:: Welcome to NRI - Article ::

ప్రభుత్వ ఉద్యోగులకు ఈజీగా పాస్‌పోర్టులు

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లాలంటే చాలా నిబంధనలు పాటించాలి. సాధారణ పౌరులు, వ్యాపారులు, విద్యార్థులు డబ్బులుంటే ఏ దేశమైనా వెళ్లడానికి అవకాశం ఉంది. వారికి ఆయా దేశాల సందర్శనకు పాసుపోర్టులు జారీ చేసేందుకు ప్రభుత్వం చాలా సదుపాయాలను కల్పించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడుపడితే అప్పుడు విదేశాలు వెళ్లడానికి వీల్లేదు. ఇందుకోసం చాలా లాంఛనాలను పూర్తిచేయాల్సి ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించింది. విదేశాలు వెళ్లడానికి అవసరమైన పాసుపోర్టు పొందాలంటే ముందుగా సంబంధిత అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) పొందాలి. ఆ తర్వాతే పాసుపోర్టు జారీ చేస్తారు. ఈ విషయంలో టీచర్లకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇందుకోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులకు ప్రతిపాదనలు పంపాల్సి వచ్చేది. దీనిని సులభతరం చేస్తూ ఆర్‌సీ నంబర్‌-438తో విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఉపాధ్యాయులు ఏం చేయాలంటే.. 
ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లాలంటే తాము పనిచేసే జిల్లా విద్యాశాఖాధికారి నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఆ అనుమతి పత్రంతో పాసుపోర్టు కోసం దరఖాస్తు చేయాలి. పొందాలి. పాసుపోర్టు పొందడానికి ఎనవోసీ కోసం ఉపాధ్యాయులు చేసే దరఖాస్తులను డీఈవో పరిశీలిస్తారు. ఎందుకు విదేశాలకు వెళతున్నారో తెలుసుకుని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శికి సిఫారసు చేసేవారు. ఆరు నెలల్లోపు అక్కడనుంచి వచ్చిన ఎనవోసీ ఆధారంగా విశాఖలోని ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయానికి దరఖాస్తు చేసుకునేవారు ఈ విధానం ఎంతో ఇబ్బంది, జాప్యంతో కూడుకున్నది కావడంతో ఈ విధానాన్ని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
ఉత్తర్వులలో ఉన్న వివరాలు 
మండల పరిషత్తు పరిధిలో పనిచేస్తున్న సెకెండరీ గ్రేడు టీచర్లు, గ్రేడు-2 తెలుగు, హిందీ పండితులు, పీఈటీలు ఎంఈవోల ద్వారా డీఈవోకు, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు కాకినాడలోని రీజనల్‌ జాయింట్‌ డైరెక్టరుకు పంపాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. పనిచేస్తున్న స్కూల్‌ పేరు, ఉద్యోగి ఐడీ నంబర్‌ అఫిడవిట్‌ వంటివి సమర్పించాలి. ఆ తర్వాత ఎనవోసీ జారీ అవుతుంది. దీని ఆధారంగా పాసుపోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఇవీ నిబంధనలు
  • ఉపాధ్యాయులు ఎన్‌వోసీ పొందాక విదేశాలకు వెళ్లేందుకు కొన్ని నిబంధనలను అధికారులు రూపొందించారు. ఇందుకను గుణంగా ఉన్నవారే విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. 
  • విదేశాలలో బంధువులు ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతుంటా వారిని పరామర్శించడానికి వెళ్లవచ్చు. లేదా ఇక్కడున్న బంధువుల ఆరోగ్య అవసరార్థం వెళ్లవచ్చు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను, వైద్యుల సిఫారసులను దరఖాస్తుతో జత చేయాల్సి ఉంటుంది. 
  • పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికీ విదేశాలకు వెళ్ల వచ్చు. అయితే ఎన్ని రోజులు.. ఏ ఏ ప్రాంతాలను సందర్శిస్తారో ఆ వివరాలను జత చేయాలి. ఇందుకు సెలవులను ముందుగా మంజూరు చేయించుకోవాలి. ఇటువంటి పర్యటనలకు వెళ్లేటప్పుడు మెడికల్‌ లీవ్‌లు అవకాశం లేదు. 
  • విదేశాలలో ఉన్న బంధువులను చూడడానికి కూడా వెళ్లవచ్చు. అయితే వారు ఎక్కడుంటున్నారో వారి చిరునామాలను అందించాలి.

పాసుపోర్టుకు ఎలా దరఖాస్తు చేయాలంటే.. 
ఎన్‌వోసీని సంబంధిత అధికారుల నుంచి పొందాక దాన్ని జత చేసి పాసుపోర్టు కోసం దరఖాస్తు చేయాలి. విదేశాలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆ వివరాలను పొందుపరచాలి. వయసును ధ్రువీకరించే టెన్త్ సర్టిఫికెట్‌ను జత చేయాలి. ఉద్యోగం, సర్వీసు వివరాలను కూడా సమర్పించాలి. కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను కూడా జత చేయాలి. అన్ని వివరాలతో నగరంలోని ఎనఏడీ సమీపంలో ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో అందించాలి. అలా అందించిన నెల రోజుల తర్వాత పరిశీలించి వివరాలు సరిగ్గా లేకపోతే తిరస్కరిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే పోలీస్‌ విచారణ జరుగుతుంది. ఇరుగు పొరుగున ఉన్నవారి నుంచి వివరాలను సేకరిస్తారు. పనిచేస్తున్న శాఖాధిపతులనుంచి కూడా సమాచారం తీసుకుంటారు. ఆ తర్వాత పాసుపోర్ట్‌ ఇవ్వడానికి సిఫారసు చేస్తారు. అలా అన్ని లాంఛనాలు పూర్తయ్యాక పాసుపోర్టు జారీ చేస్తారు. ఒకసారి జారీ అయిన పాసుపోర్టుతో ఏడాదిలోగా ఏ దేశానికైనా వెళ్లొచ్చు. ఒకవేళ ఏడాదిలోగా విదేశాలకు వెళ్లలేకపోతే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో దళారులను ఆశ్రయించవద్దని పాసుపోర్ట్‌ అధికారులు సూచిస్తున్నారు. 
 
మరింత సరళతరం చేయాలి 
ఉపాధ్యాయుల పాసుపోర్టు పొందడానికి ఉన్న నిబంధనలను మరింత సరళతరం చేయాలి. ఎన్‌వోసీ మాదిరిగా పాసుపోర్టును కూడా సులభంగా అందించాలి. చాలామంది ఉపాధ్యాయులు అనేక నిబంధనల అడ్డంకి కారణంగా పాసుపోర్టులను సకాలంలో పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు చేపట్టాలి. 
-పి.ఓంకారనాధ్‌, ఉపాధ్యాయ సంఘ నేత, ఆనందపురం 

వెసులుబాటుతో ఉపయోగం 
చాలామంది విదేశాలకు వెళ్లడానికి పాసుపోర్టులు సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు వల్ల చాలా ప్రయోజనం ఉంది. నిర్దిష్ట కారణాలతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అన్ని లాంఛనాలు పూర్తి చేయడానికి సులభతరంగా ఉంది. ఇందువల్ల గతంలో కంటే చాలామంది పాసుపోర్టులను పొందుతున్నారు. 
-తమ్మిన రామలక్ష్మణరావు, తగరపువలస