ఆ ప్రవాసీయులు.. రైతు బాంధవులు

తెలుగు రాష్ట్రాల రైతుల చేయూతకు టెకీల సంకల్పం

పంటల పెట్టుబడికి వడ్డీలేని రుణాలు
ఏటా ఓ గ్రామం దత్తత
ఒక్కొ రైతుకు 10-15వేలు
ఇప్పటికే 15మంది రైతులకు సాయం
పంటలు నష్టపోతే పూర్తి అప్పు మాఫీ
దుబాయ్‌లో ప్రత్యేక సంస్థ ఏర్పాటుతో కృషి
జగిత్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారంతా 15మంది దుబాయ్‌లో ఒకేచోట ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందరూ రైతు బిడ్డలే! భూమిపుత్రుల కష్టం విలువ తెలిసి కాబోలు.. తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేద రైతులకు అండగా నిలుస్తున్నారు. భూమి ఉన్నా.. పంటల సాగుకు పెట్టుబడి పెట్టే స్థోమతలేని రైతన్నలకు నగదు సాయం అందిస్తున్నారు. ఇచ్చిన మొత్తాన్ని పంట దిగుబడి వచ్చిన తర్వాతే తీసుకుంటున్నారు.
 
అదీ.. వడ్డీలేకుండా. పంట చేతికి అందని రైతులపై ఒత్తిడి చేయడం లేదు. పైగా అలాంటివారికి ఇచ్చిన మొత్తానంతా మాఫీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం దుబాయ్‌లో ‘రైతు బాంధవ’ పేరుతో వారంతా కలిసి దుబాయ్‌లో ప్రత్యేక సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే 15మంది రైతులకు సాయం అందింది. వరంగల్‌కు చెందిన రాజా శ్రీనివా్‌సరావు ఈ సంస్థకు నాయకత్వం వహిస్తుండగా, చైతన్యసుధ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
సాయం ఇలా..
రైతు బాంధవ సంస్థ ద్వారా ఏటా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. అక్కడ ఆర్థికంగా చితికిపోయిన రైతులను గుర్తిస్తారు. వారికి పంటల సాగుకు పెట్టుబడి కింద ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు అందిస్తారు. ఇచ్చిన మొత్తాన్ని పంట పండించిన తర్వాత రైతుల నుంచి వడ్డీ లేకుండా తీసుకుని, ఇతర రైతులకు అందిస్తారు. 2016లో జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కుమ్మరిపెల్లిని దత్తత తీసుకున్నారు. గ్రామంలోని 15 మంది రైతులను ఎంపిక చేసి, గత ఖరీఫ్ లో తలా రూ.10వేల చొప్పున రూ.1.5 లక్షలను పెట్టుబడి సాయం కింద అందజేశారు.
 
కాగా భూమరాజం అనే రైతు.. దిగుబడి రాక పూర్తిగా నష్టపోయాడని తెలిసి, ఆయన రుణాన్ని మాఫీ చేశారు. మిగిలిన 14 మంది రైతుల నుంచి రూ.1.4 లక్షలను తీసుకొని, ఆ డబ్బును ఈ రబీ సీజన్‌లో మరో 15 మంది రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజా శ్రీనివా్‌సరావు రెండు రోజుల క్రితం కుమ్మరిపెల్లికి చేరుకున్నారు. పెట్టుబడి తీసుకున్న రైతులతో సమావేశమయ్యారు. రైతులు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడంతో ఆ గ్రామంలో మరో 15 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెట్టుబడి సాయానికిగాను రైతులను ఎంపిక చేసే బాధ్యతను గ్రామస్థులకే అప్పగిస్తారు. ఇందుకుగాను కుమ్మరిపెల్లిలో నలుగురు సభ్యులతో ఓ కమిటీ వేశారు. కాగా ప్రవాసీయుల కృషిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
 
కూలీ గోస తప్పింది
మాకు కొంతే భూమి ఉంది. పంట పెట్టుబడికి బ్యాంకు అధికారులు రుణం ఇవ్వమని చెప్పారు. దీంతో సాగు మానేసి కూలీ పనికి సిద్ధమయ్యాం. అయితే, దుబాయ్‌లోని ప్రవాసీయుల సంస్థ మాకు అండగా నిలిచింది. రూ.10 వేల సాయం ఇవ్వడంతో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసుకున్నాం. మాకు కూలీపని చేసే గోస తప్పింది’’
- మ్యాదరవేని కొమురవ్వ, మహిళా రైతు, కుమ్మరిపెల్లి
రైతుల కష్టాలు తొలగించేందుకే
‘‘నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. అందుకే, రైతుల కష్టాలు నాకు తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 15 మందిమి ఒకేచోట దుబాయ్‌లో స్థిరపడ్డాం. రైతులకు ఏదైనా చేయాలనే ఆలోచనతో రైతు బాంధవ సంస్థను ఏర్పాటు చేశాం. ఏటా ఒకట్రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని, రైతులకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాం. పంట నష్టం జరిగిన రైతులకు రుణాలు కూడా మాఫీ చేస్తున్నాం’’
-రాజా శ్రీనివాస్ రావు, రైతు బాంధవ సంస్థ నిర్వాహకుడు
 
పేద రైతులకు అండ
‘‘పేద రైతులకు ‘రైతు బాంధవ’ సంస్థ ఎంతో అండగా ఉంటోంది. ఏ బ్యాంకుకు వెళ్లినా మాకు అప్పు పుట్టలేదు. ఈ సంస్థ నాకు రూ.10 వేలు పెట్టుబడి కింద అందించింది. పంట పండాక తిరిగి చెల్లించాను’’
- లక్ష్మణ్‌, రైతు, కుమ్మరిపెల్లి