Bihar-youth-hero-in-Latin-America-Film

బిహారీ యువకుడు లాటిన్‌ అమెరికా ‘హీరో’

 

ప్రభాకర్‌ నటించిన సినిమా కోస్టారికాలో సూపర్‌ హిట్‌

పాట్నా:ఓ బిహారీ యువకుడు లాటిన్‌ అమెరికా అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తున్నాడు. పట్నాకు చెందిన ప్రభాకర్‌ శరణ్‌ నటించిన తొలి స్పానిష్‌ సినిమా ‘ఎన్రెడాడోస్‌: లా కన్ఫూజన్‌(ద కన్ఫ్యూజన్‌)’ కోస్టారికాలో గతేడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కోస్టారికా, ముంబై, పనామా నగరాల్లో నిర్మించిన ఈసినిమాలో పాటలు, డ్యాన్సులను బాలీవుడ్‌ తరహాలో రూపొందించారు. ఇందులో ప్రభాకర్‌ హీరోగా, కోస్టారికా టెలివిజన్‌ నటి నాన్సీ డోబుల్‌ హీరోయిన్‌గా నటించారు. దర్శకత్వ బాధ్యతలు కూడా హీరో ప్రభాకర్‌ నిర్వహించాడు. భారతీయులను, లాటిన్‌ అమెరికా ప్రజలను కలపడమే ఈ సినిమా కథాంశమని ప్రభాకర్‌ తెలిపాడు.
 
లాటిన్‌ అమెరికా సినీ పరిశ్రమలో ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందన్నాడు. 2017 ఫిబ్రవరిలో కోస్టారికా, పనామా, నికరాగువా, హోండూరస్‌, గ్వాంటెమాలా, సాన్‌ సాల్వెడార్‌ దేశాల్లో విడుదలైన ఈ సినిమాను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో లాటిన్‌ అమెరికాలోని మరో డజన్‌ దేశాలతో పాటు అమెరికాలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఏక్‌ చోర్‌ - దో మస్తీఖోర్‌’ అనే టైటిల్‌తో ఇంగ్లీషు, హిందీ, భోజ్‌పూరి భాషల్లోనూ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్నాలో జన్మించిన ప్రభాకర్‌ తల్లిదండ్రులు ప్రభునాథ్‌ శరణ్‌, సుభద్ర ప్రసాద్‌ రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగులు. జార్ఖండ్‌లోని భుర్కుందా, రామ్‌నగర్‌ల్లో స్కూల్‌ విద్యనభ్యసించిన ప్రభాకర్‌ రోహ్‌తక్‌లో కాలేజీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం 2000లో కోస్టారికా వెళ్లాడు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత భారత వస్త్రాలు, రెస్టారెంట్ల చైన్‌ను ప్రారంభించాడు.