ఊరి బడికి.. ఊపిరి

విద్య నేర్పిన పాఠశాలకు ఎన్నారైల చేయూత

విద్యార్థులకు సౌకర్యాల కల్పన
ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
పూర్వ విద్యార్థుల సంఘం సేవలపై ప్రశంసలు

వారు చదివింది సర్కారీ బడిలో.. ఆ చదువే వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దింది. ఉన్నత హోదాలో నిలిచేలా చేసింది. వారిలో పెద్ద పెద్ద చదువులు చదివినవారు విదేశాల్లోనూ స్థిరపడ్డారు. మంచి స్థాయిలో ఉన్నారు. తాము చదువుకున్న సమయంలో బడిలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావని.. తమలాగా ఇప్పటి విద్యార్థులకు ఆ సమస్యలు ఎదురుకావొద్దని, ఇందుకు తమవంతు సాయమందించాలని సంకల్పించారు. ఊరి బడికి ఊపిరి పోస్తూ.. పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ఎన్నారై పూర్వ విద్యార్థులు.

మెదక్‌ జిల్లా మాచవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకొని విదేశాల్లో స్థిరపడిన వారు 70 మంది వరకు ఉన్నారు. వివిధ దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా కలిసి.. పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1975 తర్వాత ఇక్కడ విద్యనభ్యసించిన వారికి తమ బడిని అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఏర్పడింది. పూర్వ విద్యార్థుల్లో బెల్లం శేషగిరిరావు (ఖతర్‌లో ఉన్న కాలంలో), అమెరికాలో ఉంటున్న సాంబశివరావు, రామకోటేశ్వర్‌రావు, సత్యనారాయణ, రాధాకృష్ణ, గిరిధర్‌రావు, నగేశ్‌, మాండవ రమేశ్‌లతో పాటు వివిధ దేశాల్లో ఉంటున్న మరికొంత మంది పూర్వ విద్యార్థుల సంఘంలో ఉన్నారు. ఈ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు డిక్షనరీలు, స్పోర్ట్స్‌ డ్రెస్‌లు, ఇతర మెటీరియల్‌, గ్రంథాలయానికి వివిధ రకాల పుస్తకాలు అందించారు.
 
రూ. 30 వేల విలువ చేసే డిజిటల్‌ ప్రొజెక్టర్‌ను అందజేశారు. ప్రతి ఏటా పదో తరగతిలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు నగదు పురస్కారాలను అందిస్తూ సన్మానిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబరు 5న టీచర్లను కూడా సన్మానిస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. బడి అభివృద్ధికి పాటుపడుతున్న పూర్వ విద్యార్థుల సంఘం సేవలను గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.
 
విద్య నేర్పిన బడికి తమవంతుగా సాయం
విద్య నేర్పి.. విజ్ఞానాన్ని ప్రసాదించిన ఊరి బడికి ఉపకారం చేయాలన్న సంకల్పంతో సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి ఏటా ఉత్తమ విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు స్కూల్లో అవసరం మేరకు తమవంతు సహకారం అందజేస్తున్నాం. పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా సాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.
-శేషగిరిరావు, పూర్వ విద్యార్థి (యూఎస్‌ఏ)
 
స్కూల్‌ మరమ్మతుల నుంచి సేవా కార్యక్రమాలు
మాచవరం స్కూల్లో తరగతి గదులు శిథిలావస్థలో ఉండడంతో అప్పటి నుంచి తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాం. ఇక్కడ చదివి.. విదేశాల్లో ఉన్న వారందరితో మాట్లాడాం. వారంతా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 30 మంది నుంచి ప్రారంభమైన మా సేవలు ప్రస్తుతం 70 మంది వరకు చేరింది. మా బడిని మేం బాగు చేసుకునేందుకు ఆర్థిక సహకారం అందిస్తున్నాం.
-రామకోటేశ్వర్‌రావు, పూర్వ విద్యార్థి
 
-మెదక్‌ రూరల్‌