దరఖాస్తు నుంచే జాగ్రత్త పడండి

నాలుగు అంశాలపై దృష్టి పెట్టండి

అమెరికా చదువుకోసం సూచనలు

ఆంధ్రజ్యోతి, 25-07-2017: అమెరికాలో చదువుకోవటానికి ప్రతి ఏడాదీ పది లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే, సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ కావటంతో కొందరికి మాత్రమే అడ్మిషన్లు లభిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడ్మిషన్లు రావాలంటే- దరఖాస్తు చేసే సమయంలోనే అనేక జాగ్రత్తలు పాటించాలి. అలాంటివాటిలో నాలుగు ముఖ్యమైన జాగ్రత్తలేమిటో చూద్దాం.

వ్యక్తిత్వం ముఖ్యం..
చదువులో మంచి స్కోర్లు రావటం ముఖ్యమే. కానీ అమెరికా విశ్వవిద్యాయాల్లో మంచి స్కోరు వస్తే మాత్రమే సరిపోదు. కొన్ని విశ్వవిద్యాలయాలు చదువుతో పాటుగా- ఇతర రంగాల్లో ఆసక్తి, అభినివేశం ఉన్నవారిని కూడా ఎంపిక చేస్తూ ఉంటాయి. అందువల్ల మనకు వచ్చిన స్కోర్లతో పాటుగా ఇతర రంగాల్లో మనకు ఉన్న ఆసక్తిని వివరించాలి. అప్పుడు విశ్వవిద్యాలయ అధికారులకు అప్లికెంట్‌ వ్యక్తిత్వంపై ఒక అవగాహన ఏర్పడుతుంది. సరిసమాన స్థాయిలో ఇద్దరు విద్యార్థులు పోటీపడుతున్నప్పుడు ఈ వ్యక్తిత్వ కోణం కీలకమైన పాత్ర పోషిస్తుంది.
 
ఆల్‌ రౌండర్లు వద్దు..
చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చురుకుగా ఉన్న ఆల్‌రౌండర్లైన విద్యార్థులను మాత్రమే విశ్వవిద్యాయాలు ఎంపిక చేస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అన్ని సందర్భాలలోను నిజం కాదు. సాధారణంగా ప్రతీ విద్యార్థి తన దరఖాస్తులో తాను ఆల్‌రౌండర్‌నని చెప్పుకొనేందుకే ప్రయత్నిస్తాడు. ఒక సీటు కోసం ఒకే విధమైన ప్రొఫైల్‌ ఉన్న అనేక మంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. అందువల్ల ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లో ఎక్కువ ప్రతిభ కనబరిచిన వారికి ఎక్కువ అవకాశాలుంటాయి. అందువల్ల ప్రతి రంగంతోనూ తనకు పరిచయం ఉదని చెప్పడం కన్నా మనకు అప్లికేషన్‌లో మనకు నచ్చిన రంగం.. దానిలో మనం కనబరిచిన ప్రతిభ గురించి స్పష్టంగా రాయటం వల్ల అవకాశాలు మెరుగవుతాయి.
 
బెస్ట్‌ కాలేజీ ఏదీ?
సాధారణంగా కౌన్సిలర్స్‌ కాలేజీలకు ర్యాంకులు ఇస్తూ ఉంటారు. కొన్ని సంస్థలైతే గ్రేడ్‌లు ఇస్తాయి. చాలా మంది విద్యార్థులు వీటి ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు గ్రేడ్‌ల ఆధారంగా చూస్తే- ప్రిన్‌స్టన్‌ మొదటి గ్రేడ్‌లో..యూసీ బర్క్‌క్లీ రెండో గ్రేడ్‌లో.. శాన్‌డియాగో మూడో గ్రేడ్‌లో ఉండచ్చు. కానీ, ఒక విద్యార్థి చదువుకోవాలనే కోర్సు శాన్‌డియాగోలో ఉండచ్చు. ఆ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఉండవచ్చు. అందువల్ల కాలేజీలను ఎంపిక చేసుకోనేటప్పుడు- మన అవసరాలను, అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వాటి ఆధారంగా ఒక జాబితాను తయారుచేసుకోవాలి. అంతే కాకుండా కొన్ని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ స్టూడెంట్స్‌కు ఎక్కువ అవకాశాలుంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా గమనించాలి.
 
అప్లికేషనంటే జీవిత కథే..
మనం ఒక విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకుంటున్నామంటే- మన జీవిత కథను ఆ విశ్వవిద్యాలయానికి చెబుతున్నట్లే. చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయి పొడి పొడిగా సమాచారాన్ని ఇచ్చి వదిలేస్తారు. ఆ విఽధంగా కాకుండా మన సామర్థ్యాన్ని తెలిపే రెండు మూడు ముఖ్యమైన అంశాలను వివరిస్తే దరఖాస్తును పరిశీలించే వారు ఆకర్షితులవుతారు. ఉదాహరణకు పర్యావరణ శాస్త్రాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులు- తమకు ఆ రంగంలో ఉన్న అభినివేశాన్ని.. పాల్గొన్న శిక్షణ కార్యక్రమాలను.. వివిధ పత్రికల్లో, కాలేజీ మ్యాగిజైన్లలో ఆ అంశంపై రాసిన వ్యాసాల గురించి దరఖాస్తులో వివరించటం వల్ల అవకాశాలు పెరుగుతాయి.
-స్పెషల్‌ డెస్క్‌