Child-artist-in-Fidaa-movie-is-Telangana-boy

అమెరికాలో ఈ తెలంగాణ అబ్బాయికి అందరూ ఫిదా

అమెరికా అందాలతో... తెలంగాణ పల్లె సోయగాలతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది ‘ఫిదా’. ఆ సినిమాలో తెలంగాణ యాసతో ‘భానుమతి’ మురిపిస్తే.. అమెరికన్‌ ఇంగ్లీష్‌ యాక్సెంట్‌తో పిల్లలను, పెద్దలను ఆకట్టుకున్నాడు ‘బుజ్జి’. హీరో వరుణ్‌ తేజ్‌ తమ్ముడిగా నటించిన ఆ బాలుడే ఆర్యన్‌ తాళ్ల. ఇంగ్లీష్‌లో ఇరగదీసినా ఆ కుర్రాడు మన తెలుగు అబ్బాయే. 

‘ఫిదా’ సినిమాలో.. ‘నాకు భాను అక్క కావాలి’ అని ఒకే ఒక్క తెలుగు డైలాగ్‌ చెప్పి ఎంతోమంది కళ్లల్లో నీరు తెప్పించాడు ‘బుజ్జి’. కానీ తనకు తెలుగు భాష మాట్లాడటం బాగా వచ్చు అని అంటున్నాడు ఆర్యన్‌ తాళ్ల. అదేనండి ‘బుజ్జి’. ఈ బుజ్జోడు మన తెలుగు కుర్రాడే. అమెరికాలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆర్యన్‌ నాన్న చంద్రశేఖర్‌. ఆయన స్వస్థలం నిజామాబాద్‌. అమ్మ వీణ. ఈ ఇద్దరూ అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్స్‌గా పనిచేస్తున్నారు. ఆర్యన్‌ ‘ఫ్లోరిడా’లోనే జన్మించాడు. తెలుగు భాష, తెలుగు సినిమాలంటే ఆర్యన్‌కు ఎంతో ఇష్టం. తెలుగు, ఇంగ్లీష్‌ సినిమాలకు సంబంధించి ఎన్నో డబ్‌స్మా్‌షలు కూడా చేశాడు. నటనపై కూడా ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే ఆర్యన్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. తొలిసారి భారతదేశానికి తీసుకువచ్చింది. 
 
అవకాశం వచ్చిందిలా..
‘అల్లు అర్జున్‌, బ్రహ్మానందం డైలాగ్‌లతో నేను చేసిన డబ్‌స్మా్‌షను అమ్మ ఓ టాలెంట్‌ షో ఆడిషన్‌కు, అమిగోస్‌ క్రియేషన్స్‌కి కూడా పంపింది. శేఖర్‌ కమ్ములగారి అసిస్టెంట్‌ - సులోచన,  నా గురించి శేఖర్‌గారికి చెప్పారట. ఆయన నాన్న ఫోన్‌ నెంబర్‌ తీసుకుని మాట్లాడారు. మంచి అవకాశం కదా అని నాన్న అంగీకరించి ఇండియాకు తీసుకొచ్చారు. సినిమా చెయ్యడంతో పాటు అమ్మమ్మ, నానమ్మ వాళ్లను కూడా చూడొచ్చు కదా అని హ్యాపీగా వచ్చేశా. హైదరాబాద్‌లోని శేఖర్‌గారి ఆఫీ్‌సలో మొదటిసారి ఆయన్ని చూశా. అప్పటికే ఆడిషన్స్‌లో చాలామంది పాల్గొన్నారు. నా వంతు వచ్చింది. బుజ్జి క్యారెక్టర్‌ గురించి చెప్పి.. అమెరికా నుంచి వచ్చిన పిల్లాడు ఎలా ఉంటాడో అలాగే చెయ్యమన్నారు. కొన్ని సీన్స్‌ చెప్పి సింపుల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వమన్నారు. నేను ఆయన చెప్పినట్లుగానే చేశా. అంతే నన్ను సినిమాకు ఎంపిక చేశారు. అంతమందిలో  నేను సెలెక్ట్‌ కావడం ఆనందంగా అనిపించింది.
 
ఆర్యన్‌ భవిష్యత్తులో డాక్టర్‌ కావాలని అనుకుంటున్నాడు. అది వాళ్లమ్మ కోరికట. అంతేకాదు ‘డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను’ అనే డైలాగ్‌లా.. ఈ కుర్రాడు కూడా ‘నటుడు’గా మెప్పించాలని ఆశ పడుతున్నాడు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే ఆర్యన్‌ చాలా ఇష్టం. పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. డ్యాన్స్‌ చేయడాన్ని ఇష్టపడతాడు. 
 
సునీల్‌ సినిమాలో.. 
‘ఫిదా’ తర్వాత ఆఫర్స్‌ బాగానే వస్తున్నా.. ప్రస్తుతం ఎన్‌.శంకర్‌
దర్శకత్వంలో సునీల్‌ నటిస్తున్న సినిమాలో చిన్న క్యారెక్టర్‌ మాత్రమే చేస్తున్నాడు. 
 
అమెరికా వెళ్ళాలనిపించట్లేదు!
 
‘ఫిదా’లో పల్లవి అక్క నటనకు అందరితోపాటు నేనూ ‘ఫిదా’ అయిపోయా. మేమంతా అమెరికా వెళ్లిపోయాక వరుణ్‌ రూమ్‌కి వెళ్లి.. ‘నాకు భాను అక్క కావాలి’ అని అడిగే సీన్‌ ఫేవరెట్‌. 
 
ఇందులో నా పాత్ర చూసి నాన్న ఫ్రెండ్స్‌ చాలామంది ‘వి లవ్‌ యువర్‌ యాక్టింగ్‌’ అని చెప్పడం ఆనందంగా అనిపించింది. 
 
నేను జూ.ఎన్టీఆర్‌ అభిమానిని. ఆయన యాక్టింగ్‌, డ్యాన్సింగ్‌ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. ఆయనలా డ్యాన్స్‌ చెయ్యాలనుకుంటా.
 
ఇండియాకి వచ్చినప్పటి నుంచీ అమెరికా వెళ్లాలనిపించడం లేదు. కొద్ది రోజులు ఇక్కడా, కొద్ది రోజులు అక్కడా ఉండాలని అనిపిస్తోంది. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్లతో గడపొచ్చు కదా! ఒకవైపు అమెరికా స్నేహితులను కూడా మిస్‌ అవుతున్నాననే ఫీలింగ్‌ కలుగుతోంది. 
 
షూటింగ్‌ మొదలయ్యాక 40 రోజులు బాన్సువాడలో ఉన్నా. తర్వాత కొన్ని రోజులు అమెరికా షెడ్యూల్‌ కోసం అక్కడికెళ్లాం. నేనూ, సాయిపల్లవి అక్క కిటికీలోంచి తొంగి చూసే సీన్‌ నా తొలి షాట్‌. ఆ క్షణం చాలా నెర్వ్‌సగా అనిపించింది. శేఖర్‌గారు చాలా కూల్‌ పర్సన్‌. వరుణ్‌ అన్న, పల్లవి, శరణ్య అక్కలతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ బావుంది. ’
- ఆర్యన్‌