బర్మా.. రెండో ‘తెలుగు గడ్డ’

అక్కడ మనవారు ‘మూన్‌’లు సామాజిక, సాంస్కృతిక నిర్మాతలు తెలుగువారే బీటీఏ సలహాదారు నాయుడు వెల్లడి

కష్టాలను సైతం అవకాశాలుగా మలచుకుని ఎక్కడ ఉన్నా అల్లుకుపోవడం తెలుగువారి ప్రత్యేకత. ఒకప్పటి బర్మా.. నేటి మయన్మార్‌లో సామాజిక, సాంస్కృతిక నిర్మాతలుగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగువారేఇందుకు నిదర్శనం. ఉపాధి కోసం బర్మాకు వలస వెళ్లిన తెలుగువారు అక్కడ తమ బతుకుదెరువుకు బాటలు వేసుకున్నారు. అందుకే దాన్ని రెండో ‘తెలుగు గడ్డ’గా వర్ణిస్తున్నారు బర్మా తెలుగు అసోసియేషన్‌ (బీటీఏ) సలహాదారు ఎర్రానాయుడు అలియాస్‌ బర్మా నాయుడు. ఇటీవల ఆయన విజయవాడకు వచ్చారు. బర్మాలోని తెలుగు వారి జీవన విధానాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 
దేశం నలుమూలల నుంచి ఎంతోమంది బర్మాకు వలస వెళ్లారుగానీ.. వారిలో ఎవరికీ లేని గుర్తింపు తెలుగువారికే దక్కింది. బర్మాలోని రంగూన్‌, మాల్‌మేన్‌, కటోన్‌, దై వంటి ప్రాంతాల నిర్మాణంలోనే కాదు సామాజిక, సాంస్కృతిక నిర్మాణంలోనూ తెలుగువారి పాత్ర ఉంది. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువమంది బర్మాకు వలసవెళ్లారు. బ్రిటీష్‌ పాలన ఉన్నప్పుడు 15 లక్షల మంది ఉన్న తెలుగువారి సంఖ్య 1962లో మిలటరీ పాలన ఆరంభమయ్యాక 2 లక్షలకు పడిపోయింది. దేశంకాని దేశంలో ఉంటున్నా.. మన ఆచార వ్యవహారాలను మాత్రం మనవాళ్లు చెక్కు చెదరకుండా కాపాడుకున్నారు. వివిధ అమ్మవార్ల ఆలయాలను నిర్మించారు. మనవారిని మొదట్లో తలాయ్‌అని వ్యవహరించేవారు. ఇప్పుడు మూన్‌ అని పిలుస్తున్నారు. బర్మాలో తెలుగువారు పెద్దలకు అపారమైన గౌరవం ఇస్తారు. వయసు మీదపడి కాలు కదపలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ముఖం కడిగించి, స్నానం చేయించి ముస్తాబు చేసిన తర్వాతే మిగిలిన పనులు చేసుకుంటారు. అక్కడ వరకట్న ఆచారమే ఉండదు. బర్మాలో గృహహింసకు అవకాశం లేదు. ఇక్కడ ఈడు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయకపోతే చుట్టుపక్కల వారు చాటుమాటుగా ఎన్నో సూటిపోటి మాటలు అంటారు. బర్మాలో పెళ్లికాని అమ్మాయిలను గౌరవంగా చూస్తారు.
 
సీడీల్లో సీరియళ్లు
అక్కడి వారికి తెలుగు సీరియళ్లంటే ఇష్టం. కానీ అంత సులభంగా దొరకవు. కొంతమంది వాటిని సీడీల్లో కాపీ చేసి అద్దెకు ఇస్తారు. అమ్ముతారు. తెలుగు సీరియళ్ల సీడీల అమ్మకం బర్మాలోని తెలుగువారి వ్యాపారాల్లో ఒకటి. ఇదేకాదు చేపలు, కూరగాయలు, మాంసం వ్యాపారాలూ మనవాళ్లు చేస్తుంటారు.