అమెరికాను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోతానంటున్న ఓ భారతీయ మహిళ చెప్పిన నిజాలివి

వాషింగ్టన్:‘అమెరికా.. అమెరికా.. అమెరికా.. అందమైన అమ్మాయిలాంటి అమెరికా.. ఎంత చూసినా తనివితీరని అమెరికా..’.. ఇది అగ్రరాజ్యం అమెరికా గురించి ఓ తెలుగు సినిమాలోని పాట. ఈ పాటలోని చరణాలకు తగ్గట్టే అమెరికా అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ మోజు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది విద్యావంతులు అమెరికాకు వలస వెళ్తున్నారు. ఉద్యోగం చేయడానికో, చదువుకోవడానికో.. ఏదో ఒక కారణంతో అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. అక్కడి వాతావరణంపై ఇష్టం పెంచుకుని, అక్కడి జీవితంపై మక్కువ పెంచుకుని, ఆ దేశాన్ని విడిచి రాలేక.. అగ్రరాజ్యంలోనే సెటిలైపోతున్న భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రతియేటా అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇచ్చే గ్రీన్ కార్డు కోసం ఎన్నో లక్షల దరఖాస్తులు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లగ్జరీ లైఫ్.. వేలాది డాలర్ల జీతం.. అమెరికాలో వీటిని వదులుకుని ఎవరైనా స్వదేశానికి వస్తారా..? ట్రంప్ ఇవాళ ఉంటారు.. రేపు మరొకరు అధ్యక్షుడిగా వస్తారు.. ఈ మాత్రం దానికే అగ్రరాజ్యాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతారా..? అంటే ఓ ఎన్నారై మహిళ మాత్రం అవుననే సమాధానం చెబుతోంది. ట్రంప్ భయంతో కాకున్నా, వేలాది డాలర్ల జీతం వస్తున్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా, పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసం అందించే అవకాశం ఉన్నా.. తాము మాత్రం భారత్‌కు వెళ్లిపోతామని తేల్చిచెబుతోంది. ఆమె బాధ ఏంటో, ఆలోచన ఏంటో.. అమెరికాను వదిలేసి భారత్‌కు వెళ్లిపోయేందుకు కారణమైన తన మనసులోని భావాలు ఏంటో ఆమె మాటల్లోనే..

‘‘నా పేరు గౌరీ ధనీ, అమెరికాలోని ఫిలిప్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. మసాచ్చుయేట్స్ రాష్ట్రంలోని బోస్టన్‌లో భర్తతో కలిసి ఉంటున్నా. భారతీయులు అమెరికాను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్లిపోతున్నారా..? అని చాలామంది స్నేహితులు నన్ను అడిగారు. వాళ్లకు నేను సమాధానం చెప్పదలచుకున్నాను. అందరు భారతీయుల సంగతి నేను చెప్పలేను కానీ.. నేను నా భర్త మాత్రం స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నాము. ఇది ట్రంప్ భయంతోనో, జాత్యాహంకార దాడుల వల్లనో తీసుకున్న నిర్ణయం కాదు.. మా ఇద్దరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల తీసుకున్న నిర్ణయమిది. 

అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేయడానికి మేమిద్దరం అమెరికాకు వచ్చాం. అమెరికాలో చదువుకునేటప్పుడు డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆ భారం కుటుంబంపై పడుతుంది. లోన్లు తీసుకుని చదువుకున్నా దాన్ని తీర్చేందుకు ఎంతో ప్రయాసపడాలి. ఖర్చుపెట్టే ప్రతి రూపాయి కూడా వృథా కాకుండా చూసుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే భారత్ నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆర్థికంగా సతమతమవుతుండేవాళ్లే. అమెరికా చదువుకు అయిన అప్పులు తీర్చి కొంత మొత్తాన్ని ఆదా చేయడానికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కనీసం నాలుగైదు ఏళ్లు పడుతుంది. అమెరికాలో ఉద్యోగం అనేది పర్మినెంట్ కాదు. ఎప్పుడు తీసేస్తారో తెలియదు. మనం సంపాదించే డబ్బును బట్టే అగ్రరాజ్యంలో మన జీవితం ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకున్నాక ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంతో సంబంధం లేకుండా శ్రమజీవిలా మారాల్సి ఉంటుంది. భారత్‌లో సొంత ఇల్లు అంటే పెద్దకష్టమేమీ కాదు. మన పెద్దవాళ్లు రెండు కుటుంబాలు ఉండగలిగేలా ఇళ్లను నిర్మిస్తుంటారు. అదే ఇంట్లో కొడుకులు, కోడళ్లతో కలసి ఉంటుంటారు. కానీ అమెరికాలో సొంత ఇల్లు అంటే మాత్రం అంత సులభం కాదు. 
 
అమెరికాలోని భారతీయుల ఇళ్లల్లో పనిచేసేందుకు పనిమనుషులు అంత సులభంగా దొరకరు. ఒకవేళ దొరికినా ఎవరు దొంగలో, ఎవరు నేరస్థులో తెలిసేనాటికి కొంపకొల్లేరవుతుంది. ఇంట్లో పనికి చేదోడు వాదోడుగా ఉంటారని భారత్ నుంచి తల్లిదండ్రులనో, అత్తమామలనో తెచ్చుకున్నా.. వారికి పర్మినెంట్ రెసిడెన్సీ కుదరదు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో ఒక్కరు పనిచేస్తే అమెరికాలో బతకలేం. ఇద్దరూ పనిచేయాల్సిందే. పిల్లలు పుట్టాక పరిస్థితి మరీ ఘోరం. సాధారణంగా అయితే పిల్లలు పుట్టిన ఏడేళ్ల వరకూ తల్లి వారికి నిరంతరం తోడు ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెరికాలో అది సాధ్యం కాదు. భారత్‌లో అయితే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, బాబాయి, పిన్ని, వదిన.. ఇలా ఒకరేమిటి.. ఊళ్లో అందరూ పిల్లల ఆలనా పాలనా చూసేందుకు ఎగబడతారు. కానీ అమెరికాలో ఆ పరిస్థితి అసలే లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వారివే ఉరుకుల పరుగుల జీవితాలు. పిల్లల్ని డే కేర్ సెంటర్లో వదిలేయడం, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తీసుకు రావడం.. మళ్లీ లేవడం ఆఫీసుకు వెళ్లడం.. ఇదీ దైనందిన జీవితం. పిల్లలు ఎదుగుతున్న సమయంలో కూడా వాళ్లు ఏం చదువుతున్నారనే విషయాలపై ఆరా తీయడానికి సమయం ఉండదు. ఆఫీసుల్లో తల్లిదండ్రులు ఉంటే.. పిల్లలు ఎవరెవరితోనే స్నేహాల్లో మునిగితేలుతుంటారు. అవి ఒక్కోసారి కట్టుదాటి పోయేలా తయారయి.. జరగకూడని నష్టం జరిగేలా దారితీస్తాయి. కనీసం పిల్లలను భారత్‌కు పంపిద్దామనుకున్నా.. ఏ రెండేళ్లకో, మూడేళ్లకో ఒకసారి కుదురుతుంది కానీ.. మాటిమాటికి పంపించడం మాత్రం కుదిరే పనికాదు. 
 
మేము అమెరికాలో ఉండటం వల్ల మూడు తరాలు నష్టపోతున్నాయి. ఓ వైపు మా తల్లిదండ్రులు, అత్తమామలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మేము డబ్బు సంపాదనలో పడి, అమెరికాలో ఉంటున్నామన్న పేరు కోసం వాళ్లకు దూరంగా ఉంటున్నాం. మరో వైపు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తున్నాం. తప్పదు ఇక్కడ నామమాత్రంగానైనా బతకాలంటే ఇద్దరం పనిచేయాల్సిందే. మా జీవితాలను ఫణంగా పెట్టుకుంటూ మా పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దక్కకుండా చేయాల్సి వస్తోంది. ఇది జరగకూడదు. విద్య, ఉద్యోగం అంటూ ఓ రకంగా కుటుంబానికి మేము దూరం అయ్యాం. వాళ్ల వృద్ధాప్యంలో వారికి దగ్గర లేకుండా పోయాం. డబ్బు పంపించగలమేమో దగ్గర ఉండి ప్రేమతో చూసుకోలేకపోతున్నాం. డబ్బు సంపాదనలో పడి మాకు మేమే వాళ్ల ప్రేమకు దూరం అయ్యాం.  ఆ పరిస్థితి మా పిల్లలకు రాకూడదు. నాయనమ్మ, అమ్మమ్మ ఆప్యాయత వాళ్లకు తెలియాలి. ప్రేమానుబంధాల విలువ వాళ్లు గుర్తెరగాలి. అందుకే మేము అమెరికాను వదిలేసి భారత్‌కు వెళ్లాలనుకుంటున్నాం.’’.. ఇదీ ఓ ఎన్నారై మహిళ ఆవేదన.. గౌరి మాత్రమే కాదు.. ఎంతోమంది ఎన్నారైలు కుటుంబాన్ని వదిలేశామన్న బాధతో, తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్ కోసం అమెరికాను వదిలేసి భారత్‌కు వచ్చేశారు.. వచ్చేస్తున్నారు కూడా..