అందమైన ఈ దేశంలో ఆంక్షలు ఎక్కువే..

బ్రూనై.. దక్షిణాసియాలో ఒక చుక్కలాంటి దేశం. ఈ పేరు వినగానే చాలా మందికి ఎడారులు.. మసీదులతో కూడిన ఒక ముస్లిం దేశం గుర్తుకొస్తుంది. కానీ ఒకసారి బ్రూనైకు వెళ్లి వచ్చిన వారు మాత్రం ఇది అందమైన ప్రదేశంగానే గుర్తుండిపోతుందంటారు. ఇటీవల కాలంలో ఈ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ దేశానికి వెళ్లాలనుకొనే పర్యాటకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో.. తెలుసుకోవాల్సిన విషయాలేమిటో చూద్దాం..

మద్య నిషేధం
బ్రూనై ముస్లిం దేశం కావటంతో అనేక ఆంక్షలు ఉంటాయి. ఉదాహరణకు బ్రూనైలో మద్యం విక్రయించటం, కొనటం నిషిద్ధం. విదేశీయులకు మాత్రం కొన్ని ప్రాంతాల్లో మద్యాన్ని విక్రయిస్తారు. కానీ దానిని బహిరంగ ప్రదేశాలో సేవించకూడదు. సిగరెట్లు అంతే! ఇదే విధంగా బ్రూనైలో ఇస్లాంపై తప్ప ఇతర మతాలపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఉదాహరణకు అక్కడ బహిరంగంగా క్రిస్మస్‌ జరుపుకోకూడదు. బ్రూనైకు వెళ్లే పర్యాటకులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. బహిరంగ స్థలాల్లో మతాలకు సంబంధించిన చర్చలు జరపకపోతే మంచిది. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో కురచ బట్టలు వేసుకొని తిరగటంపైనా నిషేధముంది. బ్రూనైకు వెళ్లే పర్యాటకులు ఈ అంశాలను గమనించాలి.
 
ప్రపంచంలో అతి తక్కువ జన సాంద్రత ఉన్న దేశాల్లో బ్రూనై కూడా ఒకటి. ఈ దేశ జనాభా దాదాపు ఐదు లక్షలు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారు. ఈ గ్రామీణ ప్రాంతాలు కూడా అడవులకు ఆనుకొనే ఉంటాయి. ఎందుకంటే బ్రూనైలో మొత్తం ప్రాంతంలో 80 శాతం అడవులే ఉంటాయి. అందువల్ల అక్కడకు వెళ్లే పర్యాటకులు ఈ పరిస్థితిని గమనించి.. దానికి తగిన విధంగా దుస్తులను ఎంపిక చేసుకుంటే మంచిది.
 
చూడాల్సిన ప్రదేశాలు అనేకం..
బ్రూనై రాజధాని బండార్‌ సేరి బిగావాన్‌లో చూడాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వీటిలో పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సింది సుల్తాన్‌ రాజమందిరం. సుమారు 2 వేల గదులతో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ మందిరంలో కొన్ని భాగాలను చూడటానికి రంజాన్‌ నెలలో సందర్శకులకు అనుమతి ఇస్తారు. ఈ రాజమందిరమే కాకుండా రాజ మసీదు, ఇండిపీరియల్‌ హోటల్‌ వంటివి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. బ్రూనైలో ఆహారపదార్థాలపై పన్నులు ఉండవు కాబట్టి అక్కడ చవకగా దొరుకుతుంది. దీనితో మ్యూరా, బిరాకాస్‌ బీచ్‌ల పక్కన ఉండే బార్‌బెక్యూ రెస్టారెంట్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అయితే ఈ బీచ్‌లలో అర్థనగ్నంగా దుస్తులు వేసుకొని వెళ్లటం నిషేధం.