Special-app-for-students-who-in-Foreign

విదేశాల్లో చదువుతున్నారా?

అమెరికా, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌.... ఇలా విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ ఉందన్న విషయం తెలుసా? ఆ యాప్‌ పేరే ‘ఫ్లైట్స్‌ బై స్టూడెంట్‌ యూనివర్స్‌’. ఇది అమెరికాలో చదువుకున్న ఇద్దరు విద్యార్థుల కృషి ఫలితం. విదేశాల్లో చదువు, వసతి సదుపాయాలు బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఏదో ఒక సందర్భంలో సొంత దేశానికి వెళుతున్న వారూ ఉంటారు. అప్పుడు విమానం ధరల్ని భరించడం కష్టమే. విద్యార్థుల బడ్జెట్‌కు తగ్గట్టుగా టిక్కెట్‌ ధరలు ఉండేలా ‘స్టూడెంట్‌ యూనివర్స్‌’ అనే ఓ ట్రావెల్‌ ఏజెన్సీని ఎస్పన్‌ అనే విద్యార్థి 1992లో స్థాపించాడు. డిస్కౌంట్‌లో టిక్కెట్‌ ధరలను అందించడంతో ఇది బాగా క్లిక్‌ అయింది. ఆ తర్వాత ఇది ప్రైవేట్‌ ఇన్వెస్టర్ల చేతిలోకి వెళ్లడంతో అంతర్జాతీయ ట్రావెల్‌ సంస్థగా ఆవిర్భవించింది. ఇప్పటికీ ఇది విజయవంతంగా నడుస్తోంది. ఇంతకీ, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటారా...సరైన ధ్రువపత్రాలతో ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు!