బాబోయ్‌ కరెంట్.. వైట్‌హౌస్ పవర్ కథ ఇదీ

ప్రపంచానికి పెద్దన్న.. అమెరికా అధ్యక్షుడు. ఆయనగారు నివాసం ఉండే శ్వేతసౌధం అంటే అందరికీ ఆసక్తే! ఈ ధవళ భవనాన్ని 1792లో నిర్మించారు. అయితే ఆ తర్వాత వందేళ్లకు గానీ, అధ్యక్ష భవనంలో కరెంట్‌ సదుపాయం కలగలేదు. 1891లో శ్వేతసౌధానికి విద్యుత సౌకర్యం కల్పించారు. ఆ సమయంలో బెంజిమిన్‌ హారిసన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంత అధ్యక్షుడైనా అతడికీ కరెంట్‌ కొత్తే! అందుకే విద్యుత అవసరం లేదంటూ వారించే ప్రయత్నమూ చేశాడట. అధికారుల విన్నపం మేరకు కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి ఓకే చెప్పాడట.
 
అయితే, విద్యుదీకరణ పూర్తయ్యాక స్విచ్ఛాన్‌ చేయాల్సిందిగా కోరితే.. బెంజిమిన్‌ దంపతులు ససేమిరా అన్నారట. అంతేకాదు, బల్బ్‌ల స్విచ్‌లు ఆన్‌-ఆఫ్‌ చేయడానికి కొన్నాళ్లపాటు ప్రత్యేకంగా ఒకరిద్దరిని వెంట పెట్టుకున్నారట ఈ దంపతులు. శ్వేత ప్రాసాదంలో అధ్యక్షుడి వింత పోకడ గురించి బయటకు పొక్కింది. జనాలు గొల్లుమన్నారు. అంత పెద్ద అధ్యక్ష పీఠంలో ఉన్న పెద్దాయన.. అలా భయపడటం ఏంటని చెవులు కొరుక్కున్నారు. జోకులు పేల్చుకున్నారు. బెంజిమిన్‌కు స్విచ్‌ ఆన్‌-ఆఫ్‌ చేయడంలో సహకరిస్తున్న అడ్మినిస్ట్రేషన్‌ అధికారి జాన్సన్‌కు.. ‘లైట్‌ బల్బ్‌ జాన్సన్‌’ అని ముద్దుపేరు కూడా పెట్టేశారు.