తేడాల్లేవ్‌.. మేము ఒక్కటే!

అమెరికా... ప్రవాసులు తమ కలలు నెరవేర్చుకోవడానికి పరుగు పరుగున పయనమయ్యే దేశం. కానీ అక్కడ జరిగే జాత్యహంకార దాడులు.. ప్రాంతీయ విద్వేష హత్యలు సగటు మానవులను భయకంపితులను చేస్తున్నాయి. మనుషులంతా ఒకటే కదా.. రంగు తేడాగా ఉంటే ఏం? చూడు మేమిద్దరం ఒకేలా ఉన్నాం అంటూ ఓ అమెరికా చిన్నోడు పెద్దోళ్లను ప్రశ్నిస్తున్నాడు. 
 
భారతదేశమే కాదు.. ప్రవాసులంతా అమెరికాలో జరుగుతున్న జాతి విద్వేష దాడులకు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల ఓ అమెరికా బాలుడు చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ అందర్నీ ఆలోచింపజేస్తుంది.
 
ఆ పోస్ట్‌లో ఏముందంటే.. 
జాక్స్‌ అనే బాలుడు అమెరికాలోని కెంటకీలో ఉంటున్నాడు. చూడటానికి భలే ముద్దుగా ఉంటాడు. స్పైక్స్‌ (ఇదో రకం తలకట్టు) హెయిర్‌కట్‌తో పోజులు కొడతాడు. శ్వేతవర్ణంలో మెరిసిపోయే ఆ బాలుడికి ఆఫ్రికాకు చెందిన రెడీ గిగిల్‌ (నల్లజాతీయుడు) అనే స్నేహితుడు అంటే చాలా ఇష్టం. ఇద్దరూ ఒకే స్కూల్‌లో కలిసి చదువుకుంటున్నారు. అమెరికాలోని జాతి విద్వేషాల దాడుల గురించి తెలుసుకున్న ఆ బాలుడు తన స్నేహితుడికి మద్దతుగా ఉండాలనుకున్నాడు. అనుకున్న వెంటనే.. తల్లి వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. అచ్చు తన స్నేహితుడు రెడీ గిగిల్‌లా కటింగ్‌ చేయించుకున్నాడు. హెయిర్‌కట్‌ చేయించుకున్న జాక్స్‌ను ఉపాధ్యాయులు, చుట్టు పక్కలవాళ్లు...అందరూ ‘అలా ఎందుకు చేయించుకున్నావు’ అని ప్రశ్నించారు. వెంటనే ఆ బాలుడు రెడీ గిగిల్‌ను చూపిస్తూ.. ‘ఇపుడు మేమిద్దరం ఒకేలా ఉన్నాం కదా.. మా మధ్య ఎలాంటి తేడా లేదు కదా...’అన్నాడు. ఆ సమాధానం విన్న అందరూ ఆశ్చర్యపోతుంటే.. గిగిల్‌ తన ప్రాణమిత్రుడ్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు ‘జాక్స్‌ అంటే నేనే.. ఐ యామ్‌ జాక్స్‌.. మేమిద్దరం ఒకటే’ అంటూ గిగిల్‌ చెబుతాడు.
 
ఇదంతా జాక్స్‌ తల్లి వీడియో తీసింది. జాక్స్‌ కోరికపై ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. నెట్‌లో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. జాతి విద్వేష దాడులను వ్యతిరేకించే వారంతా ఆ చిన్నోడిని ప్రశంసిస్తున్నారు. ఆ బాబును చూసి అందరూ బుద్ధి తెచ్చుకోవాలని, ఇకనైనా ఇలాంటి దాడులను మానుకోవాలనే కామెంట్స్‌ చేస్తున్నారు కొందరు. 
 
‘జాక్స్‌ తనకి, తన స్నేహితుడికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా తలకట్టు అనే భావించాడు. ఇద్దరి తలకట్టు ఒకేలా ఉంటే వాళ్లిద్దరూ ఒకటే కదా... తేడా ఏముందని అనుకున్నాడు. అంతేతప్ప శరీరం రంగు తెలుపా, నలుపా అనే ఆలోచన లేదు వాడి మనసులో. అలాగే సమాజంలో ఉన్న జాతి విరోధం, విద్వేషం వంటి వాటి గురించి ఆ పసిమనసుకి తెలియదు. పెద్దవాళ్లు కూడా ఆ ఆలోచన కోల్పోతున్నారు. ఆ పిల్లల్లా మనమూ ఆలోచించగలిగితే అందరం ప్రేమగా బతుకొచ్చు’ అని జాక్స్‌ తల్లి లిడియా ఆ పోస్ట్‌కు కామెంట్‌ పెట్టింది.