అమెరికా ఫంగస్ హైదరాబాద్‌కు

 

బ్లాస్టోమైకోసిస్‌ బారిన పడ్డ యువకుడు
ఇది చాలా అరుదైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌
చదువులకు అమెరికా వెళ్లగా సోకింది
మంచినీళ్లు సైతం తాగలేని స్థితికొచ్చాడు
ఫంగస్ ను గుర్తించిన ‘కిమ్స్‌’ డాక్టర్‌ ఆర్వీ రావు
సరైన చికిత్సతో యువకుడి ప్రాణాలు కాపాడారు
దేశంలో ఇప్పటి దాకా 12 బ్లాస్టోమైకోసిస్‌ కేసులు

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అదో అంతుచిక్కని వ్యాధి. అమెరికాలో ఉండగా వ చ్చింది. అక్కడ చికిత్స అంటే ఆస్తులు అమ్మినా సరిపోవు. హైదరాబాద్‌కు వచ్చి ఆరు నెలల పాటు ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా జబ్బేంటో కనిపెట్టలేదు సరికదా... లేని జబ్బుకు వైద్యం చేశారు, మందులు వాడించారు. ఆ యువకుడు ఒక్కసారిగా 37 కిలోల బరువు తగ్గిపోయాడు.
 
నాలుగడుగులు కూడా వేయలేకపోయాడు. కనీసం మంచినీరైనా తాగలేని పరిస్థితి. ఇక బతకడం కష్టం అనుకున్న తరుణంలో కిమ్స్‌ వైద్యుడు రావేళ్ల వెంకటేశ్వరరావు చికిత్సతో ఆ యువకుడు కోలుకున్నాడు. ఇటువంటి వ్యాధికి మన దేశంలో చికిత్స చేయడం ఇది పన్నెండోసారి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే తొలిసారి.
 
వివరాల్లోకి వెళితే.... హైదరాబాద్‌కు చెందిన నితీష్‌ రెడ్డి మూడేళ్ల క్రితం అమెరికా సంయుక్త రాష్ట్రమైన ఆర్కెన్సెస్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లాడు. కొన్ని నెలల తరువాత ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి, దగ్గు, దాంతోపాటు రక్తం రావడం మొదలైంది. అక్కడే ఓ వైద్యుడికి చూయించుకుంటే చికిత్స చేశారు. కానీ తగ్గలేదు.
 
అతని తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. వెంటనే నితీష్‌రెడ్డి చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళితే నాలుగు నెలల పాటు అన్ని రకాల పరీక్షలు చేసి... టీబీ వచ్చిందని చెప్పి మందులు వాడించారు. అయినా వ్యాధి తగ్గలేదు. లాభం లేదనుకొని మరో కార్పొరేట్‌ ఆస్పత్రి వెళ్లారు. అక్కడ కూడా టీబీ వ్యాధేనని రెండో రకం మందులు వాడించారు.
 
దీంతో నితీష్‌రెడ్డికి జాండిస్‌ వచ్చాయి. మెడపై ఒక కణితిలాగా కనిపించింది. దీంతో సదరు ఆస్పత్రి వైద్యులు ఊపిరితిత్తుల్లో టీబీ, థైరాయిడ్‌ కేన్సర్‌ వచ్చిందని నిర్ధారించి మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. వాళ్లు కూడా థైరాయిడ్‌ కేన్సర్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందని, ఆపరేషన్‌ చేయాలని చెప్పుకొచ్చారు.
 
అప్పటికి నితీష్‌రెడ్డి లేచి నాలుగడుగులు కూడా వేయలేని స్థితి. మంచినీళ్లు తాగాలంటే ఆయాసం. 120 కిలోల బరువుండే నితీష్‌ రెడ్డి 87 కిలోలకు తగ్గిపోయాడు. ప్రాణాలపై నమ్మకం పోయిన అతను రోజులు లెక్కేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ నితీష్‌ అదృష్టం బాగుంది. ఎవరో చెప్పగా కిమ్స్‌ ఆస్పత్రిలోని డాక్టర్‌ రావేళ్ల వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్లారు. నితీష్ కు తొలిసారి తీసిన ఎక్స్‌రే రిపోర్టులు, తన వద్దకు వచ్చే ముందు తీసిన రిపోర్టులను పరిశీలించిన ఆయన ఇది చాలా అరుదుగా వచ్చే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌గా అనుమానించి, అందుకు సంబంధించిన పరీక్షలు రాశారు.
 
ఆ పరీక్షల ఫలితాలు రావాలంటే ఐదు రోజులు పడుతుంది. ఈ క్రమంలో నితీష్ కు వచ్చిన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ బ్లాస్టోమైకోసిస్ గా గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించారు. సరిగ్గా ఐదో రోజుకు నితీష్‌ కోలుకున్నాడు. లేచి... తన పని తాను చేసుకునే స్థితికి వచ్చాడు. ఈలోగా రిపోర్టులూ వచ్చాయి. ఆర్వీ రావు ఊహించనట్టుగానే అది బ్లాస్టోమైకోసిస్‌ అని తేలింది.
 
ఆ తర్వాత మూడు నెలల పాటు నితీష్‌రెడ్డి రోజూ ఆస్పత్రికి వచ్చి ఇంజక్షన్లు చేయించుకొని వెళ్లాడు. ఆ తరువాత 6 నెలల పాటు కేవలం ట్యాబ్లెట్లు వాడాడు. మొత్తం 9 నెలల్లో నితీష్‌ మామూలు మనిషి అయ్యాడు. బ్లాస్టోమైకోసిస్‌ పూర్తిగా తగ్గిందని నిర్ధారించుకున్న తరువాత అతనికి థైరాయిడ్‌ కేన్సర్‌కు ఆపరేషన్‌ చేశారు. అది కూడా పూర్తిగా నయమైంది. ఇప్పుడు నితీష్‌ మళ్లీ అమెరికా వెళ్లి చదువుకుంటున్నాడు.
 
ఏంటీ బ్లాస్టోమైకోసిస్‌?
బ్లాస్టోమైకోసిస్‌ చాలా అరుదైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌. ఇది అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే ఫంగస్‌. ప్రత్యేకించి కెనడా, అరిజోనా, ఓహయో, ఆర్కిన్సెస్ తో పాటు ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని అక్కడ ఉత్తర అమెరికా బ్లాస్టోమైకోసిస్ గా పిలుస్తుంటారు. ప్రత్యేకంగా మట్టి, ఆకులు, కట్టెలతో పాటు వాతావరణంలో ఉంటుందీ ఫంగస్‌. ఇది దుమ్ము ద్వారా మనుషులకు సోకుతుంది. ఇది సోకితే బాగా దగ్గు, దాంతో పాటు ఛాతీలో విపరీతమైన నొప్పి, దగ్గినప్పుడు కొన్నిసార్లు రక్తం పడుతుంటుంది. ఆ తరువాత దాని తీవ్రత పెరిగి ప్రాణాలకే ముప్పు తెస్తుంది.
 
బ్లాస్టోమైకోసి్‌సను గుర్తించకపోతే ఎన్ని రకాల వైద్యం చేసినా బతకడం కష్టం. దీనికి ప్రత్యేకించి ఎటువంటి సర్జరీలు చేయరు. కేవలం కొన్ని రకాల యాంటీ ఫంగల్‌ ఇంజక్షన్లు, మందులతో చికిత్స చేస్తే నయం అవుతుంది.
 
జీవితంపై ఆశలు వదులుకున్నా
అమెరికాలో చదువుతున్నప్పుడు ఛాతీలో నొప్పి, విపరీతమైన దగ్గు వచ్చింది. దగ్గినప్పుడు రక్తం పడేది. అక్కడ లాభం లేదనుకొని హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరిగా. నాలుగు నెలలైనా నా జబ్బేంటో ఏ ఒక్క ఆస్పత్రీ గుర్తించలేదు. లేని జబ్బుకు మందులు వాడించారు. చివరికి కదల్లేని... కనీసం మంచినీళ్లు తాగలేని స్థితికి వచ్చా. ఇక బతకనునుకున్నా. రోజులు లెక్కపెట్టుకున్నా. చివరిగా ఒక్కసారి డాక్టర్‌ ఆర్వీ రావు దగ్గరికి వెళ్లాం.
 
ఎటువంటి శస్త్రచికిత్సలు లేకుండానే ఐదు రోజులు వరుసగా ఇంజెక్షన్లు ఇచ్చి నన్ను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. నిజంగా గ్రేట్‌. అసలు అక్కడ సోకిన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను వెంటనే గుర్తించడం గొప్ప విషయం. ఇండియాలో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న వారిలో నేను 12వ వ్యక్తినని తరువాత తెలిసింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా.
- నితీష్‌ రెడ్డి
 
తెలుగు రాష్ట్రాల్లో మొదటి కేసు
మన దేశంలో బ్లాస్టోమైకోసిస్‌ చికిత్స చాలా అరుదు. జబ్బు సోకిన వాళ్లు కూడా చాలా అరుదు. సమస్యల్లా దాన్ని గుర్తించడమే. అదొక ఫంగస్‌ అని, దానివల్ల ఇటువంటి లక్షణాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. పైగా అమెరికాలో సోకే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ అది. నితీష్‌ రెడ్డికి అది దుమ్ము ద్వారా అది సోకింది.
 
అక్కడి వాతావరణం నితీష్ కు అలవాటు లేదు. దీంతో రోగనిరోధక శక్తి లేకపోవడంతో బ్లాస్టోమైకోసిస్‌ తీవ్రత ఎక్కువైంది. ఇది చాలా అరుదైన ఫంగస్‌. మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి చికిత్స అందించడం ఇదే మొదటిసారి. దేశంలో ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ, చెన్నైలలో దీనికి చికిత్స చేశారు. మాకు అందుతున్న సమాచారం మేరకు బ్లాస్టోమైకోసిస్‌ వ్యాధికి చికిత్స తీసుకున్న వారిలో నితీష్‌ రెడ్డి 12 వ వ్యక్తి.
- డాక్టర్‌ రావేళ్ల వెంకటేశ్వరరావు, అంకాలజీ ఫిజీషియన్‌ (కిమ్స్‌ ఆస్పత్రి)