ఎన్నారైలు ఎగబడుతున్నారు..

భాగ్యనగరం రియల్‌ ఎస్టేట్‌ జోరుకు ప్రవాసుల ఇంధనం

తెలుగువారే కాదు.. ఉత్తరాది వారికీ మోజే
 
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన లేదా నివాసం ఉంటున్న ప్రవాసుల్లో సంఖ్యాపరంగానే కాకుండా సంపదపరంగా కూడా భారతీయులు అగ్రస్థానంలో ఉంటారు. పుష్కరకాలం క్రితం వరకు ప్రవాసులు స్వదేశంలో స్థిరాస్తుల కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. తాము స్థిరపడిన, పౌరసత్వం తీసుకున్న దేశాల్లోనే ఆస్తులు కొనుగోలు చేసేవారు. గత కొన్నేళ్లలో ట్రెండ్‌ మారింది. ఆర్థిక వృద్ధిలో భారత్‌ శరవేగంగా దూసుకుపోతుండటం, ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకన్నా భారత్‌లో ఆధునిక జీవనానికి అవసరమైన హంగులు, మౌలికవసతులు చాలా మెరుగైన స్థాయిలో ఉండటంతో ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐలు స్వదేశంలో ఆస్తుల కొనుగోలుపై దృష్టి పెట్టారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో ప్రవాసుల పాత్ర గణనీయంగా పెరుగుతోంది.  ఎన్‌ఆర్‌ఐల కొనుగోళ్లు భారీ ఎత్తున పెరగడంతో ధరలు కూడా భగ్గుమంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడుల్లోభారీ వృద్ధి ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్లలోనూ ఎన్‌ఆర్‌ఐలదే పైచేయిగా ఉంది.
 
భద్రత.. లాభం
రెండు కారణాల రీత్యా ఎన్‌ఆర్‌ఐలు దేశీయ రియల్టీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఒకటి.. స్థిరాస్తుల్లో పెట్టుబడి వల్ల మూలధనం భద్రంగా ఉంటుంది. ఆపై ఆస్తి విలువలో పెరుగుదలా ఉంటుంది. ధరలు ఏటా కనీసం 15 శాతం పెరుగుతున్న విషయం తెలిసిందే. రెండు... ఏనాడైనా తిరిగి స్వదేశం వచ్చి స్థిరపడాలనుకుంటే స్థిరాస్తుల భరోసా ఉంటుంది. ఉండటానికి ఇల్లు ఉంది. అవసరమైతే కొన్ని స్థిరాస్తులను నగదుగా మార్చుకొని వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టొచ్చు.
 
ఇల్లే పదిలం
నవతరం ఎన్‌ఆర్‌ఐల్లో ఎప్పటికైనా మన దేశమే బెటర్‌ అన్న భావన ఉంది. అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో వస్తున్న మార్పులు, మరోవైపు భారత్‌ అగ్రస్థాయికి దూసుకుపోతుండటం, మనదేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల బ్యాంకు డిపాజిట్లు, బంగారం ఇన్వె్‌స్టమెంట్లలో ఆకర్షణ తగ్గడం... వీటన్నింటి దృష్ట్యా భూముల కొనుగోలు భద్రం అనే అభిప్రాయం ఎన్‌ఆర్‌ఐల్లోనూ కలుగుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు స్థిరాస్తుల భద్రతకు చట్టపరంగా కూడా మెరుగైన పరిస్థితి ఉంది. ప్రవాసతెలుగువారు మాత్రమే కాకుండా గుజరాత్‌, రాజస్తాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు కూడా హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వారి బంధువులు, మిత్రులు మధ్యవర్తిత్వంతో ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే రియల్‌ఎస్టేట్‌ సంస్థలు, డెవలపర్లు కూడా ఎన్‌ఆర్‌ఐలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులు, వెంచర్లను ప్లాన్‌చేస్తున్నాయి. మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇప్పుడు ఉత్తరాది వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భాషాపరమైన సమస్య లేకపోవడం కాస్మొపాలిటన్‌ కల్చర్‌, శాంతియుత వాతావరణం... వారి ఆసక్తిని పెంచుతున్నాయి.
 
బంధువుల పేర్లతో...
ఎన్‌ఆర్‌ఐలు మన దేశంలో రెసిడెన్షియల్‌ ప్లాట్లు, ఫ్లాట్లు ఎన్నైనా కొనొచ్చు. అందుకు అనుమతులు అవసరం లేదు. బ్యాంకు రుణాలు కూడా లభిస్తాయి. కమర్షియల్‌ ప్రాపర్టీలు కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంకులు రుణాలు లభించవు. వ్యవసాయ భూముల కొనుగోలుపై నిషేదం ఉంది. దీంతో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలను తమపేరుతో, వ్యవసాయ భూములు, ఫామ్‌ హౌజ్‌లు అయితే అత్తామామలు లేదా తల్లిదండ్రుల పేరుతో కొంటున్నారు. స్థలాలు, ఫామ్‌హౌజ్‌లు, వ్యవసాయ భూములకు సంబంధించి శంకర్‌పల్లి, చేవెళ్ల, వికారాబాద్‌, కొడంగల్‌, శంషాబాద్‌, అటువైపు మెడ్చేల్‌, తూప్రాన్‌, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇటీవల సిద్ధిపేటకు దగ్గరలో ఉన్న ఒక వ్యవసాయ భూమి గురించి చర్చిస్తున్నప్పుడు దాని యజమాని ఢిల్లీకి చెందిన వ్యక్తిగా తెలిసి విస్తుపోయినట్టు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒకరు తెలిపారు. ఉత్తరాది వారు హైదరాబాద్‌ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో కూడా భూముల కొనుగోలుకు సిద్ధపడుతున్నారు.
 
అంతా రూపాయల్లోన్లే....
దేశంలో స్థిరాస్తుల కొనుగోలు అంతా రూపాయి మారకంలోనే భారతీయ బ్యాంకుల ద్వారా జరగాలి. పలు బ్యాంకులు ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేకంగా లోన్‌స్కీమ్‌లు కూడా ప్రవేశపెట్టాయి. పేపర్‌వర్క్‌ పక్కాగా ఉంటే బ్యాంకు లోన్లు కూడా వస్తాయి.
 
పవర్‌ ఆఫ్‌ అటార్నీ
నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ కొనుగోలు చేసిన సందర్భాల్లో బిల్డర్‌కు లేదా సన్నిహిత మిత్రులు, బంధువులకు పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడా తేడా రాకుండా న్యాయవాదుల సలహా తీసుకోవడం ఉచితం.
 
పన్ను రాయితీలు...
స్థానికులకు ఉన్నట్టుగానే ఎన్‌ఆర్‌ఐలకు కూడా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులపై పన్ను రాయితీలు వర్తిస్తాయి. సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపులతోపాటు క్యాపిటల్‌ గెయిన్స్‌ విషయంలోనూ స్థానికులకు వర్తించే నిబంధనలే వర్తిస్తాయి.
 
ఎన్నైనా కొనవచ్చు..
రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో ఎన్‌ఆర్‌ఐల ఇన్వె స్ట్‌మెంట్‌కు పరిమితులు ఏమీ లేవు. ఎన్‌ఆర్‌ఐలు లేదా పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (పిఐఒ)లు కేవలం వ్యవసాయ భూములు, ప్లాంటేషన్‌ ప్రాపర్టీ, ఫార్మ్‌ హౌజ్‌ కొనుగోలు చేసే విషయంలో మా త్రం ఆంక్షలున్నాయి. ఇలాంటివి వారికి వారసత్వంగా లభించినా లేదా బహుమానంగా లభించినా చట్టప్రకారం చెల్లుబాటు అవుతుంది. ప్రత్యక్ష కొనుగోలు మాత్రం నిషేధం.
 
ఎన్‌ఆర్‌ఐలకు ఇప్పుడు చాలా ఈజీ
గతంతో పోలిస్తే దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు నిబంధనలు ఇప్పుడు మరింత అనుకూలంగా ఉన్నాయి. భారతీయ పాస్‌పోర్ట్‌ ఉన్న ఎన్‌ఆర్‌ఐలు వ్యవసాయభూములు, ప్లాంటేషన్స్‌, ఫార్మ్‌హౌజ్‌లుకాకుండా ఇతర రియల్‌ఎస్టేట్‌ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇందుకోసం ముందస్తు అనుమతులు అవసరం లేదు. ఆర్‌బిఐ ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేసింది.
 
మాజీలే మార్గదర్శకులు
మొన్నటి వరకు అమెరికా, కెనడా, ఆస్ర్టేలియా, బ్రిటన్‌ వంటి దేశాల్లో దీర్ఘకాలం ఉండీ ఈ మధ్యనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి స్థిరపడిన కొందరు మాజీ ఎన్‌ఆర్‌ఐలు రియల్‌ ఇన్వె్‌స్టమెంట్లలో విదేశాల్లో ఉన్న తమ స్నేహితులు, బంధువులకు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లో వ్యవస్థీకృత రంగంలో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ వ్యాపారం డెవలప్‌ కాకపోవడంతో చాలామంది ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్‌లో స్థిరపడిన బంధువులు, స్నేహితుల ద్వారానే పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ దేశంలో అగ్రస్థానంలో ఉంటుందన్న అభిప్రాయం పలువురు ఎన్‌ఆర్‌ఐల్లో ఉంది.
 నార్సింగ్‌