వియత్నాంలో పొట్టి డ్రెస్సులేయొద్దు

వియత్నాం అనగానే అగ్రరాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన ఒక చిన్న దేశం గుర్తుకొస్తుంది. ఒకప్పుడు యుద్ధంతో అతలాకుతలమైన ఈ దేశం ఇప్పుడు లక్షల మంది టూరిస్టులను ఆకర్షిస్తోంది. అలాంటి దేశంలో ఏం చేయవచ్చో.. ఏం చేయకూడదో తెలుసుకుందాం...

బ్లాగింగ్‌తో ప్రమాదమే
కొందరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ తమ అనుభవాలను బ్లాగ్స్‌ రూపంలో అందరితో పంచుకుంటారు. వీటిలో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్‌ కూడా ఉండవచ్చు. కానీ వియత్నాంలో టూరిస్టులపై ఆ దేశ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచుతుంది. ఎవరైనా టూరిస్టులు ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్‌ను పెడితే వారిని వెంటనే తమ దేశం నుంచి పంపివేస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. అందువల్ల వియత్నాం వెళ్లినప్పుడు... ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్‌ చేయకుండా ఉండటం మంచిది.
 
నైట్‌ క్లబ్‌ల విషయంలో జాగ్రత్త
వియత్నాంలో నైట్‌క్లబ్‌లపై అనేక ఆంక్షలున్నాయి. అంతేకాకుండా వియత్నాంకు చెందిన అమ్మాయిలతో స్నేహం చేయటం.. వారితో సన్నిహితంగా మెలగటం కూడా కొన్ని సార్లు ఇబ్బందుల్లో పడేయొచ్చు. అందువల్ల వియత్నాంలో ఉన్నప్పుడు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి.
 
వస్త్రధారణపై ఆంక్షలు
వియత్నాంలో కురచ డ్రెస్సులు వేసుకోవటం నిషిద్ధం. సాధారణంగా వియత్నంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పొట్టి డ్రెస్సులు వేసుకున్న వారిని స్థానిక అధికారులు గమనిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో విదేశీ పర్యాటకులపై ఆంక్షలు సడలించారు. అయినా వీలైనంత వరకు పద్ధతిగా ఉంటేనే మంచిది.
 
డ్రైవింగ్‌ ఇబ్బందే
వియత్నాంలో అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు చెల్లవు. ఎక్కువ కాలం వియత్నాంలో ఉండాలనుకొనే పర్యాటకులు ఆ దేశ పబ్లిక్‌ వర్క్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వియత్నాంలో ట్రాఫిక్‌ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకూ డ్రైవ్‌ చేయకపోవటమే మంచిది. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ప్రైవేట్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
 
నేరాలు రకరకాలు
వియత్నాంలో తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. బిజీగా ఉన్న మార్కెట్లలోకి వెళ్లినప్పుడు పర్సులు, డబ్బులు- జేబు దొంగల బారిన పడకుండా చూసుకోవాలి. చాలా సందర్భాల్లో ఇలాంటి కేసులను క్రిమినల్‌ చర్యలుగా కాకుండా సివిల్‌ లిటిగేషన్లుగా పరిగణిస్తారు. అటువంటి సమయంలో కొన్ని సార్లు పర్యాటకులు కూడా కోర్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది.
 
సంప్రదాయాలకు ప్రాధాన్యం
వియత్నాంలో స్థానికులు సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎవరైనా ఇంటికి వెళ్లినప్పుడు చెప్పులు లేదా షూస్‌ విప్పి మాత్రమే లోపలకు వెళ్లాలి. అదే విధంగా ప్రార్థనా స్థలాల్లోనూ అమలులో ఉన్న ఆచారాలను పాటించాలి.