ఖరీదైన కరెన్సీ కలిగిన టాప్-10 దేశాలివే..

కువైట్: ఎవరైనా విదేశాలకు వలస వెళ్తున్నారంటే.. వారి అసలు లక్ష్యం డబ్బు సంపాదన. వలస వెళ్లేందుకు కారణాలు అనేకం. కానీ దాని లక్ష్యం మాత్రం కాస్త డబ్బు వెనకేసుకోవడమే. భారతీయులు లేని దేశం లేదు.. తెలుగు వాళ్లు అడుగుపెట్టని ప్రాంతం కానరాదు అంటుంటారు పెద్దలు. పొట్టకూటి కోసమో, వ్యక్తిగత ఇష్టం మేరకో వివిధ దేశాలకు భారతీయులు వలస వెళ్లారు. ఆయా దేశాల కరెన్సీని సంపాదించి దాన్ని భారతీయ కరెన్సీకి మార్చి తమ తమ ఇళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది. మనకు రూపాయి ఉన్నట్లు అమెరికన్లకు డాలర్, సౌదీలో సౌదీ రియాల్స్, కువైట్‌లో కువైట్ దీనార్స్, ఒమన్‌కు ఒమన్ రియాల్స్, యూకేకు బ్రిటీష్ పౌండ్స్.. ఉండనే ఉన్నాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు తమ వాణిజ్యాన్ని సొంత కరెన్సీలో జరుపుతుంటుంటాయి. మరి ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీ విలువ ఎక్కువ..? ఏ దేశ కరెన్సీకి బాగా డిమాండ్ ఉంది..? వంటి ప్రశ్నలు తలెత్తక మానవు.  ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల కరెన్సీని డాలర్లలో కొలిస్తే.. ఏ కరెన్సీకి ఎక్కువ విలువ, ఎక్కువ డాలర్లు వస్తాయో ఓ లుక్కేయండి...

1. కువైట్: భారత్ నుంచి పెద్ద సంఖ్యలో వలస వెళ్లే దేశాల లిస్ట్‌లో కువైట్ కూడా ఒకటి. 2013 లెక్కల ప్రకారం దాదాపు 7 లక్షలకు పైగా భారతీయులు కువైట్‌లో జీవనోపాధి పొందుతున్నట్లు అంచనా. ఈ దేశపు కరెన్సీ పేరు కువైట్ దీనార్. ఒక కువైట్ దీనార్ విలువ దాదాపు 3.31 అమెరికన్ డాలర్లు ఉంటుంది. అంటే ఒక్క కువైట్ దీనార్ విలువ దాదాపు 224.91 రూపాయలన్నమాట. 2013 నుంచి ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దీనార్ నిలిచింది. 
 
2. బహ్రెయిన్:కువైట్ తర్వాత అత్యంత కరెన్సీ విలువ ఎక్కువ గల దేశం బహ్రెయిన్. ఇక్కడ కరెన్సీ పేరు. బహ్రెయిన్ దీనార్లు. ఒక్కో బహ్రెయిన్ దీనార్ విలువ 2.65 డాలర్లు. అంటే 180 రూపాయలన్నమాట. 
 
3. ఒమన్: కువైట్, బహ్రెయిన్ దేశాల తర్వాత కరెన్సీ మారకంలో మూడో స్థానంలో ఉన్న దేశం ఒమన్. ఇక్కడ కరెన్సీని రియాల్స్‌లో కొలుస్తారు. ఒక్కో ఒమనీ రియాల్స్ విలువ 2.59 డాలర్లు. అంటే 176 రూపాయలతో సమానం. 
 
4. యూకే:ఖరీదైన కరెన్సీ కలిగి ఉన్న దేశాల్లో యునైటెడ్ కింగ్‌డమ్ నాలుగో స్థానంలో నిలిచింది. బ్రిటీష్ పౌండ్లలో కొలిచే ఈ దేశపు కరెన్సీకి బ్రెగ్జిట్ తర్వాత మరింత డిమాండ్ పలుకుతోంది. ఒక్కో బ్రిటీష్ పౌండ్ ధర 1.27 డాలర్లు. ఇది 86.31 రూపాయలకు సమానం. 
 
5. యూరోపియన్ యూనియన్: ప్రపంచాన్ని కుదిపేసిన బ్రెగ్జిట్ పరిణామం.. యూరోపియన్ యూనియన్‌పై చాలా ప్రభావం చూపింది. అయినా అమెరికన్ డాలర్ కంటే తమ దేశపు మారకం అయిన యూరోకు విలువ తగ్గకుండా నిలబెట్టుకోగలింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక యూరో విలువ 1.11 డాలర్లు. ఇది 75.42 రూపాయలకు సమానం. 2017వ సంవత్సరం దీని విలువ తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
6. స్విడ్జర్లాండ్: ఈ దేశంలో కరెన్సీని స్విస్ ఫ్రాన్స్‌లో కొలుస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక స్విస్ ఫ్రాన్స్ విలువ 1.02 డాలర్లు. అంటే 69.28 డాలర్లన్నమాట. ప్రపంచ దేశాలన్నింటిలోనూ బ్యాంకింగ్ రంగం పటిష్టంగా, కస్టమర్లకు రక్షణాత్మకంగా వ్యవహరించే దేశంగా స్విడ్జర్లాండ్‌కు పేరుంది. 
 
7. లిబియా:ఏళ్ల తరబడి నియంతృత్వ ధోరణితో, నిరంకుశంగా పాలిస్తున్నాడంటూ లిబియా అధ్యక్షుడు గఢాఫీపై తిరుగుబాటు దారులు, అమెరికా కలిసి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు గఢాఫీని అంతమొందించి అమెరికా సహాయసహకారాలతో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. అయితే నిరంకుశ పాలన ఉందని ఆరోపణలు వచ్చినా ఆ దేశ కరెన్సీ మాత్రం అంతర్జాతియంగా టాప్-10 లిస్ట్‌లోనే ఉంది. ఈ దేశ కరెన్సీని లిబియన్ దీనార్లలో కొలుస్తారు. ఒక లిబియన్ దీనార్ విలువ 0.72 అమెరికన్ డాలర్లు. అంటే 48.87 రూపాయయలన్నమాట. భారత కరెన్సీ కంటే 48 రెట్లు ఎక్కువ. 
 
8. ఆస్ట్రేలియా: గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా తర్వాత భారతీయులు ఎక్కువగా వెళుతున్న దేశం ఆస్ట్రేలియా. ఇక్కడ  కరెన్సీని ఆస్ట్రేలియా డాలర్లతో కొలుస్తారు. ఒక ఆస్ట్రేలియన్ డాలర్ విలువ 0.72 అమెరికన్ డాలర్లు. అంటే 48.86 రూపాయలన్నమాట. 
 
9. బ్రూనే: ఆగ్నేయాసియా దేశాల్లో అత్యంత చిన్న దేశం బ్రూనే. చిన్నదే అయినా దీని జీడిపీ విలువ చాలా ఎక్కువ. ఇక్కడ కరెన్సీని బ్రూనేయిన్ డాలర్‌గా లెక్కగడతారు. ఒకప్పుడు ఒక బ్రూనేయిన్ డాలర్ విలువ 0.83 అమెరికన్ డాలర్లుగా ఉండేది. ఆ తర్వాత ప్రస్తుతం 0.69 అమెరికన్ డాలర్లకు చేరింది. అంటే మన దేశ కరెన్సీలో 46.85 రూపాయయలన్నమాట
 

10. సింగపూర్:కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు చెబుతున్న మాట.. ‘రాష్ట్రాన్ని మరో సింగపూర్ చేస్తా’. అంతగా జనం నోళ్లలో నానిన సింగపూర్‌కు 1965వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దేశపు కరెన్సీని సింగపూర్ డాలర్లలో కొలుస్తారు. ఒక సింగపూర్ డాలర్ విలువ 0.69 అమెరికన్ డాలర్లు. అంటే 46.85 రూపాయలన్నమాట. 

ఇవి ప్రపంచంలో కరెన్సీ విలువ ఎక్కువగా ఉన్న టాప్-10 దేశాలు. మన భారత దేశం విషయానికి వస్తే.. ఒక రూపాయి విలువను 0.015 అమెరికన్ డాలర్లుగా లెక్కించవచ్చు. ఒక డాలర్ విలువ 67.90 రూపాయలు.