అందమైన తీరం.. పసందైన ఆహారం

ప్రపంచంలో అందమైన దేశాల్లో పోర్చుగల్‌ ఒకటి. 1139 నుంచి సరిహద్దులు మారకుండా యూర్‌పలో తన అస్థిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఈ దేశానికి వెళ్లాలనుకొనే పర్యాటకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.. పోర్చుగల్‌కు వెళ్లిన వారు తప్పనిసరిగా చూడాల్సినవి అక్కడ బీచ్‌లు. దాదాపు 750 కిలోమీటర్ల కోస్తా తీరం ఉన్న ఈ దేశంలో బీచ్‌లు సర్ఫింగ్‌కు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. అమెరికా, ఇతర దేశాల నుంచి ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది యాత్రీకులు కేవలం సర్ఫింగ్‌ కోసమే ఈ దేశానికి వస్తారు. అసలు అలవాటు లేకుండా సర్ఫింగ్‌ చేయటానికి ప్రయత్నించటం శ్రేయస్కరం కాదు. కొన్ని బీచ్‌లలో అలలు చాలా వేగంగా వస్తూ ఉంటాయి. పరిస్థితులను గమనించి సర్ఫింగ్‌ చేయటానికి ప్రయత్నించటం మంచిది.

ఫుడ్‌, వైన్‌లకు ప్రసిద్ధి
ప్రపంచంలో అత్యంత రుచికరమైన పదార్థాలు పోర్చుగల్‌లో దొరుకుతాయి. ఫ్రాచింనా, ఎన్‌చిడోస్‌ వంటి పదార్థాలను కేవలం పోర్చుగీస్‌లోనే తినాలి. రుచికరమైన ఆహారపదార్థాలు మాత్రమే కాకుండా వైన్‌లకు పోర్చుగీస్‌ ప్రసిద్ధి. అక్కడకు వెళ్లిన వారు వైన్‌లను తప్పనిసరిగా రుచి చూడాల్సిందే!
 
హైహీల్స్‌ వద్దు
పోర్చుగీస్‌లోని చాలా పట్టణాల్లో ఫుట్‌పాత్‌లు ఎగుడుదిగుడుగా ఉంటాయి. సాధారణంగా వీటిని స్థానికంగా దొరికే రాళ్లతో నిర్మిస్తారు. అందువల్ల హైహీల్స్‌ వేసుకొని వెళ్తే పర్యాటకులు ఇబ్బంది పడే అవకాశముంది. ఇక వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే- మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ విపరీతమైన వేడి ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది. పోర్చుగల్‌లో ఎలక్ట్రిక్‌ కారు సర్వీసులు చాలా బావుంటాయి. అందువల్ల వీలైనంత వరకూ వాటిల్లో తిరగడమే మంచిది. దీని వల్ల తక్కువ ఖర్చు అవుతుంది.
 
స్పానిష్షే అనుకోవద్దు
పోర్చుగీసు, స్పానిష్‌ భాషలు వినటానికి ఒకే రకంగా ఉంటాయి. అందువల్ల చాలా మంది పోర్చుగల్‌లో మాట్లాడేది స్పానిష్‌ అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. పోర్చుగీస్‌ పౌరులు తమ భాషను చాలా గౌరవిస్తారు. అందువల్ల వారితో- ‘మీరు మాట్లాడేది స్పానిష్షా?’ అని అడిగితే ఇబ్బంది పడతారు. అందువల్ల భాష విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.