సహజ నిక్షేపాల సిరి.. బ్రూనై

అదో చిన్న దేశం. అతి సంపన్న దేశం. ఆ రాజు ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆ దేశంలో ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలు అపారం. ఆ దేశం ఏంటో తెలుసా?

బ్రూనై... ఒక చిన్నదేశం. ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న దేశం. దక్షిణ చైనా సముద్రం తీరంగా ఉన్న ఈ దేశం పూర్తి పేరు బ్రూనై దారుస్సలాం. 
 ఈ దేశం సుల్తాన్‌ హసన్నల్‌ బొల్కియా పరిపాలనలో ఉంది. బ్రూనై సుల్తాన్‌కు ప్రపంచంలోని ధనికుల్లో ఒకరిగా పేరుంది.
 ఇక్కడి ప్రజలు ట్యాక్సులు చెల్లించడం ఉండదు. అభివృద్ధి పనులను ప్రభుత్వమే చూసుకుంటుంది. 2014లో ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. నేరాలు చేస్తే కఠినమైన శిక్షలుంటాయి. పబ్లిక్‌గా మద్యం అమ్మడం, సేవించడం నేరం.
 ఇక్కడి జనాభా 5 లక్షలకు మించదు. విద్య, వైద్యం, పౌరుల కోసం అయ్యే ఇతర ఖర్చులను సుల్తాన్‌ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక్కడున్న అపారమైన ఆయిల్‌, గ్యాస్‌ సహజ నిలువల వల్ల ఈ దేశాన్ని ‘షెల్‌ఫేర్‌’గా పిలుస్తారు. 2200 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన ఈ దేశాన్ని 600 ఏళ్లుగా ఒకే కుటుంబం పాలిస్తోంది. 
 మలయ్‌, ఇంగ్లీష్‌, చైనీస్‌ భాషలను మాట్లాడతారు. అధిక శాతం ముస్లింలుంటారు. కొద్దిశాతంలో క్రిస్టియన్లు, బౌద్ధమతాన్ని ఆచరించే వాళ్లు ఉన్నారు. ఇక్కడి పిల్లల్లో ఊబకాయం శాతం ఎక్కువ. 20 శాతం మంది పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నట్లు అంచనా.
 సొంత కార్లు కలిగి ఉన్న వారి శాతం ఎక్కువే. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కారు ఉంటుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన రోల్స్‌ రాయిస్‌ కారును బ్రూనై సుల్తాన్‌ ఉపయోగిస్తారు. సుల్తాన్‌ ప్రధానమంత్రిగానూ, ఆర్థికమంత్రిగానూ, రక్షణమంత్రిగానూ సేవలందిస్తారు.
 ఈ దేశ రాజధాని ‘బందర్‌ సెరి బెగావన్‌’. ఈ నగర జనాభా 50 వేలు. ఇక్కడి రోడ్లు, నిర్మాణాలు అద్భుతంగా ఉంటాయి.
 ప్రపంచంలో న్యాచురల్‌ గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తోన్న నాలుగో దేశం బ్రూనై. క్రూడాయిల్‌, న్యాచురల్‌ గ్యాస్‌ను ఎగుమతి చేస్తుంది.
కరెన్సీ : బ్రూనై డాలర్‌
అధికార భాష : మలయ్‌