విదేశాల్లోనే వేసవిని గడిపేద్దాం

వేసవి వినోదానికి సిద్ధమవుతున్న హైదరాబాదీయులు 
గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం వృద్ధి, వినూత్నమైన ధోరణులను చూస్తున్నామంటున్న ట్రావెల్‌ ఆపరేటర్లు 
ఫ్యామిలీల తొలి ప్రాధాన్యం యూరోప్‌ అనుసరించి యూఎస్‌ 
సీనియర్‌ సిటిజన్ల మార్గం చార్‌ధామ్‌కే 
యువత మార్గం మాత్రం థాయ్‌లాండ్‌, మలేషియా 
స్విట్జర్లాండ్‌కూ ఓటేస్తున్న హైదరాబాదీ.. ఎడ్వెంచర్‌ టూర్లకు సై! 
 
హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి: స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో చాలామంది ఫ్యామిలీతో టూర్లకు సిద్ధమవుతున్నారు. మధ్య తరగతి వర్గీయులు దేశీయంగా కూల్‌ డెస్టినేషన్స్‌ అయిన హిమాచల్‌ ప్రదేశ్‌, ఊటీ, కూర్గ్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటే.. ఉన్నత వర్గాల ప్రజలు మాత్రం కుటుంబ సమేతంగా యూరోప్‌ టూర్‌లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారన్నది ట్రావెల్‌ ఆపరేటర్ల మాట. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న నగరవాసుల సంఖ్య 20 శాతం పెరిగిందని.. నోట్ల రద్దు, ఇతర నిబంధనలు ఏవీ వీరి ఆసక్తికి బంధనాలు వేయలేకపోతున్నాయని చెబుతున్నారు.
 
అన్వేషించాలి.. ఆనందించాలి..! 
అందరూ చూసిన ప్రదేశాలనే చూడాలని ఎవరూ కోరుకోవడం లేదిప్పుడు. అనుభవాలు.. వినూత్నంగా ఉండాలి. ఆనందం.. కలకాలం నిలిచి ఉండాలని నగరవాసులు కోరుకుంటున్నారు. అందుకే కొత్త ప్రాంతాల కోసం వీరు అన్వేషిస్తున్నారు. తరచుగా ట్రావెల్‌ చేసే వారు మాత్రమే కాదు.. తొలిసారిగా ట్రావెల్‌ చేస్తున్న వారు సైతం కొత్త ప్రాంతాలను గురించి అడుగుతున్నారన్నది ట్రావెల్‌ ఆపరేటర్ల మాట. ఇదే విషయమై సదరన్‌ ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధి అజయ్‌ మాట్లాడుతూ ‘‘దేశీయంగా ఈ సీజన్‌లో ఊటీ, కులు-మనాలి, కూర్గ్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లే వారు అధికంగా కనిపించినా కొత్తగా ఏవైనా చూపగలరా అని అడుగుతున్న వారు ఎక్కువగా కనబడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత అడ్వెంచర్‌ టూర్స్‌ను ఇష్టపడుతుంది’’ అని అన్నారు. బుకింగ్స్‌ డాట్‌ కామ్‌ అధ్యయనం కూడా ఇదే చెబుతుంది. ఈ సంవత్సరం ట్రావెలింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నవారిలో 45 శాతం మంది అడ్వెంచర్‌ టూర్స్‌ను ఇష్టపడుతుంటే 47 శాతం మంది తమ స్నేహితులు ఎవరూ చూడని ప్రాంతాలను చూడాలనుకుంటున్నారని వెల్లడించింది. ట్రావెల్‌ ప్రేమికుల కోరికలకనుగుణంగా ఇప్పుడు గోవా టూరిజం సైతం కొత్త ప్రాంతాలను అన్వేషించమని ఆహ్వానిస్తోంది. ఇటీవలనే హోండా నేవీ గోవా హంట్‌ పేరిట గోవాలో కొత్త ప్రాంతాలను అన్వేషించమని పోటీ నిర్వహిస్తే నగరం నుంచి పదుల సంఖ్యలో ఈ పోటీలో పాల్గొన్న బైకర్లూ ఉన్నారని గోవా టూరిజం శాఖ ప్రతినిధులు చెబుతున్నారు.
 
ప్రకృతి పరవశమే..! 
ప్రకృతి అందాలకు మైమరువని వారుండరు. అందునా ఈ సంవత్సరం అడ్వెంచర్‌ టూర్ల పట్ల మక్కువ చూపుతున్న నగర వాసులు ఆ ప్రకృతిఒడిలోనే సేద తీరాలను కుంటున్నారు. బు కింగ్స్‌ డాట్‌ కామ్‌ అంచనాల ప్రకారం గత సంవత్సరంతో పో లిస్తే ఈ సంవత్సరం 36 శాతం అధి కంగా ఎకో-ఫ్రెండ్లీ టూర్ల వైపు మళ్లుతున్న వారున్నారు. దేశీయంగా పచ్చ దనం పరుచుకున్నట్లుండే కూర్గ్‌, ఊటీ, కొడైకెనాల్‌, డార్జిలింగ్‌, గ్యాంగ్‌టక్‌, పెల్లింగ్‌, లడఖ్‌ లాంటి ప్రాంతాలతో పాటు మంచు దుప్పటి కప్పుకొన్న కులు, మనాలీ, మిస్సోరీ, కార్బెట్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లడానికి కూడా ఆసక్తి చూపుతున్నారని ట్రావెల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. నగరంలో ఈ టూర్స్‌ బుకింగ్‌ వైవిధ్యంగా ఉందని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ రిలేషన్‌షిప్స్‌ హెడ్‌ కరణ్‌ ఆనంద్‌ అంటున్నారు. ఎక్కువగా యూరోప్‌, యూఎస్‌ఏ లాంటి దేశాలకు కుటుంబాలతో వెళ్తుంటే యంగ్‌ క్రౌడ్‌ మాత్రం థాయ్‌లాండ్‌, మలేషియా, సింగపూర్‌ అంటున్నారు. సదరన్‌ ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధి అజయ్‌ మాట్లా డుతూ సీనియర్‌ సిటి జన్లు చార్‌ధామ్‌ యాత్ర చేయడానికి ఈ వేస వినే వినియోగించు కుంటున్నారని, వైష్ణో దేవి యాత్ర చేసే వారు కూడా నగరం నుంచి ఎక్కువ మంది ఉన్నారని, కైలాస మానస సరోవర్‌ యాత్ర చేసే వారు కూడా ఇక్కడ ఎక్కువే నంటున్నారు.