గీతతో ఖండాంతర ఖ్యాతి.. సిద్దిపేట వాసి ఘన కీర్తి

చేతిరాత శిక్షణ ఇవ్వడంలో సిద్దిపేట ఉపాధ్యాయుడు ఎజాస్‌ అహ్మద్‌ దిట్ట

విదేశాల్లోనూ ఆయన చిత్రీకరించిన వీడియోలకు గుర్తింపు
అమెరికాలో ఎన్‌టీడీ ఛానల్‌లో ప్రసారం 
నెలలోనే 69,74,569 మంది వీక్షణ 
ఫేస్‌బుక్‌లో 1,11,46,936 వీవర్స్‌
యూట్యూబ్‌లో 135 వీడియోలు
 
చేతి రాతలో నిష్ణాతుడు.. రాత మొదలు పెడితే అక్షరాలు ఒదిగిపోవాల్సిందే.. ఆయన గీతకు దేశ విదేశాల్లో అభిమానులు కోకొల్లలు.. ఇంగ్లిష్‌లో కలిపిరాతను ఎలా రాయాలో వివరిస్తూ రూపొందించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను అమెరికాలో ఎన్‌టీడీ ఛానల్‌ ప్రసారం చేసిందంటే అతడి ప్రతిభ ఎంతనేది చెప్పనక్కర్లేదు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఎజాస్‌ అహ్మద్‌ అందమైన చేతిరాతలో దిట్ట. విద్యార్థి చేతిరాతను చూసి ఎజాస్‌ శిష్యుడని గుర్తుపట్టవచ్చంటే అతిశయోక్తి కాదు.
 
సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృత్తి రిత్యా ఉపాధ్యాయుడైన ఎజాస్‌ అహ్మద్‌ ఇంగ్లి్‌షలో కలిపిరాతను ఎలా రాయాలో వివరిస్తూ రూపొందించిన వీడియో దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందుతున్నది. ఫేస్‌బుక్‌లో 1,11,46,936 వీవర్స్‌ సాధించింది. అమెరికాలో ఎన్‌టీడీ చానల్‌లో ఈ వీడియోను ప్రసారం చేస్తే నెల రోజుల్లోనే 69,74,569 మంది వీక్షించారు. ఎజాస్‌ అహ్మద్‌ చేతిరాతలో శిక్షణ ఇస్తారు. అంతేకాదు స్థానిక టీవీ ఛానల్‌లో తెలుగు వార్తలు చదువుతారు. పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తారు. సంస్కృత శ్లోకాలు, పద్యాలు, కథలతో కార్యక్రమాన్ని రక్తికట్టిస్తారు.  పలు సభల్లో ఎజాస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. ఆయన సిద్దిపేటలోని శుభోదయ విద్యాలయంలో కరస్పాండెంట్‌గా  విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, భాషల్లో చేతిరాతపై శిక్షణ ఇస్తున్నాడు. విద్యార్థి చేతిరాతను చూసి ఎజాస్‌ అహ్మద్‌ శిష్యుడు అని ఇట్టే గుర్తుపట్టొచ్చు. 2004 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అప్పటి కలెక్టర్‌ చేతుల మీదుగా ‘సామాన్యుల్లో అసామాన్యులు’ అవార్డును అందుకున్నారు. 
 
అందమైన చేతి రాత అందరికి సాధ్యమే
 1994 నుంచి విద్యార్థులకు అందమైన చేతిరాత అలవాటు చేయాలనే తపనతో ఎజాస్‌ అహ్మద్‌ ప్రారంభించిన చిరుప్రయత్నం నేడు విశ్వవ్యాప్తం అయింది. శుభోదయ విద్యాలయంలో విద్యార్థుల చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో  ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ అక్షరాలు అందంగా రాసే విధానానికి రూపకల్పన చేశారు.  ఈ ప్రక్రియ తన పాఠశాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నేర్పాలనే తపనతో తరగతులు నిర్వహించి వేల మంది విద్యార్థుల రాత మార్చారు. 1994లోనే తోటి ఉపాద్యాయుడి ప్రోత్సాహంతో ‘అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. దానికి విశేష ఆదరణ లభించడంతో సుమారు 40 పర్యాయాలు ముద్రించారు. సుమారు 20 వేల ప్రతులు దేశవిదేశాలలో అమ్ముడుపోయాయి. 
 
వీడియోకు విశేష ఆదరణ
వీడియో మాద్యమానికి ఉన్న ఆదరణను గమనించిన ఆయన 2006లో సుమారు 35 నిముషాల నిడివితో ఓ వీడియోను చిత్రించారు. దానికి అభించిన ఆదరణతో మన టీవీ వారు ఎజాస్‌ అహ్మద్‌తో పది ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. దూరదర్శన్‌ వారు ఆయన ఇంటర్వ్యూ కూడా ప్రసారం చేశారు. 2016 అక్టోబర్‌లో తన మిత్రుడి ప్రోత్సాహంతో ఆయన రెండు నిముషాల వీడియో తీశారు. దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తే అనూహ్యరీతిలో విశేష ఆదరణ పొందింది. ఇంగ్లీష్‌ అక్షరాలు గీతలతో ఎలా రాయాలనే  అంశపై రూపొంచిన ఈ వీడియో ప్రపంచ ఖ్యాతి గాంచింది. ఫేస్‌బుక్‌లో 1,11,46,936 మంది వీక్షికుల ఆదరణ పొందింది. అది కూడా ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో నమోదయినదే. ఇతరుతో కలిపి ఈ వీడియోను సుమారు పది కోట్ల మంది వీక్షించారు. ఇటీవల సోషల్‌ సమోసా అనే సంస్థ వారు ఇండియాలోని 10 టాప్‌ వీడియోలను ప్రకటించారు. అందులో మొదటి స్థానం ఎజాస్‌ అహ్మద్‌ లైవ్‌ వీడియోకు దక్కింది. రెండొది సోనాక్షి సిన్హా, మడో స్థానం అమితాబ్‌ బచ్ఛన్‌, నాలుగో స్థానం షారుక్‌ ఖాన్‌, ఐదో స్థానం కపిల్‌ శర్మ, ఆరో స్థానం కాజోల్‌, ఏడో స్థానం బాలీవుడ్‌ లైవ్‌ పోర్‌, ఎనిమిదో ఆజ్‌ తక్‌, తొమ్మిదో స్థానం అరవింద్‌ కేజ్రీవాల్‌, పదో స్థానం అజయ్‌ దేవగన్‌ వీడియోకు దక్కింది. మొదటి స్థానంలో నిలవడం ఎజాస్‌ కే కాదు ఆయన అభిమానులకు, వీడియో రికార్డు చేసిన మహ్మద్‌ నసీరుద్దీన్‌కు ఆనందాన్నిచ్చింది. అరబ్‌ దేశాల్లో, పాకిస్థాన్‌లో ఈ వీడియోను వేలమంది తిలకించి ఉర్దూ, అరబ్బీ భాషల్లో కామెంట్లు కూడా చేశారు. దుబాయ్‌లోని షేక్‌లను సైతం ఈ వీడియో కదిల్చింది. అక్కడి తెలుగు ప్రజలను దీని గురించి అడిగి తెలుసుకుని అభినందించారు. తమిళం, కన్నడ, మళయాలం, అరబ్బీ భాషల్లో కూడా ఎజాస్‌ అహ్మద్‌ వీడియోకు కామెంట్స్‌ రావడం అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. 
 
అమెరికాలోనూ వీడియో ప్రసారం
అమెరికాలోని ఎన్‌టీడీ ఇన్‌స్పైర్‌ ఛానల్‌ ఎజాస్‌ అనుమతితో ఈ వీడియోను ప్రసారం చేసింది. నెలరోజుల్లో 69,74,569 మంది ఈ వీడియోను వీక్షించి 60,896 మంది షేర్‌ చేశారు. అమెరికాలోని మేథావులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఆరు లక్షల మంది కామెంట్స్‌ చేశారు. ఈ కామెంట్స్‌లో ఇండియన్‌ టీచర్లను పొగిడారు, అక్కడి టీచర్లు ఎన్ని వసతులున్నా విద్యార్థులను చైతన్యపర్చులేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు కామెంట్‌ చేశారు. గీతలతో ఇంగ్లిష్‌ అక్షరాలు కనుగొని విద్యార్థులను మంత్రముగ్దుల్ని చేసే ప్రక్రియ అద్భుతమని కొనియాడారు. షేర్‌ చేసిన 65,000 మందికి వారి అకౌంట్స్‌లో వీవర్స్‌ పెరిగి దాని స్థాయిని ఇంకా పెంపొందించారు. బీబీసీ ఛానల్‌ వారు తెలుగు ఛానల్‌ ప్రారంభిస్తున్నామని, అందులో ఎజాస్‌ గురించి కథనం ప్రసారం చేస్తామని ఎజాస్‌ అహ్మద్‌ అనుమతి తీసుకున్నారు. త్వరలోనే ఆ ఛానల్‌లో కూడా కథనం ప్రసారంకానుంది. 
 
బ్రిలియంట్‌ హ్యాండ్‌ రైటింగ్‌ పేరిట...
చేతిరాత నేర్పే ఇనిస్టిట్యూట్లు ఆయన వీడియోను బ్రిలియంట్‌ హ్యండ్‌ రైటింగ్‌ పేరిట ప్రచారం చేసుకున్నాయి. అంతేకాకుండా దాదాపు 135 వీడియోలు విద్యార్థుల కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. పద్యాలు, శ్లోకాలు , భక్తి, దేశభక్తి గేయాలు పాఠ్యాంశంలోని పద్యభాగం పాఠాలు, చేతిరాత తరగతులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు దోహదపడుతున్నాయి. 
 
అందరికీ అందిస్తే అందమైన చేతి రాతలే!
ఎజాస్‌ అహ్మద్‌ రాసిన ‘అందమైన చేతిరాత అందరికి సాధ్యమే’ అనే పుస్తకాన్ని ప్రభుత్వం ముద్రించి అందరికీ అందించి ట్రెసింగ్‌ పద్ధతిలో త్వరగా చేతిరాత మార్చుకునే విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తేవాల్సిన అవసరమున్నది. అందుకు సహకరించడానికి తాను సిద్ధమే అంటున్నారు ఎజాస్‌.