విద్యార్థులూ.. బ్రిటన్‌లో జాగ్రత్తలివీ!

మన దేశం నుంచి అమెరికాతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకూ ఉన్నత విద్యను అభ్యసించటానికి విద్యార్థులు వెళ్తుంటారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేవారి సమస్యలు ఒకలా ఉంటే.. బ్రిటన్‌ వంటి యూరోప్‌ దేశాల్లో చదువుకొనేవారి సమస్యలు వేరేలా ఉంటాయి. అలాంటి సమస్యలు.. పరిష్కారాలు తెలుసుకుందాం..

బ్రిటన్‌లో అధికారిక భాష ఇంగ్లిష్‌. కానీ మనం మాట్లాడే ఇంగ్లిష్‌కు.. బ్రిటన్‌లో మాట్లాడే ఇంగ్లిష్‌కు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా వారి ఉచ్ఛారణ అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందువల్ల ఇంగ్లాండ్‌లో చదువుకోవటానికి వెళ్లేవారు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఇంగ్లిష్‌. వారు మాట్లాడే ఇంగ్లిష్‌ ఉచ్చారణను అర్థం చేసుకోవటానికి దాదాపు నెల రోజులు పడుతుంది. ఆ తర్వాత విద్యార్థులు ఎదుర్కొనే మరో సమస్య- వారి సంస్కృతి, సంప్రదాయాలు. అమెరికాతో పోలిస్తే.. అక్కడ పద్ధతులు భిన్నంగా ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో వారి ప్రవర్తన చాలా గంభీరంగా ఉంటుంది. ఉదాహరణకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు- మన కోసం ఇతరులు ఎవరైనా డోర్‌ తీస్తే- వెంటనే వారికి థాంక్స్‌ చెబుతారు. అదే విధంగా- ఎవరినైనా ఏదైనా అభ్యర్థించాల్సి వస్తే ముందు ఫ్లీజ్‌ అనే పదాన్ని చేరుస్తారు.
 
విద్యావిధానంలో తేడా..
ఇక చదువు విషయానికి వస్తే- మన దేశంలో విద్యావిధానానికి- బ్రిటన్‌ విద్యావిధానానికి చాలా తేడా ఉంటుంది. మన దగ్గర టీచర్లు విద్యార్థులకు పుస్తకాల్లో ఉన్న అన్ని విషయాలు చెబుతారు. కానీ, బ్రిటన్‌లో పాఠాలు వినే సందర్భంలో విద్యార్థులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లు తమ పాఠాలు శ్రవణ విధానంలో కాకుండా డిబెట్‌ విధానంలో చెబుతూ ఉంటారు. దీని వల్ల పాఠాలు చెప్పే సమయంలోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇక సహ విద్యార్థుల విషయానికి వస్తే కొన్ని వర్సిటీల్లో జాతి వివక్ష కనబడుతుంది. ఎవరైనా వచ్చి జాతి వివక్షపూరితంగా మాట్లాడితే సంబంధిత అధికారులకు చెప్పటం మంచిది. కామెంట్స్‌ చేసిన వారితో వాదించటం మంచిది కాదు.
 
లేబర్‌ చట్టాలు కఠినం..
స్కాలర్‌షిప్‌ల విషయానికి వస్తే.. కొన్ని వర్సిటీలు స్కాలర్‌షిప్‌లు అందిస్తాయి. ఫీజులు పోగా మిగిలిన సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అమెరికాతో పోలిస్తే బ్రిటన్‌లో ఖర్చు చాలా ఎక్కువ. ఉదాహరణకు బ్రిటన్‌లో హాస్టల్స్‌ ఫీజు చాలా ఎక్కువ. అందువల్ల ఎక్కువ మంది విద్యార్థులు విడిగా ఇల్లు తీసుకొని ఉంటుంటారు. అలాంటివారిని ఎంపిక చేసుకొని వారితో కలిసి ఉండటం మంచిది. దీని వల్ల చాలా డబ్బులు మిగులుతాయి. బ్రిటన్‌లో బయట తింటే చాలా ఖరీదవుతుంది. వీలైనంత వరకూ ఇంట్లోనే వండుకొని తినటం మంచిది. దీని కోసం ఇక్కడ నుంచి వెళ్లే ముందే అన్నం వండటం లాంటి పనులు నేర్చుకోవాలి. ఇక పార్ట్‌టైం ఉద్యోగాలు అమెరికాలో దొరికనంత ఈజీగా ఇక్కడ దొరకవు. లేబర్‌ చట్టాలు కఠినంగా ఉంటాయి. చాలా సమయాల్లో రిఫరెన్స్‌లు లేకుండా ఉద్యోగాలు దొరకవు. బ్రిటన్‌ వెళ్లిన వెంటనే కొంత నెట్‌వర్క్‌ పెంచుకోవడం మంచిది.
-స్పెషల్‌ డెస్క్‌