60 దేశాల్లో మనోళ్లు

ఉపాధి బాటలో పెరిగిన వలసలు

అమెరికా నుంచి అండమాన్‌ వరకూ పశ్చిమవాసులు
పశ్చిమగోదావరి జిల్లాలో 1990 నుంచి మారుతున్న సీన్‌

ఒకనాడు పశ్చిమ అంతా వ్యవసాయమే.. పదెకరాల రైతుంటే తన కొడుకు కూడా రైతుగానే ఉండాలని కోరుకునేవాడు. అలాగే పెంచేవాడు... తండ్రి తరువాత కొడుకే వ్యవసాయం చూసుకునేవాడు. ఇలా తాతలు తండ్రుల తరం సాగిపోయింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి.. మారిన జీవన పరిస్థితులు మానవుడి జీవనంపై కూడా ప్రభావం చూపాయి.. పదెకరాల రైతు కొడుకైనా పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిపోతున్నారు.. నేటి పరిస్థితులకు అనుగుణంగా  ఉపాధి పొందుతున్నాడు. జిల్లా నుంచి ఎంతో మంది ఇలా వెళ్లి ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 దేశాల్లో మన వాళ్ళు స్థిరపడిపోయారు.. అమెరికాలో చూసినా ఆస్ర్టేలియాలో చూసినా.. చివరకు అండమాన్‌లో అయినా మనోళ్లే... నేడు (18-12-2017) అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో  పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’  ప్రత్యేక కథనం..
 
ఉపాధికి చిరునామాగా ఉండే పశ్చిమ నేల నుంచి కూడా వలసలు ఉన్నాయి. నూరేళ్ళ కిందట ఈ నేలకు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల నుంచి వచ్చి వేల కుటుంబాలు స్థిరపడి ఉపాధి పొందాయి. అయితే 1970-80 దశకంలో జిల్లాలో సాంద్ర వ్యవసాయ పఽథకం ఊపిరిలూదుకున్నప్పటికీ ఉపాధి సమస్య తలెత్తింది. ప్రధానంగా వేతనం తక్కువ ఉండడం, కుటుంబ సభ్యులందరికీ కూలి దొరకకపోవడం, భూములు పెద్దల చేతుల్లోనే ఉండిపోవడం, కౌలు వ్యవసాయం అంతంత మాత్రంగానే ఉండడంతో మెల్లగా పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాలు ఉపాధి వైపు మళ్లారు. 1980 తరువాత అప్పటి రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధి చెందడం ప్రారంభం కావడంతో వేల కుటుంబాలు ఈ జిల్లా నుంచి పొట్ట చేత పట్టుకుని వెళ్లిపోయారు. 1990 తరువాత అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇలా హైదరాబాద్‌ మహానగరంలో స్థిరపడిపోయిన జనాభా సంఖ్య ఈ ఒక్క జిల్లాకు చెందిన వారే ప్రస్తుతం 8 లక్షల వరకు ఉండొచ్చు అంటే పరిస్థితి అంచనా వేయవచ్చు. ఆ తరువాత ఇంజనీరింగ్‌ విద్య.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు విస్తృతం కావడంతో ఉపాధి రంగం కొత్త మలుపు తిరిగింది. మెరుగైన ఉపాధికి.. సాఫ్ట్‌వేర్‌లో మంచి ఉద్యోగాలకు వేలాది మంది విదేశాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ , తూర్పుఆసియా, గల్ఫ్‌ దేశాల్లోను ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌, డాక్టర్లుగా వేల కుటుంబాలు వలస వెళ్లి స్థిరపడ్డాయి. దాదాపు 60 దేశాల్లో ఈ జిల్లాకు చెందిన వారు వలస వెళ్లి స్థిరపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి ఇప్పటికి నిత్యం విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య రోజుకు 1000 నుంచి 1200ల వరకు ఉంటుందంటే పరిస్థితి గ్రహించవచ్చు. కొన్నేళ్ళగా భూస్వాములు గాని, ఎక్కువ వ్యవసాయ భూములున్న రైతులు కూడా తమ వంశీకులు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోవడంతో వారు వ్యవసాయాన్ని కౌలుకు ఇచ్చి వారు కూడా సమీప పట్టణాలకు   వలస వెళ్లిపోతున్నారు. ఇక్కడ ఇళ్ళు, ఆస్తులు వదిలిపెట్టి దూర బంధువులకు అప్పగించి విదేశాలకు వలస వెళ్ళిపోయిన కుటుంబాలు కూడా వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఇలా కేవలం ఉపాధి కోసమే కాకుండా మెరుగైన జీవనం సాగిస్తున్న కుటుంబ సంతానం సూచనల మేరకు కూడా పెద్దలు వలసలు వెళ్లిపోవడం విశేషం.
 
మధ్య తరగతి ఉపాధికి గల్ఫ్‌ దేశాలు..
కాస్త చదువుకుని.. స్వగ్రామంలో వచ్చే ఆదాయం సరిపోక గల్ఫ్‌ దేశాలకు వలసలు వెళ్లే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. స్ర్తీ పురుషులిద్దరూ తమ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని తమ బతుకులనే పణంగా పెడుతున్నారు. జిల్లా నుంచి ఈ రెండు దశాబ్దాల్లో రెండు, మూడు లక్షల మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లినట్టు సమాచారం. ఈ వలసల కారణంగానే 2001 నుంచి 2011 మధ్య పదేళ్ళ గణాంకాల్లో మన జిల్లా జనాభా సంఖ్య పెరుగుదల కనిపించలేదు. ముఖ్యంగా జిల్లాలో పశ్చిమ డెల్టా నుంచి రోజు వారీగా వ్యక్తిగతంగాను, ఇటు ఉమ్మడిగాను వెళ్ళేవారు వందల సంఖ్యలో ఉంటున్నారు. ఇక్కడి నుంచైతే శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు 10 ఆర్టీసీ బస్సులు రోజూ చేరవేస్తున్నాయి. ఇలా గల్ఫ్‌ దేశాలకు వలసలు తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు.