Village-turned-to-costliest-because-Kuwait

3 దశాబ్దాల క్రితం వలస సీమ.. ఇప్పుడదే వలస జీవుల స్వర్గం

గల్ఫ్‌లో పోగేసిన సంపదలతో సిరులద్దుకొన్న పట్టణం

అందమైన మేడల వరుసలు.. విలాసవంతమైన జీవన సరళి
3 దశాబ్దాల క్రితం వలస సీమ.. ఇప్పుడదే వలస జీవుల స్వర్గం
 
కడప జిల్లా రాజంపేట డివిజన్‌ నగరిపాడుకి చెందిన శ్రీధర్‌రెడ్డికి 30 ఏళ్ల క్రితం తినడానికి తిండి లేదు. ఇల్లు గడవడం కష్టమయి, తన కుటుంబంతో కువైత్‌ వెళ్లాడు. అక్కడ అనేక పనులు చేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. అక్కడ సంపాదించిన డబ్బులతో నగరిపాడు తిరిగొచ్చి, పొలాలు, స్థలాలు కొనేశాడు. బిల్డింగులు కట్టేశాడు. ఇప్పుడు నగరిపాడులో శ్రీధర్‌రెడ్డి ఓ భూస్వామి లెక్క గౌరవం పొందుతున్నాడు. శ్రీధర్‌రెడ్డిలాగే, కువైత్‌కు పోయి సిరిమంతులుగా తిరిగొచ్చినవారు రాజంపేట డివిజన్‌లో చాలామందే కనిపిస్తున్నారు. రాజంపేటలో ఇప్పుడు ఎటుచూసినా విలాసవంతమైన భవంతులు, నగ నాగరిక జీవన సంస్కృతులే కనిపిస్తున్నాయి. ఒకనాడు కూలి పనుల కోసం రాజంపేటవాసులు దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అలాంటిది ఇప్పుడు రాజంపేటలో బతకడానికి వేరే ప్రాంతాల నుంచి వలస వస్తుండటం గమనార్హం. ఇంత మార్పు ఎలా సాధ్యం అయింది? ‘‘మా లాంటి పేదలకు కువైత్‌ కూడు మాత్రమే పెట్టలేదు. కోటేశ్వరులను చేసి పంపింది’’...అనేది శ్రీధర్‌రెడ్డి సమాధానం!
 
ఇంటికొకరు..: రాజంపేట డివిజన్‌ పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన లక్షమందికి పైగా కువైత్‌లో స్థిరపడ్డారు. దీనివల్లనే రాజంపేటకు మరో కువైత్‌ అనే పేరు వచ్చింది. ఈ డివిజన్‌లో ప్రతి ఇంటికి ఒకరికి మించి కువైత్‌లో ఉన్నారు. కరువు, చుక్క నీరులేని చెరువులు పారని కాలువలతో వలసపోవడం వీరికి తప్పనిసరైంది. ఓబిలి, అప్పారాజుపేట, నాయుడువారిపల్లె లాంటి కొన్ని గ్రామాలకు గ్రామాలు కువైత్‌కు వలస పోయాయి. ముందు ఇంట్లో మగవాళ్లు వెళ్లారు. కారు డ్రైవర్లు, నిర్మాణ కూలీలు, గొర్రెల కాపరులు, దర్జీలు, సెక్యూరిటీ గార్డులుగా చేరిపోయారు. తర్వాత తమ భార్యాపిల్లలను తీసుకెళ్లారు. సేఠ్‌ల ఇళ్లలో వంట మనుషులుగా, మంచంలో పడ్డ వారికి సేవలు చేసే ఆయాలుగా, నిర్మాణ కూలీలుగా వారిని చేర్చారు. కువైత్‌లో ఏ పని చేసినా నెలకు రూ. 30 వేల నుంచి లక్ష రూపాయలు తేలిగ్గా సంపాదించొచ్చునని చెబుతున్నారు. భర్త, భార్య పని చేసే కుటుంబాలు ఎంత లేదన్నా నెలకు రూ.1.50 లక్షలు దాకా సంపాదిస్తాయి. అక్కడి జీవన వ్యయాలతో పోల్చితే, ఆ డబ్బులు బొటాబొటీగా సరిపోతాయి. కానీ, కడుపు గట్టుకొని పొదుపు చేసుకొన్న వారు మాత్రం.. క్రమక్రమంగా సంపదను చూడటం మొదలుపెట్టారు. తాము పోగుచేసిన డబ్బులను చాలామంది రాజంపేటలోని తమ బంధువులకు పంపించి, స్థానికంగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కువైత్‌ నుంచి వచ్చిపడుతున్న కోట్లాది రూపాయల డబ్బు రాజంపేట కథను మార్చివేసింది.
 
కొత్త కోక కట్టిన తాళ్లపాక
సిరిలో కువైత్‌ను తలపిస్తున్న రాజంపేట ప్రాంతం, విలాసాల్లో సింగపూర్‌ను గుర్తుకు తెస్తోంది. ఈ మండలంలోని తాళ్లపాక గ్రామం అన్నమయ్య జన్మస్థలిగా ప్రసిద్ధి. అంతకుమించి ఈ ప్రాంతం గురించి చెప్పుడానికి ఏమీ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు అడుగడుగునా అందమైన భవంతుల వరుసలతో తాళ్లపాక కొత్త సొబగులను అద్దుకొంటోంది. పట్టణాలను తలదన్నే రీతిలో ప్రతి గ్రామంలో ఖరీదైన భవనాలు వెలుస్తున్నాయి. జీవన ప్రమాణాలూ మెరుగుపడటం, కొత్త భవన నిర్మాణం పట్ల ఆసక్తి పెరగడం వంటి కారణాలతో రాజంపేటలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోతోంది. సెంటు స్థలం రూ. 6 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, బద్వేల్‌ వంటి పట్టణాల్లో సైతం రాష్ట్ర రాజధాని అమరావతిని తలదన్నేలా భూమి రేట్లు ఉన్నాయి. రాజంపేటలో పదేళ్లుగా భూమి రేట్లలో పెరుగుదలే గానీ, పతనం కనిపించడం లేదని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఒకరు తెలిపారు.