యూకే వీసా ఉద్యోగానికి ఓకే

అమెరికా తరవాత అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షిసున్న దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే). ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలకు నెలవైన యూకేలో ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, మెడికల్‌ సైన్సెస్‌ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువ. అమెరికాతో పోలిస్తే స్వల్ప వ్యవధిలోనే మాస్టర్స్‌ కోర్సును పూర్తి చేసే అవకాశం, తక్కువ ఖర్చు, అత్యున్నత సౌకర్యాలు, ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్స్‌ వంటివి యూకేను పాపులర్‌ డిస్టినేషన్‌గా మారుస్తున్నాయి. మరింత మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో తాజాగా వీసా నిబంధనలను సరళతరం చేసింది. భారతీయ విద్యార్థులకు కలిసొచ్చే ఈ మార్పులను తెలుసుకుందాం...

విదేశీ విద్య దిశగా చేసే సన్నాహాల్లో కీలకమైంది వీసా. ఏదైనా ఒక దేశంలో చట్టబద్ధంగా అడుగుపెట్టడానికి ఆ దేశ ప్రభుత్వం వీసా రూపంలో అనుమతి ఇస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు అడ్మిషన్‌ లేదా కన్ఫర్మేషన్‌ లెటర్‌ సొంతం చేసుకోవడంతోనే వీసాకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.  అమెరికా మాదిరిగానే యూకేలో కూడా బహుళ వీసా విధానం అమల్లో ఉంది.  ఒక్కో టాస్క్‌ను బట్టి ఒక్కో వీసా కేటాయిస్తారు. ఇందుకోసం ఆ దేశం పాయింట్‌ బేస్డ్‌ సిస్టమ్‌ (పీబీఎస్)ను అనుసరిస్తుంది. విద్యార్థులకు టయర్‌ 4  వీసాను మంజూరు చేస్తారు.
 
అమల్లోకి వచ్చిన మార్పులు
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అక్కడ చదివే అంతర్జాతీయ విద్యార్థులకు వీసా విషయంలో కొన్ని మార్పులు చేసింది. తద్వారా వారికి అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి మరింత వెసులుబాటు లభించనుంది. వర్క్‌ వీసాలకు సంబంధించి సవరించిన కొత్త ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు జనవరి 11 నుంచి అమల్లోకి వచ్చాయి.  
 
పాత నిబంధన ప్రతికూలం
యూకేలో చదవడానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా టయర్‌ 4 పాయింట్‌ బేస్డ్‌ వీసాలు మంజూరు చేస్తారు. కోర్సు వ్యవధితోపాటు మరికొంత కాలంపాటు అక్కడే ఉండటానికి ఈ వీసాల ద్వారా వీలవుతుంది. ఉదాహరణకు లాంగ్‌ టర్మ్‌ స్టడీ విషయంలో 12 నెలలపాటు, అదనంగా 4 నెలలపాటు అక్కడే ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 4 నెలల సమయంలోనే వారు ఉద్యోగం సాధించాలి. లేకుంటే స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విద్యార్థులకు ఈ నిబంధన ప్రతికూలంగా ఉండేది. 
 
డిగ్రీ తరవాతే
గతంలో డిగ్రీ ప్రదానం చేసిన తరవాతే టయర్‌ 2 వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఉదాహరణకు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సును తీసుకుంటే.. ఆ కోర్సుకు సంబంధించిన థిసిస్‌ సమర్పించడం, దాని మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, డిగ్రీ అందజేయడం వరకు ఎదురు చూడాల్సి వచ్చేది. దాంతో టయర్‌ 4 వీసాతో కోర్సు ముగిసిన తరవాత అక్కడ ఉండేందుకు లభించే అదనపు సమయం వృథా అయ్యేది. ఫలితంగా ఉద్యోగ ప్రయత్నాలకు సరిపడ సమయం చిక్కేది కాదు. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చేది. 
 
భిన్నాభిప్రాయాలు
అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేస్తున్న ఈ నిబంధనపై యూకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనను సరళతరం చేయాలనే డిమాండ్‌ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే యూకే యూనివర్సిటీలు, ఆ దేశ ప్రభుత్వం మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు జరిగాయి. వాటి ఫలితంగానే ఈ కొత్త నిబంధన కార్యరూపం దాల్చింది. ఈ నిబంధనను లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ సమర్థించారు. టయర్‌ 2 వీసా స్వరూపాన్ని మార్చి విదేశీ విద్యార్థులకు 12-24 నెలలపాటు ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలని ఖాన్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. 
 
పాయింట్‌ బేస్డ్‌ సిస్టమ్‌ ఇలా...
  • లెసైన్స్‌డ్‌ స్పాన్సర్‌ జారీ చేేస లెటర్‌, కోర్సు ఫీజు, అక్కడ నివసించేందుకు అవసరమయ్యే సౌకర్యాలు, తదితరాల ఆధారంగా ఈ పాయింట్లను కేటాయిస్తారు. వీటిని పరిగణనలోకి తీసుకుని వీసా మంజూరు చేస్తారు. 
  • ఐదు కేటగిరీలుగా వీసాలను విభజించారు. అవి.. టయర్‌-1, టయర్‌-2, టయర్‌-3, టయర్‌ -4, టయర్‌-5. 
  • టయర్‌-1 పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా. టయర్‌ - 2 స్పాన్సర్డ్‌ ఎంప్లాయీ్‌సకు ఉద్దేశించింది (వర్క్‌ పర్మిట్‌). టయర్‌ - 3 తాత్కాలిక వీసా (లో స్కిల్డ్‌ వర్కర్స్‌ కోసం కేటాయించేది). టయర్‌-4 స్టూడెంట్‌ వీసా. టయర్‌-5 యూత్‌ మొబిలిటీ స్కీమ్స్‌ / తాత్కాలిక వర్కర్స్‌ కోసం ఉద్దేశించింది. 
  • యూకేలో చదువుకు వచ్చే విదేశీ విద్యార్థులు టయర్‌ - 4 (జనరల్‌) వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. 
వెసులుబాటు
కొత్త నిబంధనల ప్రకారం కోర్సు పూర్తయిన వెంటనే టయర్‌ 2 వీసా (స్కిల్డ్‌ వర్కర్‌ వీసా)కు సులభంగా మారొచ్చు. నాన్‌ యూరోపియన్‌ ఎకనమిక్‌ ఏరియా దేశాలకు చెందిన వారు యూకే పౌరులు స్పాన్సర్‌ చేసే కంపెనీల్లో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు చేయడానికి జనరల్‌ టయర్‌ 2 వీసా అవకాశం కల్పిస్తుంది. కోర్సు పూర్తయిన వెంటనే టయర్‌ 2 వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. తాజా నిబంధనలు..
  • కోర్సు ఫలితాలతో నిమిత్తం లేకుండా, పూర్తయిన వెంటనే టయర్‌ 4 నుంచి టయర్‌ 2 వీసా స్వాపింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  
  • డాక్టోరల్‌ విద్యార్థులకు మాత్రం ఫలితాలు వచ్చిన తరవాత మాత్రమే టయర్‌ 2 వీసా స్వాపింగ్‌కు అర్హత లభిస్తుంది.
  • టయర్‌ వీసా 2 మంజూరుకు పట్టే సమయాన్ని కూడా తగ్గిస్తారు.
  • జనరల్‌ టయర్‌ 2 వీసా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను అప్‌డేట్‌ చేస్తారు.