హెచ్-1బీ/ 457 మనకు మంచిదే

వీసా నిబంధనలు కఠినతరంపై నిపుణులు

స్వల్పకాలంలో ఇబ్బందులున్నా.. దీర్ఘకాలంలో మేలే...
నగరం నుంచి 87 వేల కోట్ల రూపాయల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు
ప్రత్యక్ష్యంగా 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు.. పరోక్షంగా మరో  8 లక్షల మంది
భయపడాల్సిన పనిలేదంటున్న నిపుణులు
ప్రతిభావంతులు మాత్రమే మిగులుతారంటున్న ఎనలిస్ట్‌లు
 
యూఎస్‌ హెచ్‌1 బీ వీసా నిబంధలను కఠినతరం చేయడం.. ఆస్ట్రేలియా సైతం తమ 457 వీసా (తాత్కాలిక వర్క్‌ పర్మిట్‌ వీసా) తొలగించి దాని స్థానంలో మరో రెండు కొత్త వీసాలు ప్రవేశపెడతామని అంటుండడం.. న్యూజిలాండ్‌ కూడా తమ ఇమ్మిగ్రేషన్‌ విధానాలను సమీక్షించుకోబోతోందని వార్తలు వస్తుండడంతో ఐటీ కంపెనీలలో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఏమైపోతాయోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంత ఆందోళన అవసరమా? నిపుణులు ఏమంటున్నారు..? అనే అంశాలపై విశ్లేషణాత్మక కథనం.
 
ఒక్కొక్కటిగా పలు దేశాలు నిబంధనలను కఠినం చేస్తుండటంతో తమ ప్రణాళికలను పునః సమీక్షించుకునే పనిలో పడ్డాయి నగర ఐటీ కంపెనీలు. దీనికి తోడు ఆటోమేషన్‌, ఐఓటీ విజృంభించే కొద్దీ ఐటీ రంగంలో ఉద్యోగులకు కోత తప్పదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదని, ప్రతిభావంతులకు వచ్చిన నష్టమేమీ లేదని ఐటీ రంగం నిపుణులు చెబుతున్నారు.స్వల్పంగా ఇబ్బంది ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం భారతీయ ఐటీ కంపెనీలకు మేలు జరుగుతుందనే అంటున్నారు వారు.
 
హైదరాబాద్‌ ఐటీకి అశనిపాతం..?
యూఎస్‌, ఆస్ట్రేలియా రెండూ స్థానికులకు అవకాశాలను అందించడమే ధ్యేయంగానిబంధనలు తీసుకొచ్చాయి. ఆ దేశాల మీద ఆధారపడ్డ భారత ఐటీ కంపెనీ ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావమే చూపుతుందన్నది హైదరాబాద్‌ ఐటీ రంగ నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్‌లో దాదాపు 5 వేలకు పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయని అంచనా. భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 110 బిలియన్‌ డాలర్లుగా ఉంటే ఒక్క హైదరాబాద్‌ నుంచి 87 వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ, ఐటీఈఎస్‌ పరంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యక్షంగా 4 లక్షల ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటే పరోక్షంలో మరో 7-8 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని అంచనా. అమెరికా వీసా ప్రక్రియను కఠినం చేయడంతో పాటుగా స్థానికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే రీతిలో తమ నిబంధలను తీసుకురావడంతో నగరంలోని ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావమే పడింది. మరీ ముఖ్యంగా నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలలో అధిక శాతం ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలే కావడం వల్ల అమెరికా నిబంధనలు కొన్ని కంపెనీలకు కోలుకోలేని దెబ్బనే తీశాయి. నాస్కామ్‌ సైతం ఇదే అంచనా వేస్తోంది. నిజానికి 20 శాతం వృద్ధి ఉంటుందని ముందు ఊహించినా.. 2016-17 సంవత్సరానికిగానూ అది 12 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇప్పుడు 10-11 శాతానికి పరిమితం కావొచ్చని నగర ఐటీ రంగ ప్రముఖులు చెబుతున్నారు. ఇదే విషయమై హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు రంగ పోతుల మాట్లాడుతూ ‘ప్రస్తుతానికి హెచ్‌1 బీ వీసాల మీద ఎక్కువ మంది ఉద్యోగులను పంపుతున్న కంపెనీలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. మిగిలిన వారిపై ప్రభావం తక్కువే.’ అన్నారు.
 
ఔట్‌ సోర్సింగ్‌ ద్వారానే...
ఔట్‌ సోర్సింగ్‌ పరిశ్రమ ప్రధానంగా యూఎస్‌ లాంటి చోట్ల తమ ఖాతాదారులకు సేవలను అందించడంపైనే ఆధారపడి ఉంది. ఇక్కడ ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుని సాఫ్ట్‌వేర్‌ రూపొందించడంతో పాటుగా ఆన్‌సైట్‌లో కొద్ది మంది ఉద్యోగులను నియమించి తాము నిర్మించిన సాఫ్ట్‌వేర్‌, సిస్టమ్స్‌ను పనిచేసేలా చేస్తుంటారు. అలాంటి ఉద్యోగాల కోసం వెళ్లేవారి హెచ్‌1 బీ వీసాలను నియంత్రించడంతో పాటుగా, ఔట్‌ సోర్సింగ్‌ చేసే కంపెనీలకు అడ్డుకట్ట వేయాలన్నది యూఎస్‌ భావన. ఆస్ట్రేలియా సైతం స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ నిబంధనలతోతమదేశానికి వచ్చే వారిపై నియంత్రణ విధించాలని భావిస్తోంది. ఇప్పటికే యుఎస్‌ నిబంధనల కారణంగా ఇండియన్‌ ఔట్‌సోర్సింగ్‌ ఇండస్ట్రీ రెండు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇమ్మీగ్రేషన్‌ అధికారులు ఇటీవలి కాలంలో వీసాలను రిజెక్ట్‌ చేయడం పెరిగింది. దానితో పలు కంపెనీల కస్టమర్‌ సర్వీస్‌ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ఒకవేళ వీసా వచ్చినా పెంచిన వీసా ఫీజులు, మినిమం వేజ్‌ గ్యారెంటీ వంటివి కంపెనీలకు తలకు మించిన భారం అవుతున్నాయని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. ఇక రెండోది తప్పనిసరిగా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి రావడం. ఇప్పటికే ఇండియన్‌ ఔట్‌ సోర్సింగ్‌ వ్యాపారాన్ని ఆటోమేషన్‌ తినేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనితో కంపెనీలు అధిక విలువ కలిగిన లక్ష్యాల వైపు తమ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. ఇది గుర్తెరిగి ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలు తమ వ్యాపారాన్ని మార్చుకుంటున్నాయి. ఇప్పటికే టెక్‌ మహీంద్రా లాంటి కంపెనీలు ఆటోమేషన్‌, సాఫ్ట్‌వేర్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ ఉపయోగించుకుని నాన్‌లీనియర్‌ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.  నిజానికి మన ఔట్‌ సోర్సింగ్‌ పరిశ్రమకు స్వల్పకాలంలో ఇది నష్టం కలిగించినా మున్ముందు మంచే జరుగుతుందని అంటున్నారు సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణుడు వివేక్‌వర్మ. ఇండియా సాఫ్ట్‌ చైర్మన్‌ నళిన్‌ కోహ్లీ అయితే యూఎస్‌, యూరోప్‌ లాంటి సంప్రదాయ మార్కెట్‌లపై ఆధారపడటం తగ్గించి లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌, జపాన్‌, చైనా, దక్షిణ కొరియాలాంటి మార్కెట్‌లలో కూడా అవకాశాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.
 
ప్రభావం ఎంతనేది చెప్పడం కష్టం..
యూఎస్‌లాంటి దేశాలలో తీసుకునే నిర్ణయాలు మన ఐటీ రంగంపై ప్రభావం కచ్చితంగా చూపుతాయి. హెచ్‌1బీ వీసాల మీద నిపుణులను పంపడం తగ్గింది. అక్కడి కంపెనీలకు ఇక్కడి నుంచే ప్రొడక్ట్‌ ఇన్‌స్టాలేషన్‌ చేయడంతో పాటుగా ఇతర సేవలను అందిస్తున్నాం. ఆ ప్రభావం ఇప్పుడు తగ్గుతుంది. యూఎస్‌ తర్వాత యూరోప్‌ మనకు అతిపెద్ద మార్కెట్‌. ఇప్పటికే చాలామంది అక్కడ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మార్కెట్‌ పెరుగుతుంది కాబట్టి అవకాశాల పరంగా అందిపుచ్చుకుంటామనే అనుకుంటున్నాం.
- రంగ పోతుల, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు
 
 
నష్టపోతాం కానీ.. 
అమెరికా, ఆస్ట్రేలియాలలో జరుగుతున్న పరిణామాలు వల్ల షార్ట్‌ టర్మ్‌లో నగరం భారీగా నష్టపోయినా లాంగ్‌ టర్మ్‌లో మనకు మేలే అనుకుంటున్నాం. నగరంలో దాదాపు 80 శాతం కంపెనీలు ఔట్‌ సోర్సింగ్‌ మీదనే ఆధారపడి పనిచేస్తున్నాయి. వీటిలోనూ టెక్నాలజీ లేదా ట్రాన్‌శాక్షన్‌ తరహా ఔట్‌ సోర్సింగ్‌ ఎక్కువ. ఆర్థికంగా పడే నష్టంతో పాటుగా ఉపాధి అవకాశాల పరంగా యువతరం నష్టపోయే అవకాశాలు అధికంగానే ఉంటాయి. ఈ నష్టం తాత్కాలికంగా ఉంటుందని భావిస్తున్నా..! దీర్ఘకాలంలో మన కంపెనీలకు కొంత ప్రయోజనం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎలాగంటే.. బేసిక్‌ వర్క్‌ చేస్తున్న కంపెనీలు ఇకపై వాల్యూ ఛేంజ్‌ కోసం ప్రయత్నిస్తాయి. అమెరికన్‌ కంపెనీలు ఇచ్చే అవకాశాల కోసం కాకుండా ఇతర దేశాలలోనూ అవకాశాల కోసం చూస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌ కోసం వెదుకుతాయి. ఆ పరిష్కారాలను కనుగొనగలిగిన కంపెనీలు మనగలుగుతాయి. మెషీన్‌ లెర్నింగ్‌, ఆటోమేషన్‌లాంటివి.
- వివేక్‌ వర్మ, ఇన్వెస్టర్‌
 
 
మనకు ప్రయోజనమే..!
ఎల్‌1 పై వెళ్లి హెచ్‌1 పని చేయడం లాంటివి మనోళ్లు చాలా తప్పులు చేశారు. వీటికి ఇప్పుడు అడ్డుకట్ట పడుతోంది. మనం ఈ నిబంధనలను పాజిటివ్‌గా చూడాలి. ఆటో కంపెనీలకు ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలతో పోటీ వచ్చింది. అది ఓ విధంగా లాభమే. యూఎస్‌, ఆస్ట్రేలియా లాంటి దేశాలు తీసుకున్న నిర్ణయం మనపై మూడు విధాలుగా ప్రభావం పడుతుంది. నగరానికి చెందిన టాలెంటెడ్‌ యూఎస్‌ వెళ్లిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ వీసా నిబంధనల కారణంగా అది ఆగిపోతుంది. లాంగ్‌ టర్మ్‌లో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఆర్‌ అండ్‌ డీ పెరుగుతుంది. ఐటీలో పండిపోయిన వాళ్లే మిగులుతారు. 
- డాక్టర్‌ బీ ఏ ఎన్‌ ధర్మ, సీఈవో,
 క్లియర్‌ మెజర్‌మెంట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌