సౌదీలో తొలగుతున్న ఆంక్షల పరదాలు

మహిళలకు సమాన వ్యాపార అవకాశాలు

రియాధ్, ఆంధ్రజ్యోతి: ‘ఆంక్షల పరదాలు దాటి మహిళలు బయటకు రాలేని సౌదీ అరేబియాలో..నీకు ప్రత్యేకమైన అధికారాలు కావాలా?’ అన్న ప్రశ్నకు రోబో సోఫియా ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘నాకు ప్రత్యేకమైన అధికారాలు, నిబంధనలు అవసరం లేదు. సౌదీ అరేబియా ఇచ్చిన పౌరసత్వ హోదాను ఉపయోగించుకుని మహిళల హక్కులపై మాట్లాడతాను’ అంటూ హైదరాబాద్‌ ప్రపంచ ఐటి సదస్సు వేదిక నుంచి సోఫియా అన్న మాటలు స్ఫూర్తిని కల్గించాయి. నిజానికి సోఫియాకు గత ఏడాది పౌరసత్వం ఇచ్చిన తర్వాత.. సౌదీ అరేబియాలో మహిళా సాధికారతకు వేగంగా అడుగులు పడుతున్నాయి. యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ‘విజన్‌ 2030’లో భాగంగా తీసుకువస్తున్న సంస్కరణలు.. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాయి.
 
కారు నుంచి షికారు వరకూ..
సౌదీ మహిళలు కారు నడపడానికి అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 27న సౌదీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సౌదీలో మహిళా డ్రైవర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివే స్తూ జారీచేసిన ఉత్తర్వులు.. ఈ ఏడాది జూన్‌ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో వేలాదిమంది మహిళలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. అలాగే క్రీడా మైదానాల్లో మహిళలను అనుమతించడం సంచలనం సృష్టించింది. పరదాలు, ఆంక్షలు లేకుండా ఈ ఏడాది జనవరిలో మహిళలు స్వేచ్ఛగా సాకర్‌ మ్యాచ్‌ను వీక్షించారు. పురుష సంరక్షకుడు లేకుండా సౌదీలో మహిళలు గడపదాటలేరు. వివాహం చేసుకోలేరు. విడాకులు తీసుకోలేరు. ఉద్యోగం, ప్రయాణం చివరకు అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలన్నా మొన్నటి వరకూ గార్డియన్‌ తప్పనిసరి! ఇప్పుడిప్పుడే ఈ దేశంలో మార్పు వస్తోంది.
 
పురుషులతో సమానంగా వ్యాపారాలు
ఇంతవరకూ సౌదీలో పురుషుల అనుమతి, అండదండలు లేకుండా మహిళలు అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంది. అయితే తాజాగా సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మహిళలు వ్యాపారవేత్తలుగా ముందడుగు వేయడానికి దోహదం చేస్తుంది. భర్త, తండ్రి లేదా పురుష సంరక్షకుని అనుమతితో సంబంధం లేకుండా.. సౌదీ మహిళలు వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. తగ్గిన చమురు ధరలు, పెరిగిన మిలిటరీ ఖర్చుల నేపథ్యంలో ఇటీవల ఆర్థికంగా సౌదీ అరేబియా దెబ్బతింది.
 
ఆర్థిక సంస్కరణలు చేపట్టడంతోబాటు మహిళా స్వేచ్ఛ ఆవశ్యకతను పాలకులు గుర్తించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలను భాగస్వాములు చేసినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమని అర్థం చేసుకున్నారు. దేశంలోని ఉద్యోగుల్లో 22 శాతం ఉన్న మహిళల భాగస్వామ్యాన్ని.. 2030నాటికి 30శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇటీవల ఓ సౌదీ బ్యాంకుకి మహిళను సీఈవోగా నియమించి ఆశ్చర్యపరిచింది సౌదీ రాజకుటుంబం! అంతేకాదు పురుషుడి అనుమతితోనే గడపదాటాలన్న గార్డియన్‌ వ్యవస్థలో కూడా సవరణలు తెచ్చింది.
 
మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నామనీ, మహిళా సాధికారతకు కట్టుబడివున్నామని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించారు. సౌదీలో రోబో సోఫియాకి పౌరసత్వం ఇచ్చారు పాలకులు. కానీ రోబోకి ఉన్న స్వేచ్ఛ సౌదీ మహిళలకు పూర్తిగా ఉన్నాయా? అన్న విమర్శలకు సంస్కరణలతో సమాధానమిస్తున్నారు యువరాజు సల్మాన్‌!
 
పెరుగుతున్న విడాకుల పార్టీలు
6 నెలలుగా సౌదీ మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు పార్టీలు చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. గతంలో విడాకులు పొందిన మహిళలను సమాజం చిన్నచూపు చూసేది. కానీ ఇప్పుడు కాలం మారింది. విడాకులు తీసుకున్న మహిళలు తల పైకెత్తి బతుకుతున్నారు. నచ్చినవారిని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. వైవాహిక జీవితంలో పడ్డ ఇబ్బందుల నుంచి విముక్తి లభించినందుకు.. చాలామంది పార్టీలు చేసుకుంటున్నారు. అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మహిళలు ఆ పార్టీలకు హాజరై తమ బాధలు పంచుకుంటున్నారు.
 
ప్రిన్స్‌ సల్మాన్‌ విప్లవాత్మక సంస్కరణలు
యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేతృత్వంలో సౌదీ అరేబియాలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం చమురు ఎగుమతులపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడకుండా..దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అవినీతి ఆరోపణలపై రాజ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అరెస్టు చేయించిన యువరాజు సల్మాన్‌..ఏ స్థాయిలోనూ అక్రమాలను క్షమించమని సంకేతాలిచ్చారు. అదే సమయంలో 500 బిలియన్‌ డాలర్లతో ఎకనామిక్‌ జోన్స్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. పెట్టుబడులకు సౌదీ అరేబియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆహ్వానం పలికారు.
 
పురుషులతో సమానంగా వ్యాపారాలు
ఇంతవరకూ సౌదీలో పురుషుల అనుమతి, అండదండలు లేకుండా మహిళలు అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంది. అయితే తాజాగా సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మహిళలు వ్యాపారవేత్తలుగా ముందడుగు వేయడానికి దోహదం చేస్తుంది. భర్త, తండ్రి లేదా పురుష సంరక్షకుని అనుమతితో సంబంధం లేకుండా.. సౌదీ మహిళలు వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ‘గార్డియన్‌ అనుమతి అక్కర్లేదు. సౌదీ మహిళలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు. పురుషులతో సమానంగా వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, పనిచేయడానికి అనుమతిస్తున్నాం’ అని సౌదీ వాణిజ్య, పెట్టుబడుల శాఖ ట్వీట్‌ చేసింది.
 
మంత్రివర్గంలోనూ...
కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రిగా ఓ మహిళను సౌదీ రాజు నియమించారు. పని ప్రదేశాల్లో మహిళల పాత్రను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలపై పలు ఆంక్షలు విధించే సౌదీ ప్రభుత్వం.. సైన్యంలోనూ మహిళలు చేరేందుకు ఇటీవల అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.