ఆ అందాల ద్వీపంలో వేడి ఎక్కువే!

ఆంధ్రజ్యోతి, 24-04-2018: ఎటు చూసినా అందమైన ఇసుక తిన్నెలు.. సముద్రం మధ్యలో అందమైన చుక్కలాంటి దీవి. ఈ దృశ్యాన్ని అనేక తెలుగు సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ దృశ్యం ఉన్న దేశమే షీషెల్స్‌. తూర్పు ఆఫ్రికాలో 151 ద్వీపాల సమూహమైన ఈ దేశానికి వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.

షీషెల్స్‌లో వాతావరణం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. కొన్ని నెలలు విపరీతమైన ఎండ ఉంటుంది. మరికొన్ని నెలలు చల్లగా ఉంటుంది. అందువల్ల షీషెల్స్‌కు వెళ్లే పర్యాటకులు తమ ప్రాథమ్యాలను ముందే నిర్ధారించుకోవటం మంచిది. అందమైన బీచ్‌లలో ఈత కొట్టాలనుకొనేవారు ఏప్రిల్‌ లేదా నవంబరు మాసాలు, అలలపై సర్ఫ్‌ చేయాలనుకొనేవారికి మే లేదా సెప్టెంబరు మంచివి. ప్రకృతి ప్రేమికులు మే నెలలో వెళ్తే బాగుంటుంది. షీషెల్స్‌లో విపరీతమైన వేడి ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు సముద్రస్నానం చేయకూడదు. వేడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయు కాబట్టి అవసరమైన మందులను వెంట తీసుకువెళ్లాలి.
 
షీషెల్స్‌లో విదేశీ మారక ద్రవ్యానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. షీషెల్స్‌ కరెన్సీ విలువ తక్కువ కావటంతో అది ప్రతి రోజూ మారుతూ ఉంటుంది. అందువల్ల అక్కడకు వెళ్లే పర్యాటకులు తమ వద్ద ఉన్న కరెన్సీని ప్రభుత్వ అధీకృత బ్యాంకుల్లోనే మార్చుకోవటం మంచిది. ప్రభుత్వం అనుమతించిన హోటళ్లలోనే బస చేయడం మంచిది. ప్రైవేట్‌ హోటళ్లలో మోసాలు జరిగే అవకాశముంది.
 
షీషెల్స్‌లో సముద్ర తీరంలో రాళ్లను, గవ్వలను ఏరి తీసుకురావటం నిషిద్ధం. ఒక వేళ వాటిని ఏరి బ్యాగుల్లో పెట్టుకున్నా.. ఎయిర్‌పోర్టులో వాటిని బయటకు తీసే అవకాశముంది. అందువల్ల అందమైన రాళ్లను తీసుకోవాలనుకునేవారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఇదే విధంగా కొన్ని రకాలైన పువ్వులను కూడా పర్యాటకులు బయటకు తీసుకెళ్లకూడదు.
- స్పెషల్‌ డెస్క్‌