అమెరికాలోని ఈ ఇల్లు.. వైట్‌హౌస్ కంటే ప్రత్యేకం

గువ్వకైనా.. మనిషికైనా.. కావాల్సింది గూడు. పక్షుల గూళ్లన్నీ ఏక రూపంగా ఉండవు. అలానే మనిషి కూడా తన కలల సౌధాన్ని.. ఎంతో ఇష్టంతో, తన ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికంటే కాస్త భిన్నంగా నిర్మించుకుంటాడు. అమెరికాకు చెందిన మెకానికల్‌ ఇంజనీర్‌ ఎలిస్‌ స్టెన్‌మన్‌ కూడా ఓ భిన్నమైన ఆలోచనతో.. తన ఇంటిని ప్రత్యేకంగా కట్టాడు. ఆ ఇల్లు ఇప్పుడు మ్యూజియంగా మారింది? ఇంతకీ ఆ గృహానికున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.. 
 
సాధారణంగా ఇళ్లను సిమెంట్‌, ఇసుక కలపి కడతారు. లేదంటే చెక్కతో సౌధాన్ని నిర్మిస్తారు. మరికొందరు తమ సృజనాత్మకతను జోడించి .. గృహాలను సీసాలతో, ప్లాస్టిక్‌ బాటిళ్లతో, టీ కప్పులతో నిర్మించి ముచ్చట తీర్చుకున్నారు. ఎలిస్‌ స్టెస్‌మస్‌ కూడా అదే కోవలోకి వస్తాడు. చదివేసిన దినపత్రికలతో.. ఎలిస్‌ ఇంటినే కట్టి అందర్ని ఔరా అనిపించాడు. అది ఇప్పుడు కాదు ఎప్పుడో 90 ఏళ్ల క్రితమే. ఈ ఇంటిని సందర్శించిన వారికి 1924కు ముందు ఉన్న పేపర్లను చూసి.. 90 ఏళ్ల వెనక్కు వెళ్లి వచ్చినట్లుందంటుంటారు.  ఇప్పటికీ ఆ ఇల్లు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుందంటే.. అమెరికాలోని మాసాచుసెట్స్‌ దగ్గరలోని పిజియన్‌ హిల్‌ స్ర్టీట్‌లో. చూడటానికి ఆ ఇల్లు.. సాదాసీదాగానే కనిపిస్తుంది. కానీ ఆ ఇంటి సమీపానికి చేరుకోగానే ‘వెల్‌కమ్‌ బోర్డు’ ప్లేస్‌లో ‘పేపర్‌ హౌజ్‌’ అని రాసి ఉంటుంది. ఇల్లే కాదు అందులోని వస్తువులు కూడా పేపర్‌తో తయారుచేసినవే.
 
అలా నిర్మించాడు.. 
  •  ఎలిస్‌ 1922లో పేపర్‌ హౌజ్‌ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 
  •  మొదట్లో ఎలిస్‌ సాధారణ ఇంటిలా దీని నిర్మాణం మొదలు పెట్టాడు. చెక్కలతో ఫ్రేములు బిగించాడు. పైకప్పు వేశాడు. చెక్కలతోనే ఫ్లోర్‌ వేశాడు. కానీ గోడలు నిర్మించాలనుకునే సమయంలో.. ఎలిస్‌కు వైవిధ్యమైన ఆలోచన వచ్చింది. తన ఇంటికి ఏదో ఓ ప్రత్యేకత ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. అలా దినపత్రికలతో గోడలు కడితే భిన్నంగా ఉంటుందని ఆ పని మొదలుపెట్టాడు. 
  •  ఒక అంగుళం మందంతో పాత న్యూస్‌ పేపర్లని పొరలుపొరలుగా తయారుచేసి, దానితో గోడలను నిర్మించాడు. ఇందుకోసం జిగురు ఉపయోగించాడు. ఆ గోడలపై వార్నిష్‌ పూసి అందంగా తీర్చిదిద్దాడు. 
  •  ఇంటిలో కనిపించే కుర్చీలు, టేబుళ్లు, పుస్తక అరలు. ఇలా అన్నీ దినపత్రికలతో రూపొందించనవే. చివరకు పరదాలతో పాటు, గడియారాన్ని కూడా వాటితోనే తయారుచేశాడు. కేవలం పియానో మాత్రమే చెక్కతో చేశాడు. కానీ వస్తువుల ఏకత్వం కోసం దానికి పేపర్లతో కోటింగ్‌ వేశాడు. ఫైర్‌ప్లేస్‌ మాత్రం ఇటుకలతోనే కట్టాడు. 
  •  ఎలిస్‌ మొత్తంగా లక్షకు పైగా న్యూస్‌ పేపర్లని, మ్యాగజైన్ల్‌ పేపర్లని తన ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించాడు 
  •  ఆ మెకానికల్‌ ఇంజనీర్‌ రెండేళ్ల కష్టం ఫలించి.. 1924లో పేపర్‌ హౌజ్‌ సిద్ధమైంది.
మ్యూజియంగా.
ఎలిస్‌ స్టెన్‌మెన్‌ మరణించాక ఈ ఇంటిని 1942లో మ్యూజియంగా మార్చారు. అప్పటి నుంచి కాగితపు ఇంటిని చూడ్డానికి సందర్శకులు క్యూ కట్టారు. ఆ ఇంట్లో అడుగుపెడితే.. అక్కడక్కడ బయటపడ్డ పాత పేపర్లు చూడొచ్చు. అందులోని హెడ్‌లైన్స్‌ చూసి ఆనాటి రోజులను గుర్తుతెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా ఎలిస్‌ ఆ రోజుల్లోనే పేపర్‌ రీసైక్లింగ్‌ చేసి ఇల్లు కట్టడం అద్భుతమే.