ఈ పది ప్రాంతాలు యువత కోసమే.. !

ఓ వయసు దాటాక.. ప్రయాణాలు చేయాలనే ఆసక్తి పోతుందన్న మాట కొత్తదేం కాదు. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక.. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోతుంటారు. బంధువుల పెళ్లిళ్లకు వెళ్లేందుకే తీరిక ఉండని పరిస్థితులు ఉంటాయి. యుక్త వయసులో ఉన్నప్పుడే విహారయాత్రలయినా.. వింత వింత ప్రదేశాల సందర్శన అయినా చేస్తే ఆ మజానే వేరు. అందుకే యూత్‌లో ఉన్నప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలంటుంటారు పెద్దలు. అలా అని విచ్చలవిడిగా ఖర్చు చేయాలని మాత్రం కాదండోయ్. మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఆనందాన్ని ఎలా సాధించగలమనేది చూసుకోవాలి. అలా తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలేవో ఓ లుక్కేద్దామా. విమాన ఖర్చులు భరించగలిగితే చాలు.. చాలా తక్కువ మొత్తంలోనే మిగిలిన అవసరాలు తీర్చే పది ప్రదేశాల విశేషాలేంటో తెలుసుకోండి. 

1. ఆక్లాండ్, న్యూజిలాండ్ ( Auckland, New Zealand ): తిండి, హోటల్ బస, ఇతర అవసరాలన్నీ.. విమాన ఖర్చులకయే మొత్తం కంటే చాలా చాలా తక్కువట. అమెరికా నుంచి ఈ ప్రాంతానికి వెళ్లడం మాత్రమే ఖర్చుతో కూడుకున్నదనీ, మిగిలినదంతా చీప్ అని చెబుతుంటారు. 
 
2. మర్రాకెచ్, మొరాకో (Marrakech, Morocco): 2015లో ఎక్కువ మంది సందర్శనకు వచ్చిన ప్రాంతం ఇది. అక్టోబర్ నుంచి మే నెల వరకు ఇక్కడ రేట్లు చాలా చాలా తక్కువగా ఉంటాయట. ఓ సామాన్య పౌరుడు తక్కువ ఖర్చుతో మంచి భోజనం తినగలిగేలా.. ఇక్కడ రేట్లు ఉంటాయట. 
 
3. మచ్చు పిచ్చు, పెరూ (Machu Picchu, Peru): సౌత్ అమెరికా ప్రాంతాల్లో చూడదగ్గ ప్రాంతం పెరూ. అక్కడ ప్రాంతాలను సందర్శించే వారికి మంచి అనుభూతి కలుగుతుందట. ఇక్కడ కూడా హోటల్ రేట్లు చాలా చీప్‌గా ఉంటాయట. కేవలం పర్యాటకుల కోసమని అక్కడి ప్రభుత్వం కొన్ని విధానాలను రూపొందిస్తుందంట. 
 
4. వర్ణా, బల్గేరియా(Varna, Bulgaria): తూర్పు యూరోపియన్ దేశాల్లో బల్గేరియాకే ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. ఇక్కడ ఉన్న నల్లసముద్రం పక్కనే ఉండే హోటళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయట. 
 
5. మెడిల్లిన్, కొలంబియా (Medellin, Colombia): కొలంబియా పేరు చెప్పగానే డ్రగ్ మాఫియా గుర్తుకొస్తుంది. ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఇక్కడ నుంచే కొకైన్ డ్రగ్స్ వంటివి సరఫరా అవుతుంటాయట. కానీ.. కొలంబియాలోని మెడిల్లిన్, బోగోటా, కేలీ వంటి సుందరమైన ప్రాంతాలు చాలా తక్కువ రేట్లతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 
 
6. ఆంకోర్ వాట్, కాంబోడియా (Ankor Wat, Cambodia): ఇక్కడ ఉన్న బౌద్ధ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చైనా, టిబెట్ వంటి దేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ కూడా హోటల్ రేట్లు తక్కువగా ఉంటుంటాయి. కానీ ఈ ప్రాంతానికి వచ్చేందుకు విమానాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయట. 
 
7. మాడ్రిడ్, స్పెయిన్ (Madrid, Spain): యూరప్ దేశాల పర్యటన చాలా ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ.. స్పెయిన్‌ మాత్రం వీటన్నింటికీ భిన్నం. సెప్టెంబర్, అక్టోబర్, ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఈ నాలుగు నెలల్లోనే హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలన్నీ పర్యాటకులకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. 
 
8. హనోయ్, వియాత్నాం (Hanoi, Vietnam): తక్కువ బడ్జెట్లో, ఎక్కువ ఆనందాన్ని పొందగలిగే హనోయ్ కంటే.. వేరే ఏదీ లేదని చెప్పొచ్చు. డిసెంబర్ నెలాఖర్లో ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వర్షాభావ పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే.. ఈ సమయమే చాలా మంచిదని అక్కడి వాళ్లు చెబుతుంటారు. 
 
9. క్యూబా (Cuba): మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్‌గా క్యూబా అందరికీ తెలిసిందే. అమెరికా నుంచే కాదు.. ప్రపంచంలో ప్రముఖ ప్రాంతాల నుంచి కూడా విమాన సర్వీసులు ఉంటాయి. విమాన ప్రయాణాలతో కలిసి అక్కడి హోటళ్లు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుంటాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్, జనవరి నుంచి మార్చి నెలల్లో క్యూబా పర్యటనకు రావడం ఉత్తమమట. ఇక్కడ వాతావరణం కూడా ఆ నెలల్లో చూడచక్కగా ఉండి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందట. 
 
10. అరిజోనా, యూఎస్ఏ (Arizona, USA): అమెరికాలో అత్యంత సుందరమైన రాష్ట్రంగా అరిజోనా ప్రసిద్ధిగాంచింది. కొండలు కోనలు, అడవులు.. ఇలా ఏది చూడాలన్నా ఇక్కడ చూడొచ్చు. హోటల్‌లో రూమ్ తీసుకుని ఉండొచ్చు, లేక గంటల ప్రాతిపదికన రూముల్లో కూడా ఉండొచ్చు. గతంలో ఇక్కడ రేట్లు ఆకాశాన్నంటాయి కానీ.. ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకట్టుకునేందుకు రేట్లను భారీ మొత్తంలో తగ్గించేశారు.