Passport-is-very-easy

పాస్‌పోర్టు ఇక సులువు

పుట్టిన తేదీ గొడవకు చెల్లుచీటీ
నోటరీలు.. తనిఖీలు అక్కర్లేదు
స్వీయ ప్రమాణపత్రం చాలు
సన్యాసులకు తల్లిదండ్రుల స్థానంలో గురువు పేరు
నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు
విశాఖపట్నం/న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు నిబంధనలను సరళతరం చేసింది. దేశ పౌరులు సులభంగా పాస్‌పోర్టు పొందేందుకు వీలు కల్పించింది. దీనికి సంబంధించి దరఖాస్తు నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. పుట్టిన తేదీ, పెళ్లి ధ్రువీకరణ, నోటరీలకు సంబంధించిన నిబంధనలను సులభం చేసింది. ఇప్పటి వరకూ పాస్‌పోర్టు పొందాలంటే ఎన్నో నిబంధనలు.. అడ్డంకులు. దళారులను ఆశ్రయిస్తే తప్ప మంజూరు కాని పరిస్థితి. అడిగినంత ముట్టజెప్పినా చేతికి అందేవరకు అనుమానమే. ఇకపై ఈ దుస్థితి ఉండదు. తాజా మార్పులకు సంబంధించి కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ పుట్టిన తేదీకి సంబంధించి ఒక కఠిన నిర్ణయం అమలులో ఉండేది. 26 జనవరి, 1989 తరువాత పుట్టినవారు ఎవరైనా సరే పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తే తప్పనిసరిగా పంచాయతీ/మునిసిపాలిటీ/కార్పొరేషన జారీచేసిన ధ్రువపత్రం సమర్పించాల్సి ఉండేదది. పదో తరగతి సర్టిఫికెట్‌ ఇస్తే చెల్లదు. అసలుదానికి ప్రత్యామ్నాయం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని దళారులు ఫోర్జరీ పత్రాలు తయారు చేసి ఇస్తున్నారు వీటికి చెక్‌ చెప్పడానికి కేంద్రం ఇప్పుడు ఆ నిబంధనను పూర్తిగా తొలగించింది. ఇపుడు ఆ తేదీకి ముందు, ఈ తేదీ తరువాత అనే తేడా లేదు.ఆధార్‌ కార్డ్‌, ఓటరు కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స, ఎల్‌ఐసీ పాలసీ బాండ్‌, టెన్త సర్టిఫికెట్‌...ఇలా ఏదైనా పుట్టినతేదీ ఉన్న సర్టిఫికెట్‌ ఇస్తే చాలు. కొత్త నిబంధనలు 26వ నుంచి అమలులోకి వస్తాయి.
 
ఇవీ ఆ మార్పులు! 
పెళ్లి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకుంటే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, జీవిత భాగస్వామి పేరు రాయాల్సి వుండేది. ఇకపై వీటిని సమర్పించాల్సిన అవసరం లేదు.సింగిల్‌ పేరెంట్‌ (తల్లి/తండ్రి) దగ్గర పెరుగుతున్న పిల్లలు దరఖాస్తు చేసుకుంటే పేరెంట్‌ అనే కాలమ్‌లో ఎవరి పేరు రాసినా సరిపోతుంది. తప్పనిసరిగా తండ్రి పేరు రాయాలనే నిబంధన లేదు.అనాధ ఆశ్రమంలో పెరిగిన పిల్లలు అయితే ఆ ఆశ్రమం నిర్వాహకులు పుట్టిన తేదీని చెబితే సరిపోతుంది.గతంలో ఏదైనా సమచారం ఇవ్వాల్సి వస్తే డాక్యుమెంట్‌ పేపర్‌పై నోటరీ చేయించి ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై దాని అవసరం లేదు. తెల్లకాగితంపై రాసి, సెల్ఫ్‌ డిక్లరేషన ఇస్తే చాలు.హిందూ సాధువులు, సన్యాసులు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో తమ తల్లిదండ్రుల స్థానంలో తమ ఆధ్యాత్మిక గురువు పేరును వెల్లడించవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకోవాలంటే సాధువులు.. తమ ఓటర్‌ ఐడీ, పాన్‌, ఆధార్‌ తదితర పత్రాల్లో తల్లిదండ్రుల పేరు వద్ద గురువు పేరును నమోదు చేసుకుని ఉండాలి. ప్రధాన పోస్టాఫీసుల్లో కూడా పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం పరిశీలిస్తోంది. కాగా విదేశాంగ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను ఇకపై ట్విట్టర్‌లో నమోదు చేసుకోవచ్చు. విదేశాల్లోని 198 భారతీయ రాయబార కార్యాలయాలు, దేశంలోని 29 ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయాలను కొత్తగా తెచ్చిన ట్విట్టర్‌ సేవకు అనుసంధానించారు. ఈ సేవల ద్వారా దేశంలోని, విదేశాల్లోని భారతీయులకు సకాలంలో మెరుగైన సేవలు అందించే వీలు ఏర్పడుతుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు. పౌరులంతా ఇకపై @MEAIndia, @indiandiplomacy, @MEAQuery ద్వారా తమ ఇబ్బందులను తెలియజేయవచ్చని మంత్రి వివరించారు.