మధ్యాహ్నం నిద్రించే దేశం.. స్పెయిన్‌

ఆంధ్రజ్యోతి, 17-04-2018: చుట్టూ సముద్రం.. ఒక పక్కన ఫ్రాన్స్‌.. మరోపక్క పోర్చుగల్‌, మొరాకో భూసరిహద్దులుగా కలిగిన దేశం స్పెయిన్‌. టాలీవుడ్‌ చిత్రాల నిర్మాణానికి గమ్యంగా మారిన దేశం కూడా. పైకి దేశంగా ఉన్నా.. 17 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలున్నాయిక్కడ. మనదేశంలో రాష్ట్రానికి రాష్ట్రానికీ మధ్య సంస్కృతి, సంప్రదాయాల్లో ఎక్కువగా తేడా కనపడుతుంది. కానీ స్పెయిన్‌లో ఊరికి ఊరికీ మధ్య కూడా తేడా ఎక్కువగా ఉంటుంది. మిగతా పర్యాటకుల సంగతేమోగానీ.. ఆహారప్రియులకు మాత్రం స్పెయిన్‌ స్వర్గం లాంటిది. ఇంకా ఆ దేశం గురించిన బోలెడన్ని విశేషాలు..
 

 ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ లాగా స్పానిష్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష. కానీ.. స్పెయిన్‌వాసుల్లో చాలామందికి స్పానిష్‌ మాతృభాష కాదు. రెండో భాష. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఉదాహరణకు.. బార్సిలోనా వాసుల్లో మెజారిటీ ప్రజల మాతృభాష కాటలాన్‌. శాన్‌సెబాస్టియన్‌వాసుల మాతృభాష బాస్క్‌. కానీ, అందరూ స్పానిష్‌ మాట్లాడతారు. ఆ సంగతి పక్కన పెడితే స్పెయిన్‌లో ఇంగ్లిష్‌ పెద్దగా మాట్లాడరు. అర్థం చేసుకోలేరు. కాబట్టి స్పెయిన్‌లో పర్యటించాలనుకుంటే కొన్నయినా స్పానిష్‌ పదాలు నేర్చుకోవాల్సిందే.

 చాలా పాశ్చాత్య దేశాల్లాగా స్పెయిన్‌ చల్లగా ఉండదు. బాగా వేడిగా ఉంటుంది. సమ్మర్‌లో మరీను. అచ్చం మన తెలుగు రాష్ట్రాల్లాగా 40 డిగ్రీల దాకా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి ఎండాకాలంలో (జూలై-ఆగస్టు) వెళ్లకుండా జాగ్రత్తపడటం చాలా మంచిది.

 భారతదేశంలోలాగానే స్పెయిన్‌లో భిన్నత్వం ఎక్కువ. అక్కడ 17 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుంటాయి. ఒక్కో ప్రాంతానిదీ ఒక్కో సంస్కృతి, సంప్రదాయం. అచ్చంగా మన దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో తరహాలో ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది అక్కడ పర్యటిస్తుంటే.

 ముందే చెప్పుకొన్నట్టు స్పెయిన్‌ ఆహార ప్రియుల స్వర్గధామం. అక్కడి ఆహారం.. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైనదని ఆహారప్రియులు లొట్టలేస్తూ చెబుతారు. రుజువులు కావాలా? అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ రెస్టారెంట్‌ ఎల్‌ సెలర్‌ డి కాన్‌ రోకా స్పెయిన్‌లోనే ఉంది. అలాగే.. ప్రపంచంలోనే 6, 13, 17 అత్యుత్తమ రెస్టారెంట్లు కూడా అక్కడే ఉన్నాయి. వెళ్తే మాత్రం ఆ రెస్టారెంట్లలో తిని తీరాల్సిందే.

 స్పెయిన్‌వాసులకు మధ్యాహ్నం నిద్ర (సియెస్టా) తప్పనిసరి. బార్సిలోనా, మాడ్రిడ్‌లాంటి అంతర్జాతీయ నగరాల్లో తప్ప.. స్పెయిన్‌ అంతటా మరే పర్యాటక ప్రదేశానికి వెళ్లినా మధ్యాహ్నం 2-4 గంటల మధ్య దుకాణాలన్నీ బంద్‌. తలుపులు బిడాయించి ఎంచక్కా నిద్రపోతారు. షాపింగ్‌ చేయాలనుకునేవారు దీ న్ని గుర్తుంచుకుం టే మంచిది.