:: Welcome to NRI - Article ::

అట్లాంటా ఇంట...అన్నమయ్య పాట!

అమెరికాలోని అట్లాంటాలో అన్నమయ్య, త్యాగయ్య, పురందరదాసు, ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు చిన్నారుల గళాల నుంచి వినపడుతున్నాయిఇప్పుడు...! అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజం. అక్కడ స్థిరపడ్డ మన తెలుగు కుటుంబాలకు చెందిన చిన్నారులు భారతీయ సంగీతాన్ని విదేశీ గడ్డపై విన సొంపుగా ఆలపిస్తున్నారు. ప్రశంసలు అందుకోవడమే కాదు... తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఎదుట పాడే సువర్ణఅవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఎస్‌విబిసి చానల్‌ నిర్వహించే ‘నాద నీరాజనం’ కార్యక్రమంలో తమ కీర్తనలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ చిన్నారుల విజయం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా... స్వాతి కరి. అమెరికాలో మన సంగీతం, సంస్కృతిని విస్తరింపజేస్తున్న ఆమె ప్రయాణం ఆసక్తికరం.
 
స్వాతి కరి తెలుగింటి ఆడపడుచు. ఆమెది హైదరాబాదు. చదువుకోసం అమెరికాకు వెళ్లిన ఆమె శ్రీకాంత్‌ కరిని వివాహం చేసుకుని అట్లాంటాలో స్థిరపడ్డారు. పదిహేను సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. గ్రీన్‌ కార్డు వచ్చిన కుటుంబం వాళ్లది. స్వాతి సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగిని. విదేశాల్లో ఉన్నా స్వదేశీ సంస్కృతి, సంగీతం, సంప్రదాయాలను ఆమె మరవలేదు. చదివింది ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అయినా.. సంగీతమంటే స్వాతికి ప్రాణం. ఆకాశవాణి సంగీత కళాకారిణి అయిన ఆమె బండి శ్యామల, బాలా త్రిపుర సుందరి, ప్రతిమ శశిరేఖల వద్ద ఎనిమిదేళ్ల పాటు సంగీతంలో శిక్షణ పొందారు.
 
సంగీతం మీద ఇష్టంతో...
చేస్తున్నది సాఫ్ట్‌వేర్‌ జాబ్‌... పైగా ఎంతో ఒత్తిడితో కూడుకున్న వృత్తి. మరోవైపు కుటుంబ బాధ్యతలు. ఖాళీ సమయం దొరకడం గగనం. అలాంటి పరిస్థితుల్లో స్వాతి చూపు సంగీతంపై ఎలా పడింది? ‘‘మొదటి నుంచి నాకు సంగీతంలో పైకి రావాలని కోరిక ఉండేది. అందుకే స్వదేశం వీడినా...సంగీతంపై నాకున్న దాహం మాత్రం పోలేదు. పైగా మొదటి నుంచి నాకు ఏదో చేయాలనే తపన బాగా ఉండేది. ఇక్కడ ఉద్యోగం, కుటుంబ బాధ్యతల ఒత్తిడితో నలిగిపోతున్న ఆడవాళ్లకు ప్రశాంతతను ఇచ్చే పని చేస్తే బాగుండుననిపించింది. అప్పుడే ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల తలెత్తే ఒత్తిడి నుంచి ఆడవాళ్లకి సాంత్వన నిచ్చేది సంగీతమేనని అనిపించింది. అందుకే సంగీతాన్ని నాలాంటి ఆడవాళ్లకే కాకుండా చిన్నారులకు కూడా నేర్పిస్తే బాగుంటుందనిపించింది. నా భర్త శ్రీకాంత్‌ కూడా నా ఆలోచన బాగుందన్నారు. ఇద్దరం చర్చించుకున్నాం. పెద్దలతోపాటు పిల్లలకు కూడా సంగీతం ‘రుచి’ చూపించాలనుకున్నాం. ఆ ఆలోచనతోనే ‘సరస్వతి మ్యూజిక్‌ అకాడమీ’ని 2013లో స్థాపించాను’’ అని స్వాతి చెప్పారు.
 
అక్కడి పిల్లలకు సంగీతం నేర్పడానికి స్వాతి చాలానే కష్టపడ్డారు. ‘‘మొదటే శాస్త్రీయ సంగీతం మొదలెడితే పిల్లలు ఆసక్తి చూపరు. అందుకే లలిత సంగీతం పాటలను నేర్పించడం ప్రారంభించాను. వీకెండ్స్‌ పూర్తిగా ఈ పని మీదే మనసు లగ్నం చేసేదాన్ని. అలా పిల్లలకు భక్తిగేయాలు, వాగ్గేయకారులు సమకూర్చిన కీర్తనలు నేర్పించడం మొదలెట్టాను. ఇక్కడి మహిళలకు, పిల్లలకు సంగీతం నేర్పాలనే ఆలోచన రావడానికి మరో కారణం కూడా ఉంది. అమెరికాలో పండుగలు, పబ్బాలప్పుడు చాలామందిమి కలుస్తుంటాము. అప్పుడు నేను వినిపించే సంగీతం, వాగ్గేయకారుల కీర్తనలు విని చాలామంది మహిళలు స్వదేశంలో ఉన్నామన్న అనుభూతికి లోనయ్యేవారు. నాతోపాటు వాళ్లు కూడా ఉత్సాహంగా గళం కలిపేవారు. వారిలోని ఆ ఆసక్తి నాలో ఎంతో ఆనందాన్ని రేకెత్తించింది. నేను కూడా వారిని పాడమంటూ బాగా ప్రోత్సహించే దానిని. అప్పుడే నాకు ఇంకో ఆలోచన కలిగింది. ఇక్కడి తెలుగు పిల్లలకు సంగీతం నేర్పించడం ద్వారా మన సంస్కృతి, కళా సంపద గురించి వారికి తెలుస్తుందనిపించింది’’అన్నారామె. అలా ఎనిమిదేళ్ల పాటు తాను తీసుకున్న కర్ణాటక సంగీత శిక్షణను ఒక సామాజిక లక్ష్యానికి ఉపయోగించాలని స్వాతి నిశ్చయించుకున్నారు. అక్కడి పిల్లల తల్లితండ్రులు కూడా తమ చిన్నారులకు సంగీతంలో శిక్షణ ఇవ్వవలసిందిగా స్వాతిని కోరారు. అలా పెద్దల్లోనే కాదు ఆబాలగోపాలంలో సంగీతంపై ఇష్టాన్ని పెంపొందించడంలో స్వాతి కృతకృత్యులయ్యారు.
 
ఇంగ్లీషులో రాసి...
సరస్వతి మ్యూజిక్‌ అకాడమీ ద్వారా ఆసక్తి ఉన్న అక్కడి తెలుగు మహిళలకు, చిన్నారులకు ఉచితంగా సంగీతాన్ని చెప్పడం ప్రారంభించారామె. ‘‘అమెరికాలోనే పుట్టి పెరిగిన తెలుగు పిల్లలకు తెలుగు భాష అంతంతమాత్రంగానే వస్తుంది. తెలుగు రాయలేరు. చదవలేరు. అందుకే వారికి సంగీతం నేర్పించడానికి చాలానే కష్టపడ్డాను. వాళ్లకి నేర్పించే కృతులను మొదట ఇంగ్లీషు లిపిలో రాసి, ఆ తర్వాత దాన్ని వారికి నేర్పించేదాన్ని. అంతేకాదు ఆ కృతిని చిన్నారులకు నేర్పించే ముందు దాని పూర్వాపరాలను, అర్థాలను, భావాలను, వాటి సృష్టికర్తల ప్రాముఖ్యాన్ని ఇంగ్లీషులో వారికి అర్థమయ్యేలా చెప్పి సాధన చేయించేదాన్ని. నా సంగీతం క్లాసు ఒక గంట ఉంటుంది. పిల్లల్లో సంగీతంపై ఆసక్తి పెరగడానికి తొలుత 15 నిమిషాలు లైట్‌ మ్యూజిక్‌ చెప్పేదాన్ని. తర్వాత45 నిమిషాలు శాస్త్రీయ సంగీతం నేర్పేదాన్ని. మొదట మా అమ్మాయి శ్రావణి మీద ఈ ప్రయోగం చేసాను. కారులో ప్రయాణిస్తూ తనకు సంగీతం నేర్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా అమ్మాయి విషయంలో సక్సెస్‌ కావడంతో మిగతా పిల్లలకు కూడా నేర్పించగలననే ఆత్మవిశ్వాసం వచ్చింది. చిన్నారులు కూడా చెప్పింది వెంటనే గ్రహించి ఎంతో కృషి చేసి కీర్తనలు, పాటలు నేర్చుకున్నారు. ఇప్పటి వరకూ 400 మందికి సంగీతంలో శిక్షణ ఇచ్చాను. వీళ్లల్లో 8 ఏళ్ల వయసు వారి నుంచి 55 సంవత్సరాల వారి వరకూ ఉన్నారు. తెలుగులో పట్టు లేకున్నా కూడా పిల్లలు సంగీతాన్ని బాగానే ఆకళింపుచేసుకున్నారు. నా శిష్యులతో కలిసి వివిధ వేదికలపై గళార్చనలు నిర్వహించాను. బృందగానాలను చేయించాను. అట్లాంటాలోని వివిధ ప్రాంతాల్లో దశగళార్చన, అర్ధశతగళార్చన, శతగళార్చన వంటివి చేయించా. తానా, నాటా, ఆటా వంటి సంస్థల సహాయసహకారాలతో పిల్లలు, పెద్దలతో బృందగానాలను పలు చోట్ల నిర్వహించాం. ‘హిందూ టెంపుల్‌ ఆఫ్‌ అట్లాంటా’ వంటి వాటిల్లో కూడా బృందగానాలు నిర్వహించి ఎందరో ప్రశంసలు పొందాం’’ అని స్వాతి చెప్పారు.
 
వెంకన్న ఎదుట అవకాశం...
స్వాతి చేస్తున్న నిర్విరామకృషికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రోత్సాహం లభించింది. టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర భక్తిఛానల్‌ (ఎస్‌విబిసి)లో నాద నీరాజనం కార్యక్రమంలో చిన్నారులు, మహిళలతో బృందగానం చేసే అపూర్వ అవకాశం లభించింది. ‘వాగ్గేయకారుల వైభవం’ పేరిట 11 మంది సంగీత విద్వాంసుల కృతులను స్వాతితో కలిసి 25 మంది ఆలపించారు. ఈ బృందంలో 17 మంది బాలబాలికలు ఉన్నారు. ఇటీవల ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమై పలువురి ప్రశంసలను అందుకుంది. ఈ కార్యక్రమం కోసం అట్లాంటా నుంచి మొత్తం 18 కుటుంబాలు ఇక్కడకు తరలిరావడం విశేషం. ‘‘మేము చేసిన బృందగానాల వీడియోను ఎస్‌విబిఎస్‌ ఛానల్‌కు అందజేశాం. వాటిని చూసి మాకు తమ ఛానల్‌లో పాడే సదవకాశాన్ని ఇచ్చారు’’ అని స్వాతి తెలిపారు.
 

‘‘ఈ కార్యక్రమంలో మొత్తం 13 కీర్తనలు పాడాం. దీనికోసం ఆరేడు నెలల పాటు పిల్లలు, పెద్దలు సుదీర్ఘ సాధన చేశారు. సాక్షాత్తు ఏడుకొండలవాడి ముంగిట పాడే మహాద్భాగ్యం కలగటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. పిల్లల ఆనందం అయితే మాటల్లో చెప్పలేను. భవిష్యత్తులో కూడా సంగీత పరంగా మరిన్ని ప్రయోగాత్మక కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నాను’ అని స్వాతి చెప్పారు.

దేవుడిచ్చిన అదృష్టం..
‘నాద నీరాజనం’ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టం. దైవకృప వల్లే ఈ అవకాశం పొందగలిగాను. చిన్నప్పటి నుంచి సంగీతం వినేదాన్ని. ఆ ఆసక్తితో స్వాతి గారి దగ్గర లైట్‌ మ్యూజిక్‌ నేర్చుకోవడం మొదలెట్టాను. గమకాలు, స్వరాలు కొద్దిగా కష్టంగా అనిపిస్తుండేవి. స్వాతిగారు వాటిని ఎప్పటికప్పుడు కరెక్టు చేసి బాగా శిక్షణ ఇచ్చారు. మా కుటుంబం 10 సంవత్సరాల నుంచి అట్లాంటాలో ఉంటోంది. ఇక్కడే చదువుకున్నాను. లెక్కల టీచర్‌గా పనిచేస్తున్నాను.
- గాయత్రి, అట్లాంటా
 
సర్టిఫికేట్లు కూడా ఇస్తారు..
సరస్వతీ మ్యూజిక్‌ అకాడమీకి ‘సిలికాన్‌ ఆంధ్ర’కు చెందిన ‘సంపద’ సంస్థ గుర్తింపు ఉంది. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘సంపద’ ద్వారా తమ దగ్గర సంగీతంలో శిక్షణ పొందిన వారికి అర్హతా సర్టిఫికేట్లను కూడా చిన్నారులకు స్వాతి అందిస్తున్నారు. అలా తానందిస్తున్న సంగీత శిక్షణకు ఒక ప్రామాణికతను కలుగజేయడంలో కూడా స్వాతి సక్సెస్‌ అయ్యారు.
 
తిరుమలలో వాగ్గేయకార వైభవం
‘నాద నీరాజనం’ కార్యక్రమంలో ‘వాగ్గేయకార వైభవం’ థీమ్‌గా తీసుకుని పదకొండుమంది ప్రముఖ కంపోజర్ల కీర్తనలు పాడారు. ఉత్తుక్కాడు వెంకట సుబ్రమణ్య అయ్యర్‌, త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షితార్‌, రామదాసు, పురందరదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, అన్నమయ్య తదితరుల కీర్తనలు ఆలపించారు. వాటితోపాటు హిందుస్తానీ భజనను స్వాతి ప్రత్యేకంగా పాడారు.
 
సాధనతో సాధ్యం...
అమెరికా నుంచి వచ్చి తిరుమలలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. పాటలు నేర్చుకునేటప్పుడు లిరిక్స్‌ పలకడానికి బాగా కష్టపడ్డాను. పైగా కొన్ని కీర్తనలు, సంస్కృతంలో ఉండడం వల్ల సరిగా పాడగలనా అని భయమేసింది. ఎందుకంటే తెలుగే సరిగా రాదు. సంస్కృతం కదా... ఇంకా కష్టంగా ఉంటుంది. అయినా సాధనతో ఏదైనా సాధ్యమవుతుందని తెలుసుకున్నాను...
-శ్రావణి, అట్లాంటా

 

Loading...