క్రమశిక్షణకు మారుపేరు జర్మనీ!

ఆంధ్రజ్యోతి, 10-04-2018: జర్మనీ అనగానే కొందరికి కార్లు గుర్తొస్తాయి. ఇంకొందరికి రెండో ప్రపంచ యుద్ధం.. హిట్లర్‌ జరిపిన దారుణ మారణకాండ గుర్తొస్తాయి. చాలా మందికి క్రమశిక్షణతో మెలిగే ఒక దేశం గుర్తుకొస్తుంది. అలాంటి దేశానికి వెళ్తే ఏం చేయాలో? ఏం చేయకూడదో తెలుసుకుందాం..
 
జర్మనీ ప్రజలకు క్రమశిక్షణ ఎక్కువ. రోడ్డును దాటానికి గ్రీన్‌లైట్‌ వచ్చేదాకా ఓపిగ్గా ఎదురుచూస్తారు. ఒకవేళ ఎవరైనా ఎర్రలైటు ఉన్నప్పుడు రోడ్డును దాటానికి ప్రయత్నిస్తే 5 యూరోల జరిమా నా విధిస్తారు. అలాగే, జర్మనీలో ప్రతి చోటా సైకిళ్ల కోసం ప్రత్యేక లైన్లు ఉంటాయి. ఆ లైన్లలో నడవకూడదు. జర్మనీలో బస్సులు లేదా రైళ్లు ఎక్కే ముందు టిక్కెట్లు చెక్‌ చేయరు. బస్సు ఎక్కిన తర్వా త తనిఖీ స్క్వాడ్‌లు వస్తాయి. అందువల్ల టిక్కెట్లు కొనకుండా బస్సులు లేదా ట్రైన్‌లు ఎక్కకూడదు.
 
రీసైక్లింగ్‌ ఎప్పటి నుంచో..
ప్రపంచంలో వ్యర్థాల సమస్యను గుర్తించి.. రీసైక్లింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. జర్మనీలో ప్రతి ఇంట్లోను తడి, పొడి వ్యర్థాలను విడిగా వేస్తారు. బహిరంగ ప్రదేశాల్లోనూ చెత్త బుట్టలు కనిపిస్తాయి. అందువల్ల చెత్త పడవేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గాజు వ్యర్థాల విషయంలో జర్మనీలో రూల్స్‌ భిన్నం గా ఉంటాయి. మనం కొనే ప్రతి బాటిల్‌పైన కొన్ని యూరోలను అదనంగా తీసుకుంటారు. ఆ సీసాలను తిరిగిస్తే సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. ఈ పద్ధతి దేశమంతా అమలులో ఉంటుంది.
 
నాజీ సెల్యూట్‌ చేస్తే జైలుకే!
రెండో ప్రపంచయుద్ధం తర్వాత నాజీల విషయంలో జర్మనీ చాలా కఠినంగా ఉంటోంది. నాజీలకు సంబంధించిన చిహ్నాలు, వారి అలంకారాలు.. వారి సెల్యూట్స్‌ను నిషేధించింది. ఎవరైనా నాజీ సెల్యూట్‌ చేస్తే వారిని జైలులో పెడతారు.
 
నిశబ్ద సమయాలు..
జర్మనీలో ప్రజలు శబ్ద కాలుష్యాన్ని సహించరు. ఆదివారాలు పెద్ద మ్యూజిక్‌ పెట్టినా, గోడకు మేకు లు డ్రిల్‌ చేసినా సహించరు. ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేస్తే పబ్లిక్‌ ఆర్డర్‌ అధికారులు జరిమానా విధిస్తారు. అందువల్ల పర్యాటకులు హోటళ్లలో ఎక్కువ శబ్దాలు చేయకుండా ఉంటే మంచిది.
 
- స్పెషల్‌ డెస్క్‌