మీరిస్తామన్నా మేమొద్దంటాం!

వారసత్వ ఆస్తులపై యువత కొత్త వైఖరి

సొంతంగా ఎదగాలనే ఆకాంక్షలు, కలలు..

విదేశాల్లో స్థిరపడటంపైనే మొగ్గు

తిరిగి రావాలనే ఆలోచనలకు స్వస్తి.. 

ఇక ఆస్తులు ఏం చేసుకుంటామనే ప్రశ్న
సత్యం ఒక వ్యాపారవేత్త. ముప్పై నలభై ఏళ్లు కష్టపడి... సుమారు 50 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారు. ఆయన ఏకైక సంతానం సిరి. బీటెక్‌ పూర్తి చేసి మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లింది. సొంతకాళ్లపై బతకాలన్నది ఆమె స్వప్నం. ఎంఎస్‌ పూర్తి చేసి, మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగం సంపాదించింది. ఇండియా తిరిగొచ్చేందుకు సిరి ససేమిరా అంది. తండ్రి వ్యాపారం, ఆస్తుల కంటే తన స్వేచ్ఛ, సొంతంగా ఎదిగాననే సంతృప్తి ముఖ్యమని తేల్చిచెప్పింది. అంత ఆస్తిని కూతురు గడ్డిపోచతో సమానంగా తీసేయడంతో సత్యం తన వ్యాపారాల మీద ధ్యాస తగ్గించి, వారానికో దేశం విహారయాత్రకు వెళుతున్నారు!
 
రాజారావు ఓ బ్యాంకు ఉద్యోగి. ఆయన కుమారుడు మంచి బహుళ జాతి సంస్థలో ఉద్యోగానికి కుదిరాడు. అతని మొదటి నెల జీతం... ఆయన తండ్రి 35 ఏళ్ల సర్వీసు తర్వాత తీసుకున్న చివరి జీతం కంటే ఎక్కువ! ఆస్తులు, పొదుపు, ఖర్చులపై రాజారావు ఆలోచనలకూ, ఆయన కుమారుడి వైఖరికీ ఎక్కడా పొంతన కుదరదు!
 
‘శ్రీమంతుడు’ సినిమాలో హీరో తన తండ్రితో మాట్లాడుతూ... ‘‘మీ నాన్నగారు చేసిన వ్యవసాయాన్ని మీరెందుకు చేయలేదు! ఆయన్ని కాదని మీరు ఇంతటివారయ్యారు. నన్ను కూడా నాకు తోచింది చేయనివ్వండి’’ అంటాడు. అచ్చం ఇలాంటి డైలాగులే అని కాదుకానీ... ఈ తరహా మాటలు చాలా ఇళ్లలో వినిపిస్తున్నాయి. ‘‘నాన్నా... మీరు సంపాదించినంత సంపాదించారు. నాకు అదంతా అక్కర్లేదు. నేను నా బాటలో నడుస్తాను’’ అని చెబుతున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. తల్లిదండ్రుల మార్గానికి భిన్నంగా పిల్లలు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారసత్వంగా వచ్చి పడే ఆస్తులు, పేరు ప్రతిష్ఠలకంటే... నాకున్న నైపుణ్యాలు ఏమిటి? వాటిని పదును పెట్టుకుని, స్వశక్తితో జీవితంలో ఎలా సమున్నత శిఖరాలు చేరుకోవాలనే దానిపైనే వారి ధ్యాస! ఆ క్రమంలో తల్లిదండ్రులు, వాళ్లు తమ గురించి కన్న కలలను యువత పట్టించుకోవడం లేదు. కారణం... పేరెంట్స్‌ కంటే మంచి కలలు కనడం ఈ తరం యువతకు బాగా తెలుసు. తమను కన్నవారి కలలను సాకారం చేయడం కంటే తమ కలలను సాకారం చేసుకోవడంలో నిజమైన కిక్‌ దొరుకుతుందంటోంది నవతరం.
 
రివర్స్‌ ట్రెండ్‌...
అమెరికా నుంచి పిల్లలు డబ్బులు పంపించడం... ఇక్కడ వారి తల్లిదండ్రులు, అత్తమామలు ఇల్లు, ఫ్లాట్లు, ప్లాట్లు కొని పెట్టడం! ఈ ‘ఇన్వె్‌స్టమెంట్‌ ప్లాన్‌’లు ఇప్పుడు ఆగిపోయాయి. విజయవాడలో, హైదరాబాద్‌లో విపరీతంగా ‘ఎన్‌ఆర్‌ఐ కొనుగోళ్ల’ జోరు బాగా తగ్గింది. ‘‘మనం ఎలాగూ స్వదేశానికి వెళ్లేది లేదు. చుట్టపుచూపుగా తప్పితే సొంత ఊరికీ వెళ్లం. అక్కడ ఆస్తులు కొనుక్కుని ఏం చేస్తాం’’ అనేది వారి వాదన! అమెరికాలో ఉండటానికి ‘ఒక ఇల్లు’ చాలు అనుకునే మనవాళ్లు... మూడు నాలుగు కూడా కొంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే... ‘రివర్స్‌’లో ఇక్కడి ఆస్తులను విక్రయించి, ఆ డబ్బును తామున్న చోటికే తరలించే ట్రెండ్‌ కూడా మొదలైంది. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులనూ తమ దగ్గరికే పిలిపించుకునే వారు ఈ పని చేస్తున్నారు. ఉన్న ఊరు వదిలి వెళ్లడానికి ఇష్టపడని పెద్దలు... ‘మా తరం ఇలా గడవనివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం’ అంటూ తాము ఒక్కో ఇటుక పెట్టి కట్టుకున్న ఇళ్లను విక్రయించడానికి నిరాకరిస్తున్నారు.
 
వచ్చేదా... చేసేదా!

మన ఇల్లు, మన పొలం, మన ఊరు, మన ఆస్తి... ఇలాంటి భావన మెల్లమెల్లగా తగ్గుతోంది. ‘ఎక్కడ అవకాశాలు ఉంటే... అదే మన ఊరు’ అనేదే నేటి మంత్రం. మరీ ముఖ్యంగా... అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లిన మనవాళ్లలో ఎక్కువ మంది, అక్కడి నుంచి తిరిగి రావడానికి ఇష్టపడటంలేదు. తక్కువ కాలుష్యం, ఎక్కువ వేతనాలు, ‘పెద్దల నియంత్రణ’లేని స్వేచ్ఛ, లగ్జరీ జీవితం... కారణం ఏదైతేనేం, చదువుల కోసమంటూ విదేశాలకు వెళ్లిన వాళ్లు అక్కడే స్థిరపడుతున్నారు. కష్టపడే తత్వం, తెలివితేటల కారణంగా త్వరత్వరగా ఎదుగుతున్నారు. కెరీర్‌లో ఓ స్థాయిదాకా వెళ్లిన వారు అక్కడ ఉద్యోగం వదులుకుని, భారత్‌కు వచ్చి మళ్లీ తమ స్థాయికి తగిన కొలువులు వెతుక్కోవడం వారికి కష్టమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో... సొంత ఊరితోపాటు, అక్కడున్న వారసత్వపు ఆస్తులపైనా వారికి పట్టింపు తగ్గుతోంది. సొంత ఊళ్లోనే ఉన్న తన అన్నకో, తమ్ముడికో ఆస్తులను వదిలేస్తున్నారు. లేదా... వాటి గురించే పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎప్పుడైనా తల్లిదండ్రులు ప్రస్తావించినా... ‘తర్వాత చూద్దాంలే నాన్నా! అనేస్తున్నారు. తల్లిదండ్రులు 30, 40 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను... తాము నాలుగైదేళ్లలో సంపాదిస్తుండటంతో వారసత్వ ఆస్తుల పట్ల వీరి ఆపేక్ష తగ్గుతోంది. మరోవైపు... కొన్ని దేశాల్లో వారసత్వంగా వచ్చే ఆస్తులపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ పౌరసత్వం ఉన్న వారు తమ స్వదేశంలో వచ్చిన ఆస్తులను విక్రయించుకోగా వచ్చిన డబ్బులపైనా ట్యాక్స్‌ కట్టాల్సిందే. ఆస్తుల గురించి పట్టించుకోకపోవడానికి ఇదీ ఒక కారణం.

విశ్వజనీన దృక్పథం

ఈ తరం యువతలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ ఉద్యోగంలో అయినా మేం నెగ్గుకురాగలం, మా జీవితాల్ని మేం అందంగా తీర్చిదిద్దుకోగలం అనే విశ్వాసం వారి సొంతం. వృత్తివిద్యా కోర్సులు చేసినవారు, చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన యువత ఆలోచనలకు ఆకాశమే హద్దు. ముందుతరం వాళ్ల ఆలోచనలకు పరిమితులు ఉండేవి. అవకాశాలూ పరిమితంగా ఉండేవి. ఈ తరం వారి ముందు ఎన్నో అవకాశాలు పరుచుకున్నాయి. నైపుణ్యం వున్న యువతీ యువకులు తల్లిదండ్రులు దశాబ్దాల తరబడి ఆర్జించిన ఆస్తిని రెండు మూడేళ్లలో సంపాదించేస్తున్నారు. అందుకే తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మాకొద్దు. మంచి చదువులు చెప్పిస్తే చాలని యువత కరాఖండిగా చెబుతోంది.
 
 ప్రొఫెసర్‌ సీహెచ్‌. గణేశ్‌, సోషియాలజీ విభాగం అధిపతి, ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్‌
మంచిపనికి...
కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులనే కాదు... తల్లిదండ్రులనూ పట్టించుకోని వారూ ఉన్నారు. రెక్కలురాగానే విదేశాలకు ఎగిరిపోయిన వారు... సొంత ఊళ్లో ఉన్న కన్నవారితో మనసు విప్పి మాట్లాడే తీరిక లేనంతగా జీవితాలను బిజీ చేసుకుంటున్నారు. ‘మీరు సంపాదించిన ఆస్తులు మీకే వదిలేస్తున్నాం. శేష జీవితాన్ని హాయిగా గడపండి’... అని ‘త్యాగం’ ప్రదర్శిస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల్లోనూ క్రమంగా ఆస్తిపాస్తులంటే వైరాగ్య భావన పెరుగుతోంది. పిల్లల కోసం కూడబెట్టే కంటే ఆద్యంతం ఆస్వాదించడం మేలనే ఆలోచన నిన్నటి తరం వారిలో నెమ్మదిగా స్థిరపడుతోంది. కూడబెట్టిన ఆస్తిపాస్తులను అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, సేవా సంస్థలకు రాసి ఇచ్చేవారి సంఖ్యా పెరుగుతోంది.
 
పట్టించుకోండి ప్లీజ్‌...
1997లో అమెరికాలో స్థిరపడ్డ రితురాజ్‌ సహానీ అనే వ్యక్తి ఇటీవల భారతదేశానికి వచ్చాడు. తల్లి ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి కాలింగ్‌ బెల్‌ కొడితే తీయలేదు. మారు తాళంతో తలుపులు తీయించి లోపలికి వెళ్లేసరికి.. ఎన్ని వారాల కింద చనిపోయిందో అతడి తల్లి.. ఎముకల పోగు మాత్రమే ఇంట్లో మిగిలుంది! నాలుగు నెలలపాటు తల్లితో ఫోన్‌లో కూడా మాట్లాడలేనంత బిజీ ఏముందోగానీ.. తల్లి పోయిన విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాడా కొడుకు. ఇలా ఒంటరిగా రాలిపోతున్న పండుటాకుల సంఖ్యా ఇటీవలికాలంలో పెరుగుతోంది.
అక్కడే బాగుందని...
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడికి ఆస్తమా! నగరంలో ఉన్నన్ని రోజులు జేబులో ఇన్‌హేలర్‌ పెట్టుకుని తిరిగేవాడు. అదే యువకుడు ఉద్యోగం కోసం ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లాడు. అలవాటు ప్రకారం ఇన్‌హేలర్‌ను జేబులో పెట్టుకునే తిరిగాడు. కానీ... ఇప్పటిదాకా ఒక్కసారంటే ఒక్కసారి కూడా అది వాడాల్సిన అవసరం రాలేదు. దీంతో... కొన్నాళ్ల తర్వాత తిరిగి స్వదేశం రావాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాడు. ఇలాంటి వాళ్లలో ఎంతోమంది వారసత్వ ఆస్తులపై ఆపేక్ష వదులుకుంటున్నారు.