దక్షిణ కొరియాలో ఏడాదంతా పండుగలు

 

దక్షిణ కొరియా అనగానే చాలా మందికి కంప్యూటర్లు, టీవీల టెక్నాలజీ ప్రపంచమే గుర్తుకొస్తుంది. వీటితో పాటుగా దక్షిణ కొరియాలో అపారమైన ప్రకృతి సంపద కూడా ఉంది. అక్కడకు వెళ్లిన పర్యాటకులు అక్కడ ప్రకృతి, సంస్కృతి సంప్రదాయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. కొరియాలో రకరకాల గార్డెన్లు ఉంటాయి. వాటిలో ఏడాది పొడుగునా ఏదో ఒక ఫెస్టివల్‌ జరుగుతూనే ఉంటుంది. బటర్‌ఫ్లై ఫెస్టివల్‌ నుంచి మడ్‌ ఫెస్టివల్‌ దాకా అనేకం జరుగుతాయి. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకుల కోసం అక్కడి టూరిస్టు కంపెనీలు వీటికి సంబంధించి ప్రత్యేకమైన టూర్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి!

అవి తినాల్సిందే..
 
జపాన్‌ సుషి, మంగోలియా బార్బెక్యూ, చైనీస్‌ నూడిల్స్‌- ఇలా రకరకాల ఆహార పదార్థాలు ప్రపంచంలో ప్రసిద్ధి చెందాయి. కొరియాకు అలాంటి ఆహారం ఏది లేకపోవచ్చు కానీ కొరియా వెళ్లిన వాళ్లందరూ అక్కడ స్థానికంగా దొరికే ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి. కొరియన్‌ ఆహారం చూడటానికి అంత బావుండదు కానీ తింటే చాలా బావుంటుందని ఫుడీలు అంటూ ఉంటారు. ఇక కొరియాకు వెళ్లిన మద్యపానప్రియులు అక్కడ దొరికే సోజు (బియ్యంతో తయారు చేసే బీరు)ను తప్పనిసరిగా తాగుతారు. దాంట్లో 20 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. కొరియాలో ఎక్కడకు వెళ్లినా సోజు బార్స్‌ కనిపిస్తాయి.
 
సంప్రదాయాలు పాటించండి..
కొరియా ప్రజలు తమ సంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారు. వాటిని ఎవరు పాటించకపోయినా చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. ఉదాహరణకు కొరియాలో అరచేయి పైకి కనిపించేలా సైగ చేస్తే అవమానంగా భావిస్తారు. అందువల్ల వీలైనంత వరకూ అరచేతి ద్వారా సైగలు చేయకుండా ఉంటేమంచిది. కొరియాలో వృద్ధులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. బస్సుల్లో మొదటి సగ భాగంలో వారికే సీట్లు కేటాయిస్తారు. వాటిలో ఇతరులు కూర్చుంటే అవమానంగా భావిస్తారు. అలాగే.. కొరియాలోని రెస్టారెంట్‌లలో టిప్‌లను ఇవ్వటం సంప్రదాయం కాదు. టిప్పులు ఇవ్వొద్దంటూ బోర్డులు పెడతారు.
 
- స్పెషల్‌ డెస్క్‌