రర్‌ చేశారు. మన దేశంలోని కోర్టుల్లో జరిగే వాదప్రతివాదాలు, ఇతర ప్రొసీడింగ్స్‌ అన్నింటినీ నిక్షిప్తం చేయటానికి కాగితాలు వాడతారు.
 
కానీ విదేశాల్లో వీటిని రికార్డు చేయటానికి క్యాట్‌ మెషీన్స్‌ ఉంటాయి. వాటిని ఆపరేట్‌ చేయటానికి రిపోర్టర్లు ఉంటారు. వీరిని కోర్టు రిపోర్టర్స్‌ అంటారు. వీరు షార్ట్‌హ్యాండ్‌ మాదిరిగా ఉండే భాషలో నిష్ణాతులు. శబ్దాల ఆధారంగా నిమిషానికి 250 పదాల వరకూ ఆ మెషీన్లలో టైప్‌ చేయగలుగుతారు. ఈ సమాచారాన్ని కంపెనీలు కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తాయి. దీన్ని కోర్టు సిబ్బంది, లాయర్లు, ప్రజలు వాడుకుంటారు. ఇంత దీర్ఘ ప్రక్రియ కాకుండా కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ రియల్‌ టైమ్‌లో ఎప్పటికప్పుడు లాయర్లకు, వాదులకు, ప్రతివాదులకు చేరిపోతే ఎలా ఉంటుంది? అనే ఆలోచనే మా సాఫ్ట్‌వేర్‌కు పునాది. మేము సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్న సమయంలోనే ఒక బంపర్‌ ఆఫర్‌ తగిలింది.
 
ఒరాకిల్‌ చేయలేనిది..
అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ)లో 18 విభాగాలుంటాయి. ఈ విభాలన్నింటిలోని సమాచారాన్ని నిక్షిప్తం చేయటానికి అవసరమైన వ్యవస్థను రూపొందించటానికి ఐసీసీ.. ప్రముఖ కంపెనీ ఒరాకిల్‌కు కాంట్రాక్టు ఇచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు అనుకున్నట్లుగా సాగకపోవటంతో దాన్ని సమీక్షించే అవకాశం మాకు వచ్చింది. మా సమీక్షతో సంతృప్తి చెందిన ఐసీసీ.. తమకు కావాల్సిన వ్యవస్థను కూడా మమ్మల్నే రూపొందించమంది. దాంతో మా దగ్గర ఉన్న సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌కు వెనువెంటనే మార్కెట్‌ లభించినట్లయింది. ఒకసారి ఐసీసీలో ప్రవేశపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ప్రపంచంలోని అనేక న్యాయ సంస్థలు, వివిధ దేశాల కోర్టులు మా వ్యవస్థను ఉపయోగించటం మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియాలో జరిగే రాయల్‌ కమిషన్స్‌లో వాడేది మా సాఫ్ట్‌వేరే! ఇంగ్లాండ్‌లోని కోర్టుల్లో.. న్యాయ కంపెనీల్లో వాడేది మా సాఫ్ట్‌వేరే!
 
మన దేశంలో..
అంతర్జాతీయంగా ఇంత పేరు పొందిన సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలోని కోర్టుల్లో ప్రవేశపెడితే అనేక లాభాలుంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి ప్రభుత్వంలోని పెద్దలకు వివరించటానికి గతంలో ప్రయత్నించా. ఇటీవలే మేము క్లౌడ్‌ ఆధారిత వ్యవస్థను రూపొందించాం. ఇది మన దేశానికి తగినట్టి వ్యవస్థ. మన దేశంలో ఉన్న జడ్జీలకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. దీనికి ప్రతిఫలంగా ప్రతి జడ్జిని రెండు వేల రూపాయల లైసెన్స్‌ ఫీజు నల్సార్‌కు ఇవ్వమని అడుగుతా! దీనితో నల్సార్‌లో ఒక అత్యాధునిక ఆర్బిటేషన్‌ సెంటర్‌ను కట్టించాలనేది నా ఆలోచన. అక్కడికి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన న్యాయశాస్త్ర కోవిదులను తీసుకువచ్చి టెక్నాలజీ వాడటం వల్ల కేసులు ఎంత సులభంగా పరిష్కరించవచ్చో చూపించాలనేది నా ఉద్దేశం.
 
హైదరాబాద్‌లో లభ్యం
మా సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలో పెద్ద పెద్ద కేసుల్లో ఉపయోగించారు. ఉదాహరణకు రిలయన్స్‌ గ్యాస్‌కు భారత ప్రభుత్వానికి మఽధ్య జరిగిన ఆర్బిట్రేషన్‌లో.. ఎన్రాన్‌ కేసులో.. న్యూఇండియా ఇన్సూరెన్స్‌ కేసుల్లో దీనినే వాడారు. అయితే వారికి ఈ సాఫ్ట్‌వేర్‌ హైదరాబాద్‌లోనూ లభ్యమవుతుందని తెలియక.. ఇతర దేశాల నుంచి లైసెన్స్‌లు కొనుక్కున్నారు. కానీ ఆర్బిట్రేషన్‌ జరిగే సమయంలో సహాయానికి మా టీమ్‌ మెంబర్స్‌నే పంపాం.
 
- స్పెషల్‌ డెస్క్‌