ఈ స్పెయిన్‌ హోటల్‌ రూటే సెపరేటు..!

ఆంధ్రజ్యోతి, 10-04-2018: హోటల్‌లో వంటలు ఎలా తయారు చేస్తారు? పెద్ద పెద్ద గ్యాస్‌ పొయ్యిలపై లేదా కట్టెల పొయ్యిలపై చేస్తారని ఎవరైనా ఠక్కున చెబుతారు. కానీ ఈ హోటల్‌లో మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ రుచికరమైన వంటలన్నీ భగభగమంటున్న లావా వేడిపై తయారవుతాయి. ఇంతకీ ఆ హోటల్‌ ఎక్కడుందో తెలుసా?

  • ఒక్కో హోటల్‌ ఒక్కో రుచికరమైన వంటతో ఫేమస్‌ అవుతుంది. కానీ ఈ హోటల్‌ మాత్రం వంట తయారుచేసే పద్ధతితో ఫేమస్‌ అయింది.
  •  అగ్నిపర్వతాన్ని ఆమడ దూరంలో నిలుచుని చూస్తాం. కానీ ఈ హోటల్‌ ఏకంగా మండుతున్న లావాపై మాంసాన్ని ఫ్రై చేసి పర్యాటకులకు అందిస్తోంది.
  •  స్పెయిన్‌లోని లాంజరొటె అనే ద్వీపంలో ఉందీ హోటల్‌. దీని పేరు ఎల్‌ డయాబ్లో.
  •  భూమి పొరల్లో నుంచి లావా ప్రవహించే ఒక చోట గోతిలా చేసి దానిపై ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేసి వంటలు సిద్ధం చేస్తున్నారు. లావా వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
  •  లావా ప్రవహిస్తోంది కానీ ఎగజిమ్మే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే హోటల్‌ యాజమాన్యం ధీమాగా ఉంది.
  •  లావాపై వంట ఎలా చూస్తారో చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హోటల్‌కు వస్తున్నారట. ఈ హోటల్‌లో మాంసాహారం చాలా రుచిగా ఉంటుందట. ఒక్కసారి ఇక్కడ మాంసాహారం రుచి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుందట.
  •  లావాపై వండిన వంటలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయా? అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది. అక్కడి ప్రజలకు కూడా వచ్చింది. అయితే ఆ ఆహారం తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని, ఎలాంటి భయం లేకుండా తినొచ్చని అధికారులు పరిశీలించి సర్టిఫికెట్‌ జారీ చేశారట.
  •  కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ అగ్నిపర్వతం బద్దలయిందట. ఆ తరువాత మళ్లీ ఎలాంటి లావా ఎగజిమ్మిన అనవాళ్లు లేవట. అయితే భూమి పొరల్లో మాత్రం భగభగమంటున్న లావా ఉందట. ఎంతైనా ఆ ప్రదేశంలో హోటల్‌ పెట్టిన వాళ్లు, ఆ హోటల్‌కెళ్లి భోజనం చేసే వాళ్ల గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదూ!