Apnrt-Coordinater-Mukku-Tulasi-Interview

గల్ఫ్‌ బాధితులకు గాడ్‌ఫాదర్‌

ఎన్నారైలూ.. జర జాగ్రత్త..

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఏడేళ్లపాటు జైలే 

నిబందనలు తెలుసుకోకుండా డ్రైవింగ్ చేయొద్దు 

ఏపీఎన్నార్టీ దుబాయ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ముక్కు తులసీ

తిరుపతి: ఎస్వీయూలో పీహెచ్‌డీ చేస్తూ విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. దుబాయ్‌లో ఉద్యోగమైనా.. నాయకత్వ లక్షణాలు విడిచిపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ టీమ్‌ (ఏపీఎన్నార్టీ)లో క్రియాశీలకంగా పనిచేసేవారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్‌ ఏపీఎన్నార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. సౌదీ చెరలో చిక్కుకున్న ఎందరో అభాగ్య మహిళలను వారి స్వస్థలాలకు పంపేఏర్పాట్లు చేశారు. దీనికోసం సగం జీతం ఖర్చు పెడతారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ‘ముక్కు’సూటిగా  వ్యవహరిస్తారు. ఆయనే ముక్కు తులసీకుమార్‌. మంగళవారం తిరుపతికి వచ్చిన ఆయన ‘యువ’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

మాది తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని రామచంద్రాపురం మండలంలో చిన్నపల్లె టూరు. ఉన్నత విద్యాబ్యాసమంతా తిరుపతిలోనే సాగింది. అప్పట్లో విద్యార్థి సంఘ నాయకుడిగా సమస్యలపై పోరాడా. ఆ తర్వాత ఉద్యోగరీత్యా దుబాయ్‌ వెళ్లా. ఏడాదన్నర తర్వాత మళ్లీ తిరుపతికి వచ్చా. దుబాయ్‌లో నిద్రలేవగానే మొదట ‘ఆంధ్రజ్యోతి’ని ఆన్‌లైన్‌లో చదివేస్తా. గల్ఫ్‌ సమస్యలపై వచ్చిన కథనాలను నోట్‌ చేసుకుంటా. ఆ కథనం రాసిన విలేకరి ఫోన్‌ నెంబరు తెలుసుకుని మరింత సమాచారం తీసుకుంటా. సమస్య పరిష్కారమయ్యే వరకు ఎంత ఇబ్బంది వచ్చినా వదిలిపెట్టను. కాకపోతే, కొన్ని కేసుల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. చివర్లో న్యాయం జరిగేలా పోరాడుతా. ఇటీవల సౌదీ వెతలు గురించి ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలతో మన జిల్లానుంచి చాలా వరకు వలసలు తగ్గిపోయాయనే చెప్పొచ్చు. 

మైగ్రేషన్‌ పాలసీతో మేలు

ప్రవాసాంధ్రులకోసం ఏపీఎన్నార్టీ మైగ్రేషన్‌ పాలసీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడం శుభపరిణామం. దీనవల్ల ఏపీఎన్నార్టీ సభ్యులుగా చేరే అందరికీ ‘ప్రవాసాంధ్ర భరోసా’ కింద బీమా సౌకర్యం ఉంటుంది. ఉపాధి కోల్పోయే వారిని తక్షణం ఆదుకునేలా ‘ప్రవాసాంధ్ర సహాయనిధి’ ఏర్పాటుకానుంది. మైగ్రేషన్‌ పాలసీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించింది. తక్షణమే రూ.20 కోట్లు ఇచ్చేందుకు సీఎం అంగీకరిం చారు.ఇకపై దుబాయ్‌లో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే మూడునెలల వరకు కుటుంబ సభ్యులు భౌతిక కాయం గురించి ఎదురుచూడాల్సిన పని లేదు. దీనికోసం 24గంటల హెల్ప్‌లైన్‌ను చంద్రబా బు ఏర్పాటుచేశారు. 

ఎన్నారైలూ జాగ్రత్త..!

వలసదారుల విషయంలో యూఏఈ ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను తీసుకొస్తోంది. సూటిగా చెప్పాలంటే ఎన్‌ఆర్‌ఐల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. ఇతరులతో ఫోను మాట్లాడేటప్పుడు వారి సంభాషణలను రికార్డు చేయొద్దు. ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ కోసం యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు తెలిస్తే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా రికార్డింగ్‌ చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు. వ్యక్తిగత విషయాలపై సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు, ఫొటోలు పెట్టడం, పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చేయడం కూడా శిక్షార్హమే. అలాగే, యూఏఈలోని ట్రాఫిక్‌ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే డ్రైవింగ్‌ చేయాలి. రోడ్‌ సిగ్నల్‌ దాటితే 800 దిర్హమ్స్‌ జరిమానాతోపాటు 15 రోజుల పాటు వాహనాన్ని పోలీసుల వద్దే పెట్టుకుంటారు. గంటకు 60 కిలోమీటర్ల వేగానికి మించితే వెయ్యి దిర్హమ్స్‌ జరిమానా చెల్లించాలి. ఆ వాహనం 30 రోజులు మన చేతుల్లోకి రాదు. సౌదీలో మహిళలకు దుస్తుల విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయి. డ్రస్‌కోడ్‌ గురించి వీసాపై సంతకం పెట్టుకుంటారనేవి అపోహలు మాత్రమే. కాకుంటే ఆ దేశ సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులను ధరించాలి. 

గల్ఫ్‌కు వెళ్లాలనుకుంటే.. 
  • గల్ఫ్‌కు వెళ్లాలనుకునే నిరుద్యోగులు తప్పనిసరిగా ఆయా పోలీసు స్టేషన్లలో నమోదు చేసుకోవాలి. ట్రావెల్స్‌ ద్వారా వెళ్లే కార్మికులు విధిగా ఆ ట్రావెల్స్‌ వివరాలను పోలీసులకు అందించాలి. 
  • విజిట్‌ వీసా ద్వారా గల్ఫ్‌కు వెళ్లి ఉద్యోగం పొంది తే వెంటనే వీసా స్టేటస్‌ను మార్చుకోవాలి. గల్ఫ్‌ కు వెళ్లేటప్పుడు నిషేధిత మెడిసిన్స్‌ తీసుకెళ్తూ ప ట్టుబడితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇంటిపనికోసం మహిళలు వెళ్లడం మానుకోవాలి. 
  • అనధికార ఏజెంట్ల మాటలు నమ్మి గల్ఫ్‌ వెళ్తే తిరిగి రావడం చాలా కష్టం.ఇలా.. గల్ఫ్‌లో మోస పోయి ఉంటే తప్పనిసరిగా పోలీసులకు సమా చారమిచ్చి ఇండియా రప్పించేందుకు అధికారుల ద్వారా ప్రయత్నించాలి.       
  • దుబాయ్‌లో ముక్కుతులసిని 971552386541 (కాల్స్‌), 97568025589 (వాట్సప్‌), ఈ మెయిల్‌: Mukkuthulasi@gmail.comలో సంప్రదించవచ్చు. 
డీపీవో కోసం కసరత్తు 
దుబాయ్‌ పోర్ట్స్‌ అండ్‌ కస్టమ్స్‌ (డీపీవో)తో ఏపీ ప్రభుత్వం పరస్పర ఒప్పందం కుదుర్చుకునేందుకు కసరత్తు జరుగుతోంది. దీనికోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నా. డీపీవోతో మన రాష్ట్రంలోని ఓడరేవులను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల దుబాయ్‌ పర్యటనలోనూ ఆయన డీపీవో అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై సోమవారం అమరావతిలో నేను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశా.డీపీవోకు సంబంధించిన వివరాలను అంద జేశా. దాదాపు రూ.800 కోట్ల ప్రాజెక్టు ఇది.