పెద్ద మనసున్న చిన్న దేశం

కృషి, పట్టుదలతో మిగులు బడ్జెట్‌..

బోనస్‌గా ప్రజలకు పంచిన సర్కారు
 
దేశం చూస్తే చాలా చిన్నది.. అదీ ఓ ద్వీపం... అంతా కలిపి 278 చదరపు మైళ్లు దాటదు! జనాభా కేవలం 56 లక్షలు.. ఇంచుమించుగా హైదరాబాద్‌లో సగం జనాభా!! కానీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందీ ఆగ్నేయాసియా దేశం. బడ్జెట్‌లో మిగులును.. ప్రజలకు బోన్‌సగా ఇస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది? ఏంటి వారి జీవన ప్రణాళిక? సింగపూర్‌ స్వేచ్ఛా వాణిజ్యానికి పెట్టింది పేరు. అవినీతి, ఆంక్షల రహితం. వ్యాపార అనుకూలం. అందుకే సింగపూర్‌ వైపు అనేక ప్రపంచ కంపెనీలు దృష్టి సారించాయి. ఉభయులకూ లాభదాయకమైన రీతిలో ఉండాలన్న లక్ష్యంతో- స్థానిక పౌరులకు అంటే సింగపూర్‌ యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలు ఉంటాయి. అందుకే సింగపూర్‌లో నిరుద్యోగం కేవలం 3 శాతం మాత్రమే..
 

అదే సమయంలో తాజా లెక్కల ప్రకారం ఉపాధి కల్పన రేటు మాత్రం 80శాతం నుంచి 81.8 శాతానికి పెరగడం విశేషం. వారి బడ్జెట్‌ ప్రణాళిక కూడా కేవలం ఒక్క సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని జరగదు. వచ్చే 10 నుంచి పాతిక సంవత్సరాల కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. అందుకు అనుగుణంగా పన్నులు విధిస్తారు. కాబట్టి సింగపూర్‌లో పన్నులు ఎక్కువ. ప్రతీ దానికీ పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆ దేశ ఆర్థికరథాన్ని నడిపేది పన్నులే.. అదే సమయంలో జీతాలు, సబ్సిడీలు కూడా తదనుగుణంగానే ఉంటాయి. ఇలా ఎన్నో... అంశాలు సింగపూర్‌ ఆర్థికవృద్ధికి దోహదం చేస్తున్నాయి.

రెండురోజుల క్రితం సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ వార్త ప్రపంచాన్ని అబ్బురపర్చింది. 2017-18లో 10 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర బడ్జెట్‌లో మిగులొచ్చిందనీ, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలో 21 ఏళ్లు దాటిన ప్రతీ వ్యక్తికీ బోనస్‌ (నగదు) ఇవ్వాలని నిర్ణయించామని సింగపూర్‌ ఆర్థికమంత్రి హెంగ్‌ స్వీ కీట్‌ దేశ పార్లమెంట్‌లో- 2018 బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రకటించారు. నిజంగా ఇది అద్భుతమే. ఎందుకంటే ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఎప్పుడూ లోటు బడ్జెట్లు. అప్పుల కుప్పలే తప్ప మిగులంటూ ఉండదు.
 
అలాంటిది సింగపూర్‌ దీన్నెలా సాధించగలిగింది? ఆ దేశ ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం ప్రకారం.. ఈ విజయానికి కారణం సింగపూర్‌ ప్రజలే. ఉద్యోగుల, కార్మికుల విశేష శ్రమ వల్లనే అద్భుతమైన ఈ ప్రగతి సాధ్యమయ్యింది. ‘సింగపూర్‌ జీడీపీ 2.4 శాతం నుంచి 3.6 శాతానికి పెరిగింది.. ఇది ప్రభుత్వ లక్ష్యం కంటే ఎక్కువ. ఉత్పత్తి 2010 తర్వాత అతి ఎక్కువగా 4.5 శాతం మేర పెరిగింది. ఈ పెరుగుదల వల్ల కంపెనీలు తమ ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వగలగడంతో పాటు పోటీలో కొనసాగగలుగుతున్నాయి. పూర్తి స్థాయి ఉద్యోగుల వేతనం 5.3 శాతం మేర పెరిగింది. అన్ని రంగాల్లో వృద్ధి పెరిగేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ (ఎంటీఐ) చేసిన కృషి ఫలించింది’ అని ఆయన వివరించారు. సింగపూర్‌లో దాదాపు 66 చట్టబద్ధ ప్రభుత్వ సంస్థలు.. అంటే మనదేశంలో ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, కార్పొరేషన్ల లాంటివి ఉన్నాయి. మెజారిటీ ప్రజలు వాటిలోనే పనిచేస్తారు. వాటి ద్వారా 2017-18లో దాదాపు 7.6 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి వచ్చిన స్టాంప్‌ డ్యూటీ ఆదాయం 2 బిలియన్‌ డాలర్లు.. వెరసి 9.6 బిలియన్‌ డాలర్ల మిగులు.
 
ఎక్కువమంది ప్రభుత్వ ఇళ్లలోనే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్‌ది ఏడో స్థానం. ఆసియా ఖండంలో చూస్తే దీనిది ఐదో స్థానం. విలాస జీవనం పెద్దగా సాధ్యపడదు. సింగపూర్‌లో భూభాగం చాలా తక్కువ కాబట్టి సొంతంగా ఇళ్లు కట్టుకోవడం సాధ్యం కాదు. 80ు మంది సింగపూర్‌వాసులు ప్రభుత్వం రాయితీ మీద ఇచ్చే ఇళ్లలోనే ఉంటారు. ఇల్లు కొనాలంటే లక్ష డాలర్ల పైనే పెట్టాలి. అది కూడా నిర్దిష్ట కాలం వరకే! ఒంటరిగా ఉండేవారికి ఇల్లు కొనడానికి అనుమతి ఇవ్వరు. 35 ఏళ్లు దాటిన వారికే కొనే హక్కు. ఈ సమస్యలేవీ వద్దనుకుంటే.. 400 డాల ర్లు చెల్లిస్తే నగరం మధ్యలో సింగిల్‌ బెడ్రూం ఫ్లాట్‌ వస్తుంది. దానిలో హాయిగా అద్దెకు ఉండవచ్చు.
 
ప్రైవేట్‌ కార్లకు స్వస్తి
సింగపూర్‌లోని మొత్తం భూభాగంలో 12 శాతం మేర రోడ్లు ఉంటాయి. వీటిపై అటు ప్రభుత్వ వాహనాలు, అత్యవసర వాహనాలు, రైళ్లు, బీఆర్‌టీఎస్‌.. ఇంకా ఎన్ని పడతాయి? అందుకే దీన్ని నియంత్రించాలని భావించారు. 2016లో అక్కడ ఆరు లక్షల ప్రైవేటు కార్లుండగా.. ఆ సంఖ్య పెరగడానికి వీల్లేకుండా కఠినమైన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. వాటి ప్రకారం సింగపూర్‌లో కారు కొనడం తలకు మించిన పని. కారు ఖరీదు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్‌తో పాటు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ (అంటే వాహనం నడపడానికి అనుమతినిచ్చే పత్రం) తప్పనిసరి. ఈ సర్టిఫికెట్‌ పొందాలంటే 50,000 డాలర్లు చెల్లించాలి.
 
ఇది కూడా పదేళ్ల పాటే చెల్లుతుంది. ఆఫీసులకు వెళ్లాలన్నా, బయటి పనుల మీద తిరగాలన్నా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును మాత్రమే వాడాలి. దీనికి తోడు ఈ ఏడాది నుంచి కార్బన్‌ టాక్స్‌ ఒకటి చేరింది. గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం ఈ టాక్స్‌ విధించింది. అందుకే సింగపూర్‌లో సైకిల్‌ వాడకం ఎక్కువ. హోదాతో నిమిత్తం లేకుండా అనేకమంది సైకిళ్ల మీదే ఆఫీసులకు వెళతారు. వేల మంది పెట్రో వాహనాలను త్యజించడం వల్ల కాలుష్యం తగ్గడంతోపాటు.. ఇంధనం ఖర్చులు తగ్గి ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతోంది.
 
ఎలా సాధ్యం?
సింగపూర్‌ ఓ నియమబద్ధ దేశం. అక్కడ ఉన్నంత క్రమశిక్షణ, రుజువర్తన చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నేతా గణంలో అవినీతి మచ్చుకైనా కానరాదు. ప్రజలూ అంతే! వ్యాపార దృక్పథం మెండు. సాంకేతికతను అభివృద్ధి చేయడంలో, పోటీపడడంలో వారికి వారే సాటి. తమకున్న ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకునే నైపుణ్యం వారికి ఎక్కువ.
 
కష్టే ఫలి
సింగపూర్‌ వాసుల జీవనశైలి కూడా ఆర్థిక పురోగతికి దోహదపడిందని చెప్పవచ్చు. ప్రజలు కష్టపడి పనిచేస్తారు. సింగపూర్‌లో స్వాతంత్య్రం ఉన్నా పూర్తి స్వేచ్ఛ దక్కదు. చాలా ఆంక్షలుంటాయి. సైకిల్‌ తొక్కాలన్నా నిర్దిష్టమైన రోడ్లపై.. అదీ మార్కింగ్‌ ఉన్న ప్రాంతంలోంచే వెళ్లాలి. ఆ నిబంధన అతిక్రమిస్తే 1000 డాలర్లు జరిమానా కట్టాలి. చూయింగ్‌ గమ్‌, పాన్‌ మసాలా లాంటివి తిని రోడ్లపై ఉమ్మేయడం కుదరదు. సింగపూర్‌లో పనిమనుషులు చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం దాదాపు 2 లక్షల మందికి పైనే ఉంటారు.. మలేషియా, తమిళనాడు నుంచి వచ్చినవారు ఎక్కువమంది. పోటీతత్వం ప్రజల్లో ప్రతి ఒక్కరి నరనరాన ఉంటుంది. డిగ్రీ తప్పనిసరి. చదువు పూర్తయ్యాక ఎంప్లాయ్‌మెంట్‌ సెంటర్‌లో నమోదు చేయించుకోవాలి. వారి వారి ప్రతిభను బట్టి- డిగ్రీని బట్టి కొద్దికాలంలోనే ఉద్యోగం వస్తుంది. కంపెనీలు కూడా పోటీతత్వాన్ని పెంచుతాయి. అందుకే అక్కడ కంపెనీల వృద్ధి ఎక్కువ.
 
దేశమంతా డిజిటలే..
కృత్రిమ మేధపై సాగుతున్న అధ్యయనానికి చాలా దేశాలు సింగపూర్‌ను ఎన్నుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉండడం, దానికి ప్రభుత్వ తోడ్పాటు ఇతోధికంగా అందడమే ఇందుకు కారణం. కృత్రిమ మేధ డేటా సెంటర్‌ కోసం ప్రభుత్వం 150 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కేటాయించింది. ఇక దేశమంతా డిజిటలే.. బ్యాంకులన్నీ డిజిటల్‌ లావాదేవీలే చేపడతాయి. ఐటీ లేని విభాగం అంటూ కానరాదు. స్వయం సేవా కియో్‌స్కలు, డిజిటల్‌ తాళాలు, స్మార్డ్‌బెడ్‌లు.. అంతటా సాంకేతిక పరిజ్ఞానమే. ఇవన్నీ పనిలో నాణ్యత పెంచడమే కాక డబ్బు ఆదా చేస్తున్నాయి.. మానవ వనరులను ఇతరత్రా వినియోగించడానికి దోహదం చేస్తున్నాయి. ఇన్నోవేషన్‌, నైపుణ్య శిక్షణ, సాంకేతికత, వాణిజ్య దృక్పథం పెంపు.. మొదలైన వాటిపై ఎక్కువ ఫోకస్‌ పెట్టి- యువతను ఆ దిశగా మళ్లించడం ద్వారా సింగపూర్‌ ప్రభుత్వం తమ దేశాభివృద్ధిని పరుగులు తీయిస్తోంది.