తిరిగొస్తాం..తీసుకెళ్లండి!

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ప్రతి 8 గంటలకు ఒక కాల్‌
కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు
తెలుగురాష్ట్రాల ఎన్నారై వధువుల నుంచే ఎక్కువగా ఇలాంటి కాల్స్‌
 
బెంగళూరు, ఫిబ్రవరి 5: అమ్మాయి తల్లిదండ్రులకు అమెరికా సంబంధం కావాలి. అమెరికాలో అబ్బాయి ఉన్న తల్లిదండ్రులకు.. ఆస్తిపాస్తులు బాగున్న అమ్మాయి సంబంధం కావాలి. ఎన్నారై అల్లుడు దొరికాడని అమ్మాయి కుటుంబం సంతోషిస్తే, అమ్మాయి కన్నా ఆమె వెంట నడిచివచ్చే సిరిసంపదలపైనే అబ్బాయి కుటుంబం కన్నేస్తోంది. అందులో ఏమైనా తేడా జరిగితే కన్నెర్ర చేస్తోంది.
 
మన తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి కాపురాలు చేస్తున్న వివాహితల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తాజా పరిశీలనలో తెలిసింది. ‘మరింత కట్నం’ వేధింపులను తట్టుకోలేమని, తమను తీసుకెళ్లాలంటూ, ప్రతి 8 గంటలకు ఒకరు చొప్పున తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి అభ్యర్థిస్తున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది.
 
కొన్నాళ్ల క్రితం ఎన్‌ఆర్‌ఐ వధువుల పరిస్థితిపై జాతీయ ప్రజా సహకారం, శిశు అభివృద్ధి సంస్థ నిర్వహించిన అధ్యయన ఫలితాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం.
 
ఎన్‌ఆర్‌ఐ సమస్యలపై పనిచేసేందుకు గతంలో ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉండేది. దానిని 2007లో విదేశాంగ మంత్రిత్వ శాఖలో విలీనం చేసి.. ఎమ్‌ఏడీఏడీ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేసే ఈ విభాగానికి వచ్చే ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుల్లో వివాహ సంబంధమైనవి ఒకటో రెండో తప్పకుండా ఉంటున్నాయి. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలు చేసుకొన్నవారిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన వివాహితల నుంచి తమ కు ఎక్కువగా కట్నం సమస్యపై ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని ఈ విభాగం పేర్కొంది.
 
అబద్ధాలు చెప్పి మోసపు పెళ్లి చేసుకొన్నారంటూ, గుజరాత్‌, పంజాబ్‌ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించింది. అటు అదనపు కట్నం కేసులు, ఇటు వంచనకు గురయిన ఉదంతాలకు సంబంధించి తమకు.. ప్రతి 8 గంటలకు ఒక ఫోన్‌కాల్‌ చొప్పున రోజుకు మూడు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంది. జనవరి 2015 నుంచి నవంబరు 2017 మధ్య కాలంలో, అంటే 1,064 రోజుల్లో 3,328 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో ఎక్కువ ఫోన్‌ కాల్స్‌ అరబ్‌ దేశాలనుంచి వచ్చాయని, అమెరికా, కెనడా దేశాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయని చెన్నైకు చెందిన ప్రముఖ న్యాయవాది సుధా రామలింగం వివరించారు.
 
ఏపీ, తెలంగాణలకు చెందిన ఎన్‌ఆర్‌ ఐ వధువుల నుంచి కట్నం సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని ఆరతీ రావు అనే మాజీ మహిళా దౌత్యాధికారి తెలిపారు. ఏదో చేసుకోవాలి కాబట్టి, పెళ్లికి సిద్ధమవుతున్నారేగానీ, భార్యతో కలిసి ఉండాలనే ఆసక్తి ఎన్‌ఆర్‌ఐ అబ్బాయిల్లో కనిపించడంలేదని ఆరతి అన్నారు. వీరంతా తమ భర్తల చేతుల్లో తీవ్ర చిత్రహింసలు అనుభవిస్తున్నారని తెలిపారు.
 
బహ్రెయిన్‌లో ఓ ఎన్‌ఐఆర్‌ భర్త.. తన భార్య డాక్యుమెంట్లను నాశనం చేసి, ఆమెకు కనీసం ఫోన్‌ను కూడా అందుబాటులో లేకుండా చేశాడని ఆరతి వివరించారు. అయితే, తమ దృష్టికి వచ్చిన ఇలాంటి కేసులకు మాత్రమే న్యాయం చేయగలుగుతున్నామని ఆరతి, రామలింగం తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలపై మోజును అమ్మాయి తల్లిదండ్రులు వదులుకొన్నప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ప్రముఖ సామాజికవేత్త సమతా దేశ్‌మానే తేల్చిచెప్పారు.