:: Welcome to NRI - Article ::

సుష్మ విజయంలో తెలుగు దౌత్యవేత్త కీలక పాత్ర

సయ్యద్‌ అక్బరుద్దీన్‌... మనోడే! 

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రసంగంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుండగా....దానివెనుక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మూలాలు ఉన్న సీనియర్‌ దౌత్యవేత్త ఒకరు కీలకపాత్ర పోషించారు. ఆయనే ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం భారత శాశ్వత రాయబారిగా ఉన్న సయ్యద్‌ అక్బరుద్దీన్‌! ఈ సయ్యద్‌ ఎవరో కాదు... ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖాధిపతిగా పనిచేసి అనేక మందికి పాత్రికేయవృత్తిలో శిక్షణనిచ్చిన ఎస్‌ బషీరుద్దీన్‌ కుమారుడు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు, విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌తో సంప్రదింపులు జరిపి ఐరాస వేదికపై భారత విధానాన్ని సమర్థంగా వినిపించడంలో ఆయన తెర వెనుక పాత్ర పోషించారు. సుష్మ ప్రసంగించినంతసేపూ అరబ్బు దేశాల మంత్రులంతా సమావేశ మందిరంలో కదలకుండా వినేలా చేశారంటే దానిలో ఆయన కృషి ఎంతో ఉంది. సుష్మ ప్రసంగాన్ని ముగిసించిన వెంటనే అమెను అభినందించిన తొలి వ్యక్తి ఒమాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి యూసుఫ్‌ అల్వీ. మోదీ అభిమానాన్ని చూరగొన్న అతికొద్దిమంది సీనియర్‌ దౌత్యవేత్తలలో అక్బరుద్దీన్‌ ఒకరు. ఆయన్ను ఒక దశలో ఢిల్లీ నుండి కదిలించడానికి సైతం ప్రధాని ఇష్టపడలేదు. పైగా తన అధికార ప్రతినిధిగా పని చేయాల్సిందిగా కోరగా...ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న తాను ఉన్న తాను అంతర్జాతీయ వేదికలపై పని చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పడంతో ప్రభుత్వం ఆయన్ను న్యూయార్క్‌కు బదిలీ చేసి ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమించింది.