:: Welcome to NRI - Article ::

మరణించిన చోటే.. పరిమళించిన మానవత్వం

ఒక మనిషి రోడ్డు పక్కన పడిపోతే.. మనకేమీ పట్టనట్లు వెళ్లిపోతాం. అదే.. దేశం కాని దేశంలో ఊపిరి ఆగిపోయిన బతుకుల్ని ఎవరు పట్టించుకుంటారు? బసంతరెడ్డి మాత్రం కచ్చితంగా స్పందిస్తారు. ‘గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌ అండ్‌ అసోసియేషన్‌’లో పనిచేస్తున్న ఆయన గల్ఫ్‌కు వెళ్లిన ప్రవాస తెలుగు పేదల మృతదేహాలను మాతృదేశానికి తెప్పించే బాధ్యతను మోస్తున్నారు.

‘‘ఒక రోజు ఫేస్‌బుక్‌లో నాకొక మెసేజ్‌ వచ్చింది. ‘‘అన్నా! గల్ఫ్‌లో ఈ బాధలు పడలేను, చచ్చిపోవడం తప్ప నాకు మరో మార్గం లేదు’’ అన్నాడతను. మెట్‌పల్లి మల్లాపూర్‌కి చెందిన సంజీవ్‌ నుంచి వచ్చిన మెసేజ్‌ అది. ‘‘సంజీవ్‌! నువ్వేమీ భయపడకు. బతికి నిరూపించుకోవాలి కానీ.. సచ్చి ఏం సాధిస్తావు?’’ అని నాలుగు ఊరడింపు మాటలు చెప్పాను. రోజుకు నాలుగైదుసార్లు ఫోన్లు చేశాను. అతని మనసు కుదుట పడింది. దుబాయ్‌లో సంజీవ్‌ పనిచేసే కంపెనీతో మాట్లాడి.. ఇంటికి తీసుకొచ్చేశాను. ఒక బందీకి విముక్తి కలిగినప్పుడు కలిగే ఆనందం సంజీవ్‌ కళ్లలో కనిపించింది. కష్టంలో ఉన్న ఒక మనిషికి చేయి అందించినప్పుడు దొరికే సంతృప్తి.. ఇంకెందులోనూ దొరకదని నాకు అనిపించింది.
 
కంపెనీతో పోరాటం
అలాంటిదే మరో సంఘటన - నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అజయ్‌గౌడ్‌ దుబాయ్‌లో భవననిర్మాణ కార్మికుడు. ఎత్తయిన భవనం మీద నుంచి కింద పడిపోయాడు. నడుము విరిగిపోయింది. అప్పటి వరకు ఆయనతో ఊడిగం చేయించుకున్న అల్‌ జజీరా అనే భవననిర్మాణ సంస్థ అజయ్‌ను పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి దుబాయ్‌కు వెళ్లి.. అతని బాగోగులు చూసే పరిస్థితి.. వీళ్ల కుటుంబానికి లేదు. అక్కడ అతను నరకం అనుభవిస్తుంటే.. ఇక్కడ కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. ఆ విషయం నన్ను కలచివేసింది. కొంతమందితో కలిసి దుబాయ్‌లోని కంపెనీతో పోరాడాం. విమానంలో బిజినెస్‌ క్లాస్‌ టికెట్లను కంపెనీతో కొనిపించి.. వైద్యుల పర్యవేక్షణలో అజయ్‌ను సొంతూరికి తీసుకొచ్చాం. అంతటితో ఊరుకోకుండా.. ప్రతి నెలా 30 వేలు కంపెనీ చెల్లించేలా చేశాం.
 
నేనూ బాధితుడినే!
గల్ఫ్‌ బాధితుల కోసం నేనింతగా స్పందించడానికి కారణం - నాకు ఆ దేశాల జీవితం తెలియడం. ఒకప్పుడు నేను కూడా గల్ఫ్‌ బాధితుడినే! నిజామాబాద్‌ జిల్లాలోని జక్కరామ్‌పల్లి మండలం మనోహరాబాద్‌ మా సొంతూరు. మాది వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌తో చదువు ఆగిపోయింది. మేము ముగ్గురు అన్నదమ్ములం. తెలంగాణలో వానలు వస్తేనే పంటలు. లేకపోతే కరువు. అప్పులు చేసి బోర్లు వేసినా.. చుక్క నీళ్లు పడలేదు. ‘‘ఎలా బతకాలో బిడ్డా’’ అని రోజూ అమ్మానాన్నలు బాధపడేవారు. అప్పటికే నాకు పెళ్లి అయ్యింది. ఒకవైపు భార్యను, మరోవైపు తల్లితండ్రులను పోషించే బాధ్యత నా మీదే పడింది. అప్పటి పరిస్థితులను బట్టి ‘‘దుబాయ్‌కి వెళితే తప్ప బతకలేము’’ అనే ఆలోచన వచ్చింది. మా అమ్మ, నా భార్య ఇద్దరు బంగారు నగల్ని తాకట్టు పెట్టి.. ఆ డబ్బుతో ఎడారి దేశానికి వెళ్లాను.
 
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా - హైదరాబాద్‌ నుంచి ముంబయికి జనరల్‌ బోగీలో నిలువుకాళ్ల మీద నిల్చుని వెళ్లాల్సి వచ్చింది. ముంబయిలో ఐదుగురు ఉండే గదిలో ముప్పయి మందితో ఇరుకిరుకు జీవితం అనుభవించాను. కొన్నాళ్లకు ఒక అరబ్‌షేక్‌ వచ్చి.. శారీరకశ్రమ చేయగలిగే బలం ఉన్న వాళ్లను ఎంపిక చేసుకున్నాడు. అందులో నేనొకణ్ణి. దుబాయ్‌ వెళ్లాక భవన నిర్మాణాల్లో పనికి కుదిరా. ఇసుక, కంకర మోసే పని నాది. ఎంత చేసినా దినకూలీ తప్ప.. మిగులు లేదు. ఇంటికి వచ్చేద్దామనుకుంటే.. చేసిన అప్పులు భయపెట్టాయి. ఆ సంఘర్షణ భరించలేక చావే శరణ్యం అనుకున్నాను. గుండె దిటవు చేసుకుని ఆత్మహత్య ఆలోచనను వదిలించుకున్నాను కానీ.. అక్కడ ఎంతోమంది బలవన్మరణాలను పాల్పడుతున్నారు.
 
ఆ బతుకు నరకం..
దుబాయ్‌లో ఉన్నప్పుడు ‘‘ఏమి బతుకులురా మనవి’’ అనుకుని నాలో నేనే ఏడ్చుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అయినా తోటి వ్యక్తికి కష్టం కలిగితే స్పందించే మనస్తత్వం నాది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించాడు. తోటి కార్మికులతో ‘‘ఒక్క రోజు జీతం ఇవ్వండి భాయ్‌. ఆ మొత్తాన్ని చనిపోయిన కుటుంబానికి అందిద్దాం. రేప్పొద్దున మనకు ఇలాంటి పరిస్థితులు రావని చెప్పలేం’’ అన్నాను. పేదల్లో అందరి కష్టాలు, కన్నీళ్లు ఒకటే కాబట్టి.. ముందుకొచ్చారు. ఆ విధంగా చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు సాయం చేయడం అలవాటైంది. గల్ఫ్‌లో ఉన్న రాజస్థాన్‌, గుజరాత వాళ్లు కూడా ఇదే పని చేయడం మొదలుపెట్టారు. అక్కడి పరిస్థితులు ఒక్కటని కాదు. ఒక రోజు పని ప్రదేశానికి వెళ్లాం. తిరిగి ఉన్నచోటుకు రావాలంటే ట్యాక్సీ రాలేదు. పదిహేను కిలోమీటర్లు అలసిసొలసి నడిచొచ్చాం. ఇంటికి ఫోన్లు చేసుకుని.. కష్టాలు పంచుకుందామంటే.. చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. ఎప్పుడో ఒకసారి ఇంటికి ఫోన్‌ చేస్తే ‘‘మాకు ఇక్కడ పంటలు లేవు. వానల్లేవు. అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. నువ్వు ఆ దేశంలోనే పనిచేసుకుని బతుకు బిడ్డా’’ అన్న మాటలే వినిపించేవి. మూడు నాలుగేళ్లు ఇంటి ముఖమే చూడలేదు. అఖరికి బాధలు భరించలేక సొంతూరుకు వచ్చేశాను. ఆ దేశాల్లో నా బాధలు పడేటోళ్ల కన్నీళ్లు తుడిచే పని పెట్టుకున్నానిప్పుడు.
 
గల్ఫ్‌ బాధితుల కోసం..
మాది ‘గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’. ఇదొక స్వచ్ఛంద సంస్థ. ఎలిశెట్టి శ్రీనివాసశర్మ వ్యవస్థాపకులు. ఇప్పుడు జువ్వాడ శ్రీనివాసరావు అధ్యక్షులు. గల్ఫ్‌లో పలు రకాల మరణాలు సంభవించి.. అక్కడే ఉండిపోయిన మృతదేహాలను తీసుకొచ్చే పని మాది. మృతదేహాలను తీసుకొచ్చే సమయంలో.. జిల్లా కలెక్టర్‌ సంతకం, పోలీసుస్టేషన్‌ల నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు.. పెద్ద తతంగమే ఉంటుంది. గల్ఫ్‌ వెళ్లే అమాయకులతో ఎంతోమంది ఆడుకుంటున్నారు. గోవిందరాజు అనే ఓ వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. అతనికున్నది విజిట్‌ వీసా మాత్రమే! దుబాయ్‌ ఎయిర్‌పోర్టు నుండి బయటికి వెళుతూనే.. అక్కడి ఏజెంట్‌ పాస్‌పోర్ట్‌ లాగేసుకున్నాడు. ‘‘అయ్యో! అది నా పాస్‌పోర్టు.. ’’ అంటూ భయాందోళనకు గురయ్యాడతను. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు నెలలపాటు అతని మృతదేహం ఆ దేశంలోనే ఉండిపోయింది. కొన్ని రోజుల పాటు పోరాడి.. సొంతూరికి మృతదేహాన్ని తెప్పించగలిగాం.
 
32 మందిని విడిపించి..
ఇరాక్‌ సరిహద్దుల్లో ఉంటుంది ఎర్విన్‌ పట్టణం. ఉపాధి ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తిపోవడం మన వాళ్లకు అలవాటు. ఎర్విన్‌లో పనిచేసేందుకు 32 మంది మన తెలుగువాళ్లు వెళ్లారు. వీళ్లందరూ దుబాయ్‌ మీదుగా టూరిస్ట్‌ వీసాతో ఇరాక్‌ వెళ్లారు. ఆ వీసాకు గడువు పదిహేను రోజులే! ఆ తర్వాత కంపెనీ వీసా వస్తుందన్నారు. అక్కడ పనిచేస్తే నెలకు ఒకటిన్నర లక్ష వస్తుందని ఆశ చూపారు. వీసా గడువు పూర్తవుతూనే.. కష్టాలు మొదలయ్యాయి. పని లేదు. తిండి లేదు. ఆఖరికి రోడ్ల మీద చెత్తకాగితాలు, ప్లాస్టిక్‌ డబ్బాలు వేరుకుని బతకాల్సి వచ్చింది. మూకుమ్మడిగా అందర్నీ అరెస్టు చేసి.. సెల్‌లో పడేశారు అక్కడి పోలీసులు. మాటేటి కుమురయ్య అనే వ్యక్తి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అక్కడి చట్టాలు కఠినం. ప్రభుత్వాల సాయంతోనే ప్రయత్నం చేయాలి తప్పిస్తే మరో మార్గం లేదు. విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లాం.
 
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి సమస్యను చెప్పాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో మూడున్నర నెలల తరువాత.. ఇరాక్‌లోని 32 మంది విడుదల అయ్యారు. వీటన్నిటి వెనక నా ఒక్కడి కృషే కాదు. సన్మిహితులు, మిత్రులు, ఔదార్యం ఉన్నవారి అండదండలతోనే చేయగలిగాను. పేదరికం ఎంత ఘోరమైనదంటే.. ఆఖరికి మృతదేహాలను కూడా కన్నవాళ్లకు కనిపించకుండా చేస్తుంది. కడచూపునకు కూడా నోచుకోనివ్వదు. అలాంటి సమయంలోనే - మనసున్న మనలాంటి మనుషులం స్పందించాలి. ఏ దిక్కూలేని చోట.. మానవత్వం ఊపిరి పోసుకోవాలి అన్నదే నా భావన!
- రాళ్లపల్లి రాజావలి