ఐటీ ఆటలో ఓడుతున్న ఉద్యోగి

‘‘భారత దేశ సాఫ్ట్‌‍వేర్ టెక్నీషియన్లలో మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లేవు’’. మీడియాలో గత 20ఏళ్లుగా ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇరవై ఏళ్ళుగా ఇదే పరిస్థితి ఎందుకు కొనసాగుతున్నది? ఇది నిజమేనా? ఐటీ పరిశ్రమలో జీతాలు నెలకు వేలల్లో లక్షల్లో ఉండటంతో ఎవరూ ఈ విషయం పట్టించుకోలేదు.

 
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1బీ వీసా విషయంలో తెచ్చిన మార్పులు, ‘హైర్ లోకల్, పే బెటర్’ వంటి విధానాలు మనదేశంలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. ఐటీ పరిశ్రమలో మొత్తం 58వేల ఉద్యోగాలు పోతాయనీ, రావాల్సిన 5 నుంచి 6 లక్షల కొత్త ఉద్యోగాలు రావనీ అంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలన్నీ ఇమ్మిగ్రేషన్ మీద పలు నిషేధాలు విధించటం ద్వారా భారతదేశపు బలహీనమైన రూపాయి విలువపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకపక్క ప్రపంచస్థాయి ధరల్ని భరిస్తూ, మరో పక్క తక్కువ ధరలకు ఉత్పత్తులను బయటి దేశాలకు అమ్మాల్సిన పరిస్థితికి మన దేశాన్ని గురిచేస్తున్నాయి. ఈ దేశాలు ఎప్పుడూ భారత విదేశీ మారకద్రవ్య రాబడిపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం ఏదీ భారత ప్రభుత్వం వైపు నుంచి జరగటం లేదు. ఎందుకు?
 
మన దేశంలో కంప్యూటర్ హార్డ్‌‍వేర్, సాఫ్ట్‌వేర్ సాంకేతికతలూ, ఉత్పత్తులను ఒకసారి పరిశీలిస్తే- ఇవన్నీ దాదాపు అమెరికా నుంచే వస్తున్నాయి. ఐటీ పరిశ్రమ మన దేశంలో పాతికేళ్ళుగా ఉంటూ, ఎంతో బిజినెస్ చేస్తూ కూడా ఇప్పటిదాకా భారతదేశానికి చెందిన ఉత్పత్తి అని చెప్పుకోదగ్గ సాఫ్ట్‌వేర్ ఒక్కటీ లేదు. ఐటీ పరిశ్రమలో సాంకేతిక విభాగంలో పరిస్థితి ఇది. కాగా, గత పాతికేళ్ళలో ఈ పరిశ్రమలో సాంకేతిక విభాగంతో పాటు మరిన్ని ఉప విభాగాలూ అభివృద్ధి చెందాయి. అవి క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్.
కంప్యూటర్ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు సాంకేతిక ఉద్యోగాలలో చేరితే, ఇతర సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఐటీ పరిశ్రమలో ఉప విభాగాలైన క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లలో చేరుతున్నారు. చదువుకి తగ్గ ఉద్యోగాల్లో చేరితే వీరికి ఐటీ పరిశ్రమలో వచ్చేంత జీతాలురావు. ఐటీ పరిశ్రమలో ఉన్న పెద్ద విభజన ఇది. ఒకటి ముఖ్యమైన సాంకేతిక విభాగం (టెక్ డివిజన్), రెండోది నిర్వహణ విభాగం (మేనేజ్‌మెంట్).
 
ప్రపంచ సాంకేతిక రంగానికంతటకీ అమెరికా మూలం కాబట్టి, ప్రతీ ఏటా సాఫ్ట్‌వేర్లకు అనేక కొత్త వెర్షన్లు రిలీజవుతూ, కొత్త హార్డ్‌వేర్ నిర్మాణాలు తయారవుతూ అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలోనికి చేరతాయి. సాఫ్ట్‌వేర్ నిపుణులు ఈ కొత్త రిలీజుల గురించి తెలుసుకుంటూ నిత్యం వాటి గురించిన పరిజ్ఞానం పెంచుకుంటూ ఉండాలి. సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్లలో ‘‘నైపుణ్యాలు’’ కొరవడుతున్నాయి అనే మాటకు అర్థం వారు ఈ కొత్త రిలీజులకు తగినట్టు సిద్ధంగా ఉండటం లేదూ అని.
 
భారతీయ ఐటీ పరిశ్రమకు ఈ నైపుణ్యాలు అనేవి ఎందుకు పెద్ద సమస్యగా మారాయి? సమాధానం సులువే. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, గూగుల్, విప్రో... ఇలా ఇక్కడ ప్రారంభమైన, లేదా ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఏ ఐటీ కంపెనీని తీసుకున్నా అవన్నీ ‘సాంకేతిక పరిజ్ఞానమున్న మానవ వనరులను సరఫరా చేసే కంపెనీలు’. వారి వ్యాపార సూత్రమల్లా ప్రాజెక్టుల కోసం మనుషుల్ని సరఫరా చేయటమే. అవేవీ తమంతట తాము ఉత్పత్తుల్ని తయారుచేసే కంపెనీలు (Original Equipment Manufacturers–OEM) కావు. సాంకేతిక నైపుణ్యంగల మనుషుల్ని సరఫరాచేసి వారి మీద గంటకి ఇంతనో, ప్రాజెక్టుకి ఇంతనో అవి డబ్బులు సంపాదించుకుంటాయి. కాబట్టి అవి మౌలికంగా టెక్ కంపెనీలో, ఐటీ కంపెనీలో కావు; కేవలం మనుషుల సేవల్ని అమ్ముకొనే కంపెనీలు. వాళ్ళకి కావాల్సింది కొత్త సాఫ్ట్‌వేర్ రిలీజులకి తగిన ‘నైపుణ్యాలు’. మరి ఇందుకోసం ఈ కంపెనీలు తమ దగ్గరున్న మానవ వనరులకు శిక్షణ ఇప్పిస్తాయా? లేదు. శిక్షణ పొందిన తర్వాత వారు కంపెనీ వదిలివెళ్ళిపోతే శిక్షణకు అయిన పెట్టుబడి వృథా అని ఈ కంపెనీల భయం. అందుకే ఇతర కంపెనీల్లో పనిచేస్తూ ముందే తగిన శిక్షణ ఉన్న వ్యక్తులను తమవైపు ఆకర్షించుకుంటాయి. దీన్నే ఉద్యోగ పరిభాషలో ‘పోచింగ్’ (ఉద్యోగులను తస్కరించటం) అంటారు.
 
ఈ కంపెనీల వ్యాపారం రెస్యుమేలను పరిశీలించటంతో మొదలవుతుంది. తొలి అంచెల్లో నైపుణ్యాల వడబోత ఎలా జరుగుతుందంటే- సాంకేతిక చదువులేని మేనేజర్లు కేవలం తమకు కావాల్సిన నైపుణ్యాలకు సంబంధించిన పదాలు ఆ రెస్యుమేల్లో ఉన్నాయో లేవో సరిపోల్చి ఎంపిక చేస్తారు. ఒక ఉద్యోగ అభ్యర్థి ఐటీ రంగంలో ఎంతో అనుభవం ఉన్నవాడూ, నిపుణుడూ అయినా సరే-–OEMలు ఎప్పుడూ కొత్తసాఫ్ట్‌వేర్లు రిలీజ్ చేస్తూ ఉంటాయి గనుక–ఈ రెస్యుమేలో పదాల్ని సరిపోల్చుకునే ప్రక్రియలో అతను ‘నైపుణ్యంలేని’ వాడిగానే ముద్రవేయబడతాడు. ఒక సాఫ్ట్‌వేరును ఒకటో వెర్షన్ నుంచే రెండో వెర్షన్‌ను అభివృద్ధి చేస్తారనీ, అంతే తప్ప రెండోది మొదటి తరానికి పూర్తి భిన్నంగా ఉండదన్న కనీస ఇంగితజ్ఞానాన్ని ఈ మేనేజర్లు ఎంపిక ప్రక్రియలో ఉపయోగించరు.
v>
ఒక ఉదాహరణతో మరింత స్పష్టంగా వివరించవచ్చు. మెయిన్‌ఫ్రేమ్, యునిక్స్, లేదా అటువంటి ఇతర లార్జ్ రేంజ్, మిడ్ రేంజ్ మిషన్ల గురించి తెలియని వారికి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కొత్త ఆవిష్కరణే; కానీ అవి తెలిసినవారికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే కేవలం పాత సారాను కొత్త సీసాలో పోయటం లాంటిదే. పాతికేళ్ళ క్రితం పనికిరాదని ప్రచారం జరిగిన సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్‌నే ఇప్పుడు ‘క్లౌడ్ కంప్యూటింగ్’ పేరుతో చాలా లాభాలున్నాయని ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఎవరు ఏ రకమైన సాఫ్ట్‌వేర్ వాడినా కోడ్ నిర్మాణాంశాలు ఒకేలా ఉంటాయి. వీటిని ఎలా ఉపయోగించాలన్న పరిజ్ఞానమూ నైపుణ్యాలే చాలామందికి లేనివి, అవి కేవలం అనుభవం ద్వారానే అలవడతాయి. వేర్వేరు వ్యవస్థల్లోనూ, విభాగాల్లోనూ పని చేయటం వల్ల కలిగే అలాంటి అనుభవం విలువ ఈ క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పనిచేసేవారికి తెలియదు. ఐటీ కంపెనీల్లో అత్యధిక శాతం కంపెనీల వ్యాపారసూత్రమల్లా సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారిని అమ్ముకొని లాభాలు గడించటమే కాబట్టి, ఈ సూడో ఐటీ కంపెనీల మేనేజర్లు టెక్నీషియన్ల ఎంపికలో తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఏ రెండు సాంకేతికశాఖల మధ్యనైనా తేడా చెప్పగల జ్ఞానం లేని వీరి లక్ష్యమల్లా చవక ధరలకి సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్లని ఎంపిక చేసుకోవటం. దీనివల్ల భారతదేశం ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నది.
 
ఇప్పుడు ‘హైర్ లోకల్, పే బెటర్’ (స్థానికుల్ని చేర్చుకోండి, మెరుగైన వేతనం చెల్లించండి) అనే ట్రంప్ పాలసీ గురించి మరోసారి మాట్లాడుకుందాం. అమెరికా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్లకు వేతనాలు ఎంత ఉండాలో నిర్ధారించింది. ఉదాహరణకి, ఒక కంప్యూటర్ నిపుణుడికి గంటకు కనీసం 65 డాలర్లు చెల్లించాలి. ఈ లెక్కన ఒక సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్ ఏడాదికి 130 వేల డాలర్లు సంపాదిస్తాడు. ప్రభుత్వం ఈ వేతనాలను ఎందుకు నిర్దేశించింది? తమ పౌరులే అయిన ఈ ఉద్యోగుల వల్ల మార్కెట్‌లో మెరుగైన ధరలతో కొనుగోళ్ళ వాతావరణం ఏర్పడుతుంది. సంస్థలు మార్కెట్‌లో తమ ఉత్పత్తులను మెరుగైన ధరలతో మంచి మార్జిన్‌తో అమ్ముకొనే వీలు కలుగుతుంది. అమెరికన్ కంపెనీల్లో 99 శాతం కంపెనీలకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు లభిస్తాయి. ఈ కంపెనీలు అయ్యే ధరలకన్నా తక్కువకి బిడ్డింగ్ చేయవు. కానీ మన దేశంలో కంపెనీలు దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తాయి. టెక్నీషియన్లని తక్కువ వేతనాలకు తీసుకొంటూ, తక్కువ ధరకి వారి సేవల్ని అమ్ముతాయి. ఉద్యోగాల కల్పన జరుగుతున్నదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కంపెనీలకు ఎన్నో పన్ను రాయితీలు కల్పిస్తోంది. అవి ఈ విధంగా సమకూరే డబ్బుని భవిష్యత్తు ప్రాజెక్టులకు పెట్టుబడిగా వాడుకుంటూనే, సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్లని మాత్రం ఉద్యోగాల్లోంచి తొలగింపు వేతనం (Severance Pay) కూడా ఇవ్వకుండా తీసేస్తున్నాయి.
 
దీనికి తోడు ఇక్కడి ప్రభుత్వాలు కూడా టెక్నీషియన్లు కాని వాళ్ళని నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో కూర్చోబెట్టడం మూలాన ఒక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ అటు కాగితం వాడకమూ, ఇటు డిజిటల్ వినియోగమూ సమాంతరంగా నడుస్తూ ఖర్చు రెండింతలవుతోంది. మన దేశంలో 38 ప్రభుత్వరంగ బ్యాంకులు, అలాగే దాదాపు ఒక లక్షా అరవై వేల బ్రాంచులతో ఎన్నో ప్రైవేటు బ్యాంకులు– రెండు ఐటీ కంపెనీలు సరఫరాచేస్తున్న నాసిరకం సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నాయి. సాధారణంగా అమెరికాలో పెద్ద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు తమకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌లను తమంతట తాము తయారు చేసుకుంటాయి. దీనివల్ల కొత్త సాంకేతికతలు ఆవిష్కృతమవుతాయి. మన దేశంలో మాత్రం ప్రభుత్వ సంస్థలతో సహా అన్ని సంస్థలూ దిగుమతి చేసుకున్న సాఫ్ట్‌వేర్‌నే వాడుతున్నాయి. నిరుద్యోగానికి కారణం ఇదే.
 
ఈ రంగంలో అవినీతి ఎంత ముదిరిందంటే– పెద్ద ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలు చేసిన లాబీయింగ్ వల్ల చివరకు కార్మిక చట్టాల్లోకి కూడా అవినీతి చొరబడింది. ఉద్యోగుల భవిష్యనిధికి కంపెనీల తరఫు నుంచి రావాల్సిన 10 శాతాన్ని వేతన స్థాయితో సంబంధం లేకుండా రూ.1500కు స్థిరపరిచేసారు. సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్లకు చట్టపరమైన భద్రత లేదు. వారికి శిక్షణ ఇచ్చి దగ్గరుంచుకునే పద్ధతి లేదు. తొలగింపు వేతనాలూ లేవు. వారికి ఎంత అనుభవం ఉన్నా అది ఎందుకూ పనికిరాని పరిస్థితి.
 
ఈ ప్రపంచంలో దేశాలు తల్లకిందులవ్వచ్చు, ప్రభుత్వాలు పడిపోవచ్చు, కానీ ఆర్థిక శక్తికి అంతం లేదు. ఆర్థిక శక్తికి మూలం ఉత్పత్తులూ, సేవలూ. మార్కెట్లతో నిర్మితమైన ఈ ప్రపంచంలో ఒకసారి ఏదైనా ఉత్పత్తికి గానీ, సేవకు గానీ సృష్టి జరిగిందంటే దాన్నెవరూ నాశనం చేయలేరు. శతాబ్దాలుగా పరాయి పాలనలో మగ్గిన భారతదేశం ఇప్పటికైనా ఉత్పత్తుల సృష్టిలో స్వావలంబన వైపు, తన మార్కెట్ల భద్రత వైపూ దృష్టిసారిస్తే మంచిది.
-కొడాలి ఏకాంబర్
(22-06-2017 ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్)