ట్రంప్‌ కారా! మజాకా!

అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు. మరి అలాంటిది అగ్రరాజ్య అధ్యక్షుడు ఉపయోగించే కారంటే.. మామూలుగా ఉంటుందా? ఆ కొత్త కారు గురించి ఆసక్తికరమైన విషయాలు.. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉపయోగిస్తున్న కొత్త కారును ‘బీస్ట్‌’ అని పిలుస్తున్నారు. జనవరిలోనే ఈ కారు ఉపయోగించాల్సింది. కానీ అప్పటికి ఆ కారు సిద్ధం కాలేదు. ఇలాంటి కార్లు మొత్తం 12 ఉంటాయి. 
 
 
 హెడ్‌లైట్‌ పక్కనే ఉన్న ఈ కెమెరాలు రాత్రిపూట కూడా స్పష్టంగా ఫొటో, వీడియోలు తీయగలవు. 
 
కంపార్ట్‌మెంట్‌ : అధ్యక్షుడితో కలిపి నలుగురు కూర్చునే సదుపాయం ఉంటుంది. ప్రతి వ్యక్తిని సపరేట్‌ చేస్తూ.. గ్లాస్‌ పార్టీషన్‌ ఉంటుంది. అధ్యక్షుడు మాత్రమే ఆ అద్దాలను కిందకు దింపగలడు. 
 
తలుపులు : ఈ కారు తలుపుల మందం 8 అంగుళాలు. బోయింగ్‌-757 విమానానికి  ఉండేలాంటి తలుపులే వీటికి ఉంటాయి. 
 
చౌఫ్యుర్‌ : ఈ కారు డ్రైవర్‌కు అమెరికా రహస్య సేవ విభాగ అధికారులు శిక్షణ ఇస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో 180 డిగ్రీల ‘జె’ టర్న్‌తో కారును తప్పించగల సామర్థ్యం కూడా ఉంటుంది. 
 
కిటికీలు : ఐదు అంగుళాల మందంతో రూపొందించిన అద్దాలను ఈ కారుకు కిటికీలుగా అమర్చారు. బుల్లెట్లను ఆపే శక్తి వీటికి ఉంది. 

బూట్‌ : అగ్నిమాపక పరికరాలు అమర్చి ఉంటాయి. 
 
డ్రైవర్స్‌ కంపార్ట్‌మెంట్‌ : ఇందులోని డాష్‌బోర్డులో కమ్యూనికేషన్‌ సెంటర్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌లు ఉంటాయి. కారులోనే సెల్‌ టవర్‌ కూడా ప్రత్యేకంగా ఉండటం విశేషం. 
 
రేర్‌ సీట్స్‌ : అధ్యక్షుడి సీటుకే శాటిలైట్‌ ఫోను ఉంటుంది. ఈ ఫోనుకు ఉపాధ్యాక్షుడు, పెంటగోన్‌(అమెరికా రక్షణ వ్యవస్థ ప్రధాన కేంద్రం)లకు డైరెక్ట్‌ లైన్‌ అనుసంధానమై ఉంటుంది. 
 
ఇంధన ట్యాంకు : ఇది కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. దీని కింద బాంబు పేలినా ఏ మాత్రం చెక్కుచెదర కుండా ఉంటుంది. 
 
ఆయుధాలు : డ్రైవర్‌ పక్క సీటుకు ఆనుకుని.. అత్యాధునిక ఆయుధాలతో పాటు, అధ్యక్షుడి గ్రూపునకు చెందిన రక్తం ప్యాకెట్లు సిద్ధంగా ఉంటాయి. 
 
చాసిస్‌ : రెయిన్‌ఫోర్స్‌డ్‌ స్టీలు పేట్లతో ఇది నిర్మితమైంది. బాంబు దాడులను కూడా ఇది తట్టుకోగలదు. 
 
టైర్లు : కారుకు పంక్చర్‌ అయినా, పగిలిపోయినా.. అది ముందుకు వెళ్లగలదు. ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. 
 
 ఒక్కో కారు బరువు - 8 టన్నులు 
 జీవ రసాయన దాడులను కూడా ఈ కార్లు తట్టుకోగలవు. 
 
అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆక్సిజన్‌ అందించే వ్యవస్థ కూడా కారులోనే ఉంటుంది. 
 
ఈ కారు ఖరీదు దాదాపు 100 కోట్ల రూపాయలు.