టీనేజ్‌ బుల్లెట్‌

అమెరికాలో తుపాకుల సంస్కృతిపై ఓ అమ్మాయి గురి
మా ప్రాణాలు హరించే తుపాకుల సంస్థ నుంచి విరాళాలా?
గన్‌ లాబీని నియంత్రించలేని వారికి ఓటొద్దని పిలుపు
కళ్లలో సుళ్లు తిరగుతున్న నీళ్లు... గొంతు గాద్గికమై మూగబోయిన వేళ.. ఆప్తులైన స్నేహితులు దూరమై నిరాశా నిస్పృహలు ఆవరించిన క్షణం... బ్రతుకులో నిత్యం భయం... చదువు చెప్పే స్కూళ్లే శ్మశానవాటికల్లా మిగులుతున్న తీరు...
 
ఇవన్నీ ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయిని కలవరపర్చాయి.. జీవచ్ఛవాల్లా బతికే పరిస్థితి ఎందుకొస్తోందని అమెరికన్‌ రాజకీయవేత్తల్ని ఆమె ప్రశ్నిస్తోంది.. ప్రశ్నించడం కాదు నిలువునా కడిగిపారేస్తోంది.. దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నైతే ఏకంగా.. ‘నీకిది సిగ్గుచేటు’ అని అనేసింది.
 
ఆమె చూపులో ఆమాయకత్వం, మాటలో నిజాయితీ, ప్రశ్నించే తీరులో తీక్ష్ణత.. ఇవన్నీ ఇపుడు ఆమెను అమెరికాలో ఓ నేషనల్‌ హీరోని చేశాయి.. ఆ అమ్మాయి పేరు ఎమ్మా గొంజాలెజ్‌.. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో 17 మంది విద్యార్థులు ఓ ఉన్మాది తూటాలకు బలైపోయిన మార్జొరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ హైస్కూల్‌లో చదువుతోంది. హత్యాకాండ సాగిన రోజు ఆమె స్కూలు ఆడిటోరియంలో ఉంది.. కాల్పుల శబ్దం విని ఏదో డ్రిల్‌ జరుగుతోందని అనుకుంది.. తరువాత మిగిలిన విద్యార్థులు పరిగెడుతూ.. ఆమెను చూసి పారిపో..పారిపో.. ఫైరింగ్‌ జరుగుతోంది.. అని హెచ్చరించినపుడు- ఓ మూల నక్కి ప్రాణాలు దక్కించుకుంది.. దాదాపుగా మరణాన్ని చూసి వచ్చానని ఆ తరువాత చెప్పిన ఎమ్మా- జరిగిన దారుణాన్ని అనేక టెలివిజన్‌ ఛానెళ్లకు వినిపించింది.
 
వాషింగ్టన్‌ డీసీలో - తుపాకీ సంస్కృతిని నిరసిస్తూ జరిగిన ఓ మెగా ర్యాలీలో- ఆమె గళం విప్పింది.. కన్నీటిని, బాధని, భయాన్ని పంటిబిగువున అదిమిపెట్టుకుని ఆమె -కేవలం 12 నిమిషాల పాటు- చేసిన పవర్‌ఫుల్‌ ప్రసంగం ఓ ప్రవాహంలా సాగింది.. వందల మంది ప్రత్యక్షంగా చూశారు.. వేల మంది టీవీల్లో తిలకించారు.. ఆలోచనలో పడ్డారు. అమెరికన్‌ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది..‘‘నాకు కలిగిన బాధను నలుగురితో పంచుకోడానికి వచ్చాను..ఇక్కడికొచ్చిన ప్రతీ వారి ఇంటిలో కనీసం ఒకరు మరణించే ఉంటారు, లేదా తెలిసినవారైనా ఉంటారు. మన ప్రభుత్వమో లేక అధ్యక్షుడో సానుభూతి వచనాలు పలికితే వాటిని వినడానికి మనం ఇక్కడకు రాలేదు.. ఒక ఒకవేళ అందుకే వస్తే- మనం కోరుకుంటున్న మార్పు (తుపాకుల వినియోగ చట్టంలో మార్పు) రాదు..’’ అని ఎమ్మా ఆరంభించింది. ఈ ప్రదర్శన ఆ మార్పుకు నాంది కావాలి.. ఆమె పిలుపిచ్చింది.
 
‘‘ఈ క్షణంలో అధ్యక్షుడు ట్రంప్‌ నా దగ్గరకొచ్చి- ‘జరిగినది ఘోరాతి ఘోరం. ఇలాంటవి ఎప్పుడూ జరక్కూడదు.. జరిగిన దానికి సానుభూతి ప్రకటిస్తున్నాను.. నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల చుట్టూనే తిరుగుతున్నాయి.. అయినా ఇలాంటి ఘటనలు ఆపడానికి ఇప్పుడేమీ చెయ్యలేం’ అని గనక అంటే నేను వెంటనే ఒకే ఒక ప్రశ్న అడుగుతాను- ‘నేషనల్‌ రైఫిల్స్‌ అసోసియేషన్‌ నుంచి ఎంత డబ్బు విరాళంగా తీసుకున్నావని..’ ! అని ఎమ్మా అన్నపుడు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.
అమెరికాలో గన్‌ లాబీ చాలా పవర్‌ఫుల్‌.. రాజకీయవేత్తలకి, ముఖ్యంగా రిపబ్లికన్‌ పార్టీకి పెద్ద ఎత్తున వేలాది డాలర్ల విరాళాలిచ్చే సంస్థలో నేషనల్‌ రైఫిల్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఎ) ఒకటి. తుపాకుల వినియోగంపై ఆంక్షలు రాకుండా అడ్డుపడుతున్న సంస్థ ఇది.
 
‘‘ఎన్‌ఆర్‌ఏ నుంచి విరాళాలు తీసుకుంటున్న ప్రతి రాజకీయ నాయకుడూ- ట్రంప్‌తో సహా- సిగ్గుతో తలవంచుకోవాలి’’ అని ఎమ్మా గొంజాలెజ్‌ తీవ్రస్వరంతో చెరిగిపారేసింది. ‘‘మీ నిష్రియ వల్ల ప్రజలు చనిపోతున్నారు.. పిల్లలు రాలిపోతున్నారు. తుపాకుల చట్టాన్ని మార్చాలన్న నివేదన అరణ్యరరోదనగానే మిగిలిపోయింది’’ అని ఎమ్మా నిందించారు. ‘‘ఇక ఈ పెద్దలు (నేతలు) మనకొద్దు.. వీరి వల్ల మార్పు రాదు. ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా ఉండదు. మనమే మార్చాలి. వచ్చే నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఏ నుంచి విరాళాలు తీసుకునే ఏ పార్టీ అభ్యర్థినీ మనం గెలిపించవద్దు.. అమెరికాలోని ప్రతీ యువ ఓటరూ దీన్ని పాటించాలి’’ అని ఆమె పిలుపునిచ్చారు. దీనికి ఆన్‌లైన్‌లో విశేషామోదం లభించింది. నిజంగా ఇదే జరిగితే- రిపబ్లికన్లకు ఎన్నికల్లో గడ్డుకాలమే!
 
ఎమ్మా గొంజాలెజ్‌ ప్రసంగం అమెరికా అంతటా వైరల్‌ అయ్యింది, కొన్ని వేల మంది రీట్వీట్‌ చేశారు. టెలివిజన్‌ ఛానెళ్లలో చర్చలకు దారితీసింది.