ప్రకృతిని గౌరవించే దేశం మంగోలియా!

చైనా, రష్యా సరిహద్దులుగా ఉన్న ఒక చిన్న అందాల దేశం మంగోలియా. ఈ దేశం పేరు చెప్పగానే చాలా మందికి ప్రపంచాన్ని గడగడ వణికించిన చెంఘిజ్‌ఖాన్‌ గుర్తుకు వస్తాడు. కొండల్లో చిన్న చిన్న ఇళ్లు.. వాటిలో రంగు రంగుల బట్టలు కట్టుకొని నివసించే ప్రజలు.. రేసు గుర్రాలు గుర్తుకొస్తాయి. అలనాటి రాజులు, రాజ్యాలు పోయినా- ఆ నాటి సంస్కృతి సంప్రదాయాలను ఆ దేశ ప్రజలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అలాంటి మంగోలియా విశేషాలేమిటో చూద్దాం.

అన్ని పల్లెలే!
మంగోలియాలో అతి పెద్ద నగరం ఉల్లాన్‌ బాటర్‌. ఇదే ఆ దేశ రాజధాని. ఇక్కడ కొంత పట్టణ వాతావరణం కనిపిస్తుంది.. కానీ మిగిలిన ప్రాంతాలలో పల్లె వాతావరణమే ఉంటుంది. ఇక్కడి ప్రజలు తాము అనుసరించే సంప్రదాయాలను పర్యాటకులు కూడా పాటించాలని భావిస్తూ ఉంటారు. అందువల్ల మంగోలియా వెళ్లే ముందు కొన్ని సంప్రదాయాలను తెలుసుకోవటం మంచిది. మంగోలియాలో ఎవరూ ఇంటి గుమ్మంలో నిలబడి మాట్లాడకూడదు. ఎవరైనా అలా మాట్లాడితే అది అమంగళమైనది అని అక్కడి ప్రజలు భావిస్తారు. అదే విధంగా ప్రతి ఇంట్లోను ఒక పొయ్యి ఉంటుంది. ఈ పొయ్యి ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇది పగలు వంట చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.
 
రాత్రి చలి నుంచి కాపాడుతుంది. సాధారణంగా ఇక్కడ ఇళ్లన్నీ ఈ పొయ్యి చుట్టూ వృత్తాకారంలో కడతారు. తమకు ఇంత మేలు చేసే పొయ్యిలో పొరపాటున కూడా నీళ్లు పడనివ్వరు. ఎవరైనా దానిలో నీరు పోస్తే అది అరిష్టమని నమ్ముతారు. అందువల్ల మంగోలియాలో పర్యాటకులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటుగా అక్కడి ప్రజలు ప్రకృతిని ఎంతో ఆరాధిస్తారు.. పూజిస్తారు. నీరు, పాలు వంటివి తమకు దేవుడు ప్రసాదించినవని నమ్ముతారు. అందువల్ల చెరువులు, నీటి ప్రవాహాల పక్కన మలమూత్ర విసర్జన చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ విషయంలో పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
-స్పెషల్‌ డెస్క్‌